‘అతి’ ఏదైనా ప్రమాదకరమే

17 Oct, 2017 15:43 IST|Sakshi

‘అతి’ ఏదైనా ప్రమాదకరమే. ‘మితంగా’ ఉంటేనే ఉపయుక్తం. ఇప్పుడు వర్షాలదీ అదే పరిస్థితి. అవసరమున్నప్పుడు చినుకు నేలరాలదు. ఇప్పుడు వద్దు..వద్దంటున్నా వదలడం లేదు. వరుణుడి ప్రకోపానికి జనం చిగురుటాకులా వణికిపోతున్నారు. పంట పొలాలన్నీ తుడిచిపెట్టుకుపోతుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వాగులు, వంకలు ఏకమై ఊళ్లను ముంచెత్తుతున్నాయి. ఎప్పుడు ఉపద్రవం ముంచుకొస్తుందోనని లోతట్టు ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. తాజాగా ఆళ్లగడ్డ, మహానంది, శిరివెళ్ల, కోసిగి, రుద్రవరం తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.  

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాపై వరుణుడి ప్రకోపం తగ్గడం లేదు. కుండపోతగా వర్షిస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి కుళ్లిపోతున్నాయి. సోమవారం ఉదయం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కుండకోత వర్షాలు కురవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఆళ్లగడ్డలో ఏకంగా 19 సెంటీమీటర్లు, మహానందిలో 13 సెంటీమీటర్ల వర్షాలు పడటంతో వాగులు, వంకలు, పంట పొలాలు ఏకమయ్యాయి.  41మండలాల్లో తేలికపాటి నుంచి కుండపోతగా వర్షాలు కురిశాయి.  జిల్లా సగటున 22.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అక్టోబరులో ఇప్పటి వరకు49శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.

 2,577 ఇళ్లు తీవ్రంగా దెబ్బతినగా ఒక్కరోజులోనే అధిక వర్షాలకు 560 గృహాలు కూలిపోయినట్లు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి సమాచారం అందింది. నంద్యాల డివిజన్‌లో 357 ఇళ్లు పాక్షికంగా, 8 ఇళ్లు పూర్తిగా, ఆదోని డివిజన్‌లో 11 పూర్తిగా, 144 పాక్షికంగా,  కర్నూలు డివిజన్‌లో 47 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.  మట్టిమిద్దెలు పూర్తిగా  కూలిపోతున్నాయి. ఆళ్లగడ్డ మండలం బత్తులూరు, నల్లగట్ల, నందిన్‌పల్లి, గూబగుండం, పేరాయిపల్లి తదితర గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.  ఆళ్లగడ్డ– అహోబిలం, కృష్ణాపురం– కోటకందుకూరు, ఓబులంపల్లి– ఆళ్లగడ్డ  మధ్య వాగులకు వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

శిరివెళ్లలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బందంలో ఉండిపోయాయి. తహసీల్దారు కార్యాలయం, పోలీస్‌ స్టేషన్, జిల్లా పరిషత్‌ హైస్కూల్లోకి వెళ్లేందుకే వీలు కాలేదు. రెవెన్యూ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి వచ్చింది. మహానంది మండలం అబ్బీపురం, తిమ్మాపురం, గాజులపల్లి, బుక్కాపురం తదితర గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.  ఆళ్లగడ్డ, మహానంది, శిరివెళ్ల, రుద్రవరం, దొర్నిపాడు తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగి కుళ్లిపోతోంది. ఇప్పటికే వేరుశనగ, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు అపారనష్టం వాటిల్లింది. రబీలో సాగు చేసిన శనగ సైతం కుళ్లిపోతోంది. ఇప్పటికే వ్యవసాయశాఖ 32వేల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు  ప్రకటించింది. ఈ నష్టం భారీగా పెరిగే పరిస్థితి ఉంది. కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్‌లలో ఉల్లి పొలాల్లోనే కుళ్లిపోతుండటంతో  రైతులు లబోదిబోమంటున్నారు. 

మరిన్ని వార్తలు