నగర పాలక సంస్థలో లంచావతారులు

25 Apr, 2018 06:58 IST|Sakshi
కర్నూలు నగర పాలక సంస్థ బిల్‌ కలెక్టర్‌ సుధాకర్‌ను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ జయరామరాజు

మసకబారుతున్న ప్రతిష్ట తాజాగా ఏసీబీకి పట్టుబడ్డ బిల్‌ కలెక్టర్‌ 

కేసు నమోదు..రిమాండ్‌కు తరలింపు 

మరికొందరిపై ఫిర్యాదులు 

కర్నూలు(టౌన్‌) : ఈ ఏడాది జనవరి 27న కర్నూలు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేసే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ బాలసుబ్రమణ్యం రూ.15 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్‌కు బిల్లులు క్లియరెన్స్‌ చేసేందుకు ఈ లంచం డిమాండ్‌ చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఇది మరువక ముందే తాజాగా మంగళవారం నగర పాలక రెవెన్యూ విభాగంలో పనిచేసే బిల్‌ కలెక్టర్‌ సుధాకర్‌ రూ.5 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ ఘటనలు నగర పాలక సంస్థ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.  
ప్రక్షాళన ఏదీ? 
పన్ను వసూళ్లలో నగర పాలక రెవెన్యూ విభాగం కీలకమైనది. ఈ విభాగంలో ఇద్దరు రెవెన్యూ అ«ధికారులు, ఏడుగురు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, 23 మంది బిల్‌ కలెక్టర్లు ఉన్నారు. వీరంతా 94 వేల అసెస్‌మెంట్లకు సంబంధించిన ఆస్తి పన్ను, 48 వేల కొళాయి కనెక్షన్ల నీటి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. రెండు అర్ధ సంవత్సరాల్లో ఆస్తి పన్ను రూ.36 కోట్లు, నీటిపన్ను రూ.8 కోట్లు వసూలు చేయాలి. అలాగే నూతనంగా చేపట్టే ఇళ్లు, భవనాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, అపార్టుమెంట్లు .. ఇలా ప్రతి నిర్మాణానికి పన్ను వేయాల్సి ఉంటుంది. ఇక్కడే పెద్దఎత్తున అవినీతి జరుగుతోందన్న విమర్శలున్నాయి.  
రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. 
కర్నూలు నగరంలోని కల్లూరు అయ్యప్పస్వామి నగర్‌లో నాగ లక్ష్మీదేవి కుటుంబం ( రెవెన్యూ వార్డు 77) నివసిస్తోంది. వారికి అక్కడే సాయి విద్యానికేతన్‌ స్కూలు ఉంది. ఈ స్కూలుకు కొళాయి కనెక్షన్‌ కావాలని అదే ఏరియాకు చెందిన బిల్‌ కలెక్టర్‌ సుధాకర్‌ను ఆశ్రయించారు. కొళాయి కనెక్షన్‌ కావాలంటే ముందుగా పన్ను వేయాలంటూ నెలరోజుల పాటు తిప్పుకున్నారు. చివరకు బిల్‌ కలెక్టర్‌  రూ.5 వేలు లంచం డిమాండ్‌ చేశారు. అప్పటికే విసిగి వేజారిన నాగలక్ష్మీదేవి తమకు తెలిసిన వ్యక్తి రవికుమార్‌ ద్వారా మాట్లాడించి.. రూ.5 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు.

ఇదే విషయంపై రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుధాకర్‌ను వల పన్ని పట్టుకునేందుకు వారు పక్కా వ్యూహాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక శ్రీరామ థియేటర్‌ వద్ద  బిల్‌ కలెక్టర్‌ రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా.. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి నగరపాలక రెవెన్యూ విభాగానికి తరలించి విచారించారు. ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని.. రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు.  నగరపాలక సంస్థలో మరికొంత మంది ఉద్యోగులపై ఫిర్యాదులు ఉన్నాయని, వాటిపైనా దృష్టి పెట్టామని డీఎస్పీ తెలిపారు.   

మరిన్ని వార్తలు