సచివాలయ పరీక్షలు.. క్షణం ఆలస్యమైనా నో ఎంట్రీ 

23 Aug, 2019 07:18 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్, చిత్రంలో ఎస్పీ ఫక్కీరప్ప, ట్రైనీ కలెక్టర్‌ విధేకరే, డీఆర్వో వెంకటేశం

జిల్లాలో 9,597 పోస్టులకు 2,01,886 మంది దరఖాస్తు 

ఆగస్టు 25 అర్ధరాత్రి నుంచి హాల్‌ టిక్కెట్ల డౌన్‌లోడ్‌ 

444 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు   

అభ్యర్థుల సందేహాలకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు 

1,500మంది పోలీసులతో మూడంచెల భద్రత 

సాక్షి, కర్నూలు: గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలకు ఒక్క క్షణం ఆలస్యమైనా అనుమతించబోమని జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కె.ఫక్కీరప్ప, ట్రైనీ కలెక్టర్‌ విధేకరే, డీఆర్వో వెంకటేశంతో కలసి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఉదయం 10 నుంచి 12.30 గంటల మధ్య, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల మధ్య ప్రతీ రోజూ రెండు పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లాలో 881 గ్రామ, 300 వార్డు సచివాలయాల్లో 9,597 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసిందన్నారు. మొత్తం 19 రకాల పోస్టుల కోసం 2,01,886 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరందరికీ సెప్టెంబర్‌ 1 నుంచి 8వ తేదీవరకు 444 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాను 12 క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని, ఒక్కోదానికి ఒక్కో జిల్లా అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. మొత్తం 12,104 మంది సిబ్బందిని పరీక్షల నిర్వహణ కోసం నియమించినట్లు వివరించారు. 

25 నుంచి హాల్‌ టిక్కెట్ల డౌన్‌లోడ్‌ 
అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ అర్ధరాత్రి నుంచి హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. హాల్‌టిక్కెట్‌లో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు చేసి సరి చేసుకోవచ్చని సూచించారు. అలా కానిపక్షంలో తెల్ల కాగితంపై హాల్‌ టిక్కెట్‌లో ఉండే వివరాలు రాసుకొని మూడు ఫొటోలు తీసుకొని వాటిపై గెజిటెడ్‌ ఆఫీసర్‌ సంతకం చేయించుకొని తీసుకొని రావచ్చని సూచించారు.  
 
మొదటి రోజు పరీక్షకే అధిక సంఖ్యలో హాజరు.. 
సెప్టెంబర్‌ 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే పరీక్షల్లో మొదటి రోజు నిర్వహించే పరీక్షనే కీలకమని, ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 44 మండలాల్లో 444 కేంద్రాల్లో 1.15 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మిగిలిన  పరీక్షలను కేవలం కర్నూలులో మాత్రమే నిర్వహిస్తామని, అయితే ఆయా పరీక్షలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు లేరన్నారు. మూడో తేదీ పరీక్షకు 18 వేలు, 4వ తేదీ పరీక్షకు 4,631 మంది, ఆరో తేదీ పరీక్షకు 1,574, ఏడో తేదీ పరీక్షకు 10,638 మంది, 8వ తేదీ పరీక్షకు21,856 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్ష పూర్తి అయిన తరువాత అభ్యర్థులకు కార్బన్‌తో కూడిన ఓఎంఆర్‌ సీటులో కార్బన్‌ పేపర్‌ను అభ్యర్థులకే ఇస్తారని తెలిపారు. పరీక్షలు ముగిసిన తరువాత జిల్లా వ్యాప్తంగా ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి అన్సర్‌ షీట్లు, ఓఎంఆర్‌ షీట్లను జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలో ఉంచనున్నట్లు తెలిపారు.  

మూడంచెల భద్రత.. 
గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. అడిషినల్‌ ఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు డీఎస్పీలు, 44 మంది సీఐలు, 109 మంది ఎస్‌ఐలు, 1334 మంది పోలీసు కానిస్టేబుళ్లుతో కలసి మొత్తం 1500 మంది సిబ్బంది భద్రత సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. వీరంతా రూట్లతోపాటు పరీక్ష కేంద్రం, స్ట్రాంగ్‌ రూమ్‌లు, వాహనాల తరలింపు విభాగాల్లో ఉంటారన్నారు. కర్నూలులో అభ్యర్థులకు రూట్లు, ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఆరు డెస్కులను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు వెళ్లడానికి ఆర్టీసీ తగిన బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  

దళారులను నమ్మి మోసపోవద్దు... 
సచివాలయ ఉద్యోగాలను పూర్తిగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే భర్తీ చేస్తారని, ఇందులో ఎలాంటి మోసాలకు తావులేదని జిల్లా కలెక్టర్, ఎస్పీ అన్నారు. ఈ పోస్టులు ఇప్పిస్తామని కొందరు దళారులు రంగ ప్రవేశం చేసినట్లు తమకు సమాచారం వస్తోందని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. ఎక్కడైనా దళారులు డబ్బులు డిమాండ్‌ చేసి పోస్టులు ఇప్పిస్తామని చెప్పితే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌/ స్థానిక పోలీసు స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓలకు ఫిర్యాదు చేయాలని వారు సూచించారు.  

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు.. 
గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలపై ఉన్న సందేహాలకు కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. నేరుగావచ్చి లేదా 08518–277305/9059477167 నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాక rtfrkurnool@fmail.com మెయిల్‌ చేసినా కూడా సందేహాలను నివృత్తి చేస్తారని వివరించారు.   

మరిన్ని వార్తలు