కరోనా వైరస్‌: ఆ ఒక్కరి వల్ల.. 

8 Apr, 2020 09:35 IST|Sakshi

నంద్యాల వాసులు 8 మందికి కరోనా ‘పాజిటివ్‌’ 

మహారాష్ట్రలోని లాతూరులో  క్వారంటైన్‌

సాక్షి, ముంబై: లాక్‌డౌన్‌ సమయంలో హరియానా నుంచి తిరిగొస్తూ మహారాష్ట్రలోని లాతూరు జిల్లా నీలంగాలో ఓ ప్రార్థన మందిరంలో పట్టుబడిన కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంత వాసులు 12 మందిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరందరినీ లాతూరు సివిల్‌ ఆసుపత్రిలో క్వారంటైన్‌లో ఉంచారు. కోవిడ్‌ సోకిన వారికి అక్కడే చికిత్స అందజేస్తున్నారు. వారు చికిత్సకు సహకరిస్తున్నారని, కాకపోతే  ప్రస్తుత పరిస్థితుల వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలుగు వారైన లాతూరు జిల్లా కలెక్టర్‌ జి.శ్రీకాంత్‌ ‘సాక్షి’కి తెలిపారు. ముఖ్యంగా వీరిలో ఒక్కరు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు ఉండడంతో మిగతా వారికి కూడా కరోనా సోకిందని సమాచారం.  

ఈ 12 మంది గత ఏడాది డిసెంబరు 15న నంద్యాల నుంచి బయలుదేరి ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని పలు ప్రార్థనామందిరాలను సందర్శించారు. చివరకు హరియానాకు చేరుకున్నారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ నహూ జిల్లా ఫిరోజ్‌పూర్‌లో అధికారుల నుంచి  పాస్‌ తీసుకుని రెండు వాహనాలలో ముందుకు సాగారు. ఈ నెల ఒకటవ తేదీ అర్ధరాత్రి లాతూరు జిల్లా నీలంగాలోని ప్రార్థనామందిరానికి చేరుకున్నారు. వీరి గురించి చుట్టుపక్కల వారు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది. ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరికీ కరోనా పరీక్షలు చేయించారు. ఎనిమిది మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో అందరినీ ఆసుపత్రికి తరలించారు. లాతూరులోనే అడ్డుకోనట్టయితే నంద్యాల ప్రాంతంలో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండేది. 

>
మరిన్ని వార్తలు