తల్లీబిడ్డ క్షేమంగా..

20 Jun, 2020 13:03 IST|Sakshi
బిడ్డను ఒళ్లో పెట్టుకున్న కుటుంబీకురాలు

కరోనాకు ఎదురొడ్డి ప్రసవాలు

భయపడకుండా సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది

ప్రతి నెలా 800కు పైగా డెలివరీలు

‘పెద్ద’రికాన్ని నిలబెట్టుకుంటున్న సర్వజన ఆసుపత్రి

అసలే కరోనా కాలం. ఎదుటి వారితో మాట్లాడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి.ఇలాంటి సమయంలోనూ కర్నూలు పెద్దాసుపత్రి వైద్యులు ప్రత్యేకతనుచాటుకుంటున్నారు. ‘పెద్ద’ మనసుతో వైద్యసేవలు కొనసాగిస్తూప్రజల మన్ననలు చూరగొంటున్నారు.ముఖ్యంగా ప్రసూతి విభాగంఅందిస్తున్న సేవలుకష్టకాలంలో గర్భిణులకువరంగా మారాయి.

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)ను స్టేట్‌ కోవిడ్‌ సెంటర్‌గా మార్చారు. ఇక్కడ అందే సాధారణ వైద్యసేవలను ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నగరంలో 12కు పైగా ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ’ నెట్‌వర్క్‌ ఆసుపత్రులను ఎంపిక చేశారు. అయితే.. పెద్దాసుపత్రిలో మాతా శిశువులకు ఉన్న వసతులు, వైద్యులు, సిబ్బంది సేవలు బయట అందించలేరన్న ఉద్దేశంతో చిన్నపిల్లల విభాగం, ప్రసూతి విభాగాలను ప్రైవేటుకు ఇవ్వకుండా ఇక్కడే ఉంచారు. ఈ విభాగాలకు కరోనా రోగులు, వారి కుటుంబ సభ్యులు, వారికి చికిత్స అందించే వైద్యులు, సిబ్బంది వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. 

ప్రతి నెలా 800కు పైగా ప్రసవాలు
జిల్లాలో లాక్‌డౌన్‌ కారణంగా కొన్నాళ్ల క్రితం వరకు ప్రజారవాణా ఆగిపోయింది. ఆ సమయంలోనూ జిల్లానలుమూలల నుంచి గర్భిణులను సొంత ఏర్పాట్లతో పెద్దాసుపత్రి ప్రసూతి విభాగానికి తీసుకొచ్చి.. ప్రసవం చేయించారు. ఇక్కడ అన్ని రకాల వసతులు ఉంటాయని, నిపుణులైన వైద్యులు, సిబ్బంది ఉంటారని, ప్రసవానికి వెళితే ఎలాంటి ఇబ్బందీ ఉండదన్న ఉద్దేశంతో దూరాభారమైనా  గర్భిణులను ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ విభాగంలో సాధారణ రోజుల్లో ప్రతి నెలా 900 నుంచి 1,000 దాకా ప్రసవాలు జరిగేవి. అలాగే లాక్‌డౌన్‌ సమయంలోనూ 800లకు పైగా జరగడం విశేషం. జిల్లా మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్యలో దాదాపు సగం పెద్దాసుపత్రిలోనే చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.  

ధైర్యంగా వైద్యసేవలు
కరోనా కాలంలోనూ వైద్యులు ఏమాత్రమూ జంకకుండా సేవలు కొనసాగిస్తున్నారు. ప్రసూతి విభాగంలో ఏడు యూనిట్లు ఉన్నాయి. నలుగురు ప్రొఫెసర్లు, ఐదుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 13 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు 18 మంది పీజీలు వైద్యసేవలు అందిస్తున్నారు. వీరే కాకుండా లాక్‌డౌన్‌ సమయంలో అదనంగా నలుగురు ఓబీజీ స్పెషలిస్టులు (ప్రసూతి–గైనకాలజిస్టులు), నలుగురు ఎంబీబీఎస్‌ వైద్యులను నియమించారు. ఇక్కడ చేరిన నలుగురు గర్భిణులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయినా వైద్యులు, సిబ్బంది భయపడకుండా వైద్యసేవలు అందించారు. ముగ్గురికి సాధారణ ప్రసవం, ఒకరికి సిజేరియన్‌ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు సిబ్బందికి కరోనా సోకినా వెరవలేదు. ప్రస్తుతం వారంతా కోలుకుని తిరిగి విధుల్లో చేరడం గుండె నిబ్బరానికి నిదర్శనం. 

కోవిడ్, నాన్‌ కోవిడ్‌లుగా విభజించి...
గర్భిణులను ప్రసవ తేదీ దగ్గరగా ఉంటేనే ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. వారికి ముందుగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. కరోనా ఉంటే కోవిడ్‌ డివిజన్‌లో చేర్చుతున్నారు. వైరస్‌ లేని వారిని నాన్‌ కోవిడ్‌ డివిజన్‌లో అడ్మిట్‌ చేస్తున్నారు. వైద్యులను సైతం ఇందుకు ప్రత్యేకంగా నియమించి సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. వైద్యులు, సిబ్బంది స్వీయరక్షణలో భాగంగా పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడుతూ సేవలందిస్తున్నారు.

కరోనా వచ్చినా భయపడలేదు
కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ మేము ఏ మాత్రమూ భయపడలేదు. స్వీయరక్షణ చర్యలు తీసుకుని గర్భిణులకు వైద్యసేవలు అందిస్తామని చెప్పాం. ఈ మేరకు ఎప్పటిలాగే సేవలు కొనసాగిస్తున్నాం. కొందరికి కరోనా సోకినా కొద్దిరోజుల్లోనే రికవరీ అయ్యి.. మళ్లీ విధుల్లో చేరారు. వారి ధైర్యానికి సెల్యూట్‌.   –డాక్టర్‌ బి.ఇందిర, గైనకాలజీ హెచ్‌వోడీ, పెద్దాసుపత్రి

మరిన్ని వార్తలు