టిస్కా శ్రీమతి ఇండియా సౌత్‌బ్రాండ్‌ అంబాసిడర్‌గా కర్నూలు డాక్టర్‌

25 Sep, 2019 10:16 IST|Sakshi
ఢిల్లీలో క్రౌన్‌ ధరిస్తున్న తరణ్ణుం జాఫ్రి

సాక్షి, కర్నూలు :  కర్నూలుకు చెందిన డాక్టర్‌ తరణ్ణుం జాఫ్రి తన అందచందాలు, ప్రతిభతో ‘టిస్కా శ్రీమతి ఇండియా సౌత్‌బ్రాండ్‌ అంబాసిడర్‌–2019‘ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి కిరీటం దక్కించుకున్నారు. ఈమె సొంతూరు ఢిల్లీ కాగా  2016లో నగరంలోని వడ్డేగేరికి చెందిన అనెస్తీషియా వైద్యుడు డాక్టర్‌ మీర్జా అఫ్జల్‌ బేగ్‌తో వివాహం కావడంతో కర్నూలు వాసి అయ్యారు.  ఆమె భర్త ఉద్యోగం రీత్యా ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. ఎన్‌సీసీకి జాతీయ స్థాయిలో మొట్టమొదటి మహిళా లెఫ్టినెంట్‌గా పనిచేసిన అజీజా జాఫ్రికి ఈమె స్వయాన కుమార్తె. ఆమె ఎంఎడ్, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. అధ్యాపకురాలిగా, గాయకురాలిగా, నటిగా రాణిస్తున్నారు. ఇటీవల 2019 జులై 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఢిల్లీలోని ఐటీసీ వెల్‌కం హోటల్లో మోడాజ్జీ, సన్‌రైస్‌ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టిస్కా మిస్‌ అండ్‌ మిసెస్‌ ఇండియా పాజీంట్‌ 2019’ పోటీల్లో ఈమె దక్షిణాది నుంచి పాల్గొని ‘టిస్కా శ్రీమతి ఇండియా సౌత్‌బ్రాండ్‌ అంబాసిడర్‌–2019 స్థానం దక్కించుకున్నారు.

సన్‌రైజ్‌ విజన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ స్వాతి దీక్షిత్, మోడాజ్జీ కంపెనీ డైరెక్టర్‌ ప్రభాత్‌ దీక్షిత్‌ చేతుల మీదుగా క్రౌన్‌ (కిరీటం) అందుకున్నారు. అంతే కాకుండా ‘మిసెస్‌ ఇండియా టాలెంటెడ్‌–2019, ‘మిసెస్‌ ఇండియా బ్యూటీ విత్‌ బ్రైన్‌–2019 అనే రెండు ప్రత్యేక టైటిల్స్‌ను కూడా సాధించారు. సౌందర్యం, మేధావితనం ద్వారా జాతీయస్థాయిలో నెగ్గిన 40 మంది మహిళలు ఈ కిరీటానికి పోటీ పడ్డారు. 2018 డిసెంబరు 1న బెంగళూరులో నిర్వహించిన సెమీఫైనల్స్‌లో దక్షిణాది నుంచి ‘మిసెస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌’ ఫైనల్స్‌కు అర్హత సాధించారు.  ‘సబక్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో, ‘తూతూ మైమై’ యూట్యూబ్‌ చానల్‌లో కామెడీ సీరియల్స్‌లో నటించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు