పేరు ఒకరిది..ఫోన్‌ నంబర్‌ మరొకరిది

15 Jul, 2020 10:42 IST|Sakshi

కరోనా మృతి నివేదికలో గందరగోళం

ఒకరికి బదులు మరొకరి సమాచారం చేరవేత

మృతురాలికి కరోనా లేదని కుటుంబీకుల వాదన

కర్నూలు(హాస్పిటల్‌): కరోనా బాధితుల వివరాలు నమోదు చేయడంలో తప్పులు దొర్లుతున్నాయి. ప్రధానంగా ఒకే పేరు గల వ్యక్తుల సమాచారం నివేదించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. తాజాగా నంద్యాల మండలం గోస్పాడు మండలానికి చెందిన 40 ఏళ్ల మహిళ విషయంలో ఇదే జరిగింది. ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున 2.46 నిమిషాలకు ఆమె దగ్గు, తీవ్ర ఆయాసంతో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చింది. ఆమెకు ముందుగా ట్రూనాట్‌(కరోనా) పరీక్ష చేశారు. అందులో ఆమెకు కరోనా లేదని వచ్చింది. అయితే, ఆమెకు కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో అనుమానంతో వైద్యులు   ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షకు స్వాబ్‌ తీసి పంపించారు. ఈలోగా చికిత్స పొందుతూ ఆమె మధ్యాహ్నం మృతి చెందారు.

చికిత్స సమయంలోనే ఆమెకు కరోనా పాజిటివ్‌గా నివేదిక వచ్చింది. అయితే, ఆమె వివరాలను కలెక్టరేట్‌కు పంపించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. మృతురాలి పేరుతోనే కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన మహిళ కూడా ఉండటంతో ఆమె పేరున వివరాలు పంపించారు. వాస్తవానికి బుధవారపేట మహిళకు కరోనా నెగిటివ్‌ వచ్చింది. అయితే, ఈమెకు పాజిటివ్‌ ఉన్నట్లు కలెక్టరేట్‌కు సమాచారం పంపి ఫోన్‌ నెంబర్‌ మాత్రం గోస్పాడుకు చెందిన మృతురాలి కుటుంబీకులది ఇచ్చారు. దీంతో కలెక్టరేట్‌ నుంచి ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసి, ఫలానా పేరు గల మహిళⶠ మీ వారేనా? మీది బుధవారపేటనా? అని గోస్పాడుకు చెందిన వారిని అడగగా  తాము కాదని  సమాధానమివ్వడంతో ఫోన్‌ పెట్టేశారు.  తన తల్లికి కరోనా ఉందని  తప్పుడు నివేదిక ఇచ్చి మృతదేహాన్ని మార్చురీలో ఉంచారని వెంటనే తమకు అప్పగించాలని మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు.  ఆసుపత్రి సిబ్బంది వివరాలు నమోదులో చేస్తున్న పొరపాట్టే  ఈ గందరగోళానికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు