గుండెల్లో గోదారి

13 Nov, 2017 12:15 IST|Sakshi

తూర్పు’తో అనుబంధం నెమరువేసుకున్న కె.విశ్వనాథ్‌

మండపేటలో ఆత్మీయ సత్కారం

మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం పసలపూడి గ్రామంలో కొన్ని నెలల పాటు ఉండి.. సిరిసిరిమువ్వ సినిమాను కళాత్మకంగా తీసేందుకు దర్శకుడు కె.విశ్వనాథ్‌ పడిన తపనను.. ఆయన మహోన్నతికి వెన్నంటి ఉండి సహకరించిన జిల్లావాసులపై.. వల్లమాలిన అభిమానాన్ని విశ్వనాథ్‌ ఉద్వేగంతో చెప్పేసరికి.. ఆహూతులు పులకరించిపోయారు. మాటలకు అందని ఆనందం అందరిలో కలిగింది. మండపేటలో జరిగిన సత్కార సభలో కృతజ్ఞతాపూర్వకంగా.. జిల్లాతో ఉన్న అనుబంధాన్ని, సినీ దర్శకుడు జంధ్యాలతో ఆత్మీయతను నెమరువేసుకున్నారు. అందుకేనేమో.. నడవలేని స్థితిలో ఉన్నా సరే.. గోదావరి గడ్డపై నిర్వహించే కార్యక్రమానికి ఓపిక చేసుకుని కళాతపస్వి విశ్వనాథ్‌ వచ్చారు.  

మండపేట: జిల్లాతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు, పద్మశ్రీ,  కె.విశ్వనాథ్‌ అన్నారు. జంధ్యాల లేని ఈ సభ.. ఆలయం లేని ధ్వజస్తంభాన్ని తలపిస్తోందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనను మండపేట పట్టణ బ్రాహ్మణసేవా సంఘం ఆదివారం ఘనంగా సత్కరించిం ది. స్థానిక సీతారామ కమ్యూనిటీ హాలు వద్ద నిర్వహిం చిన కార్యక్రమానికి విశ్వనాథ్, ప్రముఖ సినీ దర్శకుడు జంధ్యాల సతీమణి అన్నపూర్ణ, కుమార్తెలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని కళాతపస్వి నెమరువేసుకున్నారు.

సిరిసిరిమువ్వ చిత్రం షూటింగ్‌ పసలపూడిలో తీస్తున్నప్పుడు జంధ్యాలతో కలిసి ఈ ప్రాంతమంతా పర్యటించానని, జంధ్యాల అత్తవారి గ్రామం నర్సిపూడి వెళ్లేవారమని చెప్పారు. జంధ్యాలతో అనుబంధాన్ని, జంధ్యాల మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు. పసలపూడికి చెందిన సినీ నిర్మాత కర్రి రామారెడ్డి, భాస్కరరెడ్డి తదితరులతో ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అందరం కలిసి విందు భోజనాలు చేసేవారమన్నారు. ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందని, నడవలేకున్నా తనను పట్టుబట్టి తీసుకువచ్చి, జీవితంలో ఓ మధుర జ్ఞాపకాన్ని నింపారంటూ బ్రాహ్మణ సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు.

                   విశ్వనాథ్‌ను సత్కరిస్తున్న బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు
విశ్వనాథ్‌కు ఘన సత్కారం
బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడు పిడపర్తి భీమశంకరశాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, రామచంద్రపురం మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీరామశర్మ, సంఘ నాయకులు అవసరాల వీర్రాజు, శివకోటి శేష సుబ్రహ్మణ్యం తదితరులు విశ్వనాథ్‌ను ఘనంగా సత్కరించారు. మండపేటలోని ఐఎస్‌డీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు యినపకోళ్ల సత్యనారాయణ (ఐఎస్‌ఎన్‌), ఆలిండియా ఆర్యవైశ్య మహాసభ జాతీయ అధ్యక్షుడు కాళ్లకూరి నాగబాబు తదితరులు కూడా ఆయనను సత్కరించారు. అనంతరం జంధ్యాల సతీమణి అన్నపూర్ణను ఘనంగా సత్కరించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి మండపేట వచ్చిన విశ్వనాథ్‌కు మండపేట పట్టణ బ్రాహ్మణసేవా సంఘం కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం సీతారామ మందిరంలో జరిగిన బ్రాహ్మణ కార్తిక వన సమారాధనలో విశ్వనాథ్‌ పాల్గొన్నారు. రామచంద్రపురం డీఎస్పీ జేవీ సంతోష్, జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు దంతుర్తి సత్యప్రసాద్, సంఘ నాయకులు పేరి కామేశ్వరరావు, రాణి శ్రీనివాసశర్మ, గాడేపల్లి సత్యనారాయణమూర్తి, కందర్ప హనుమాన్, కళ్లేపల్లి ఫణికుమార్, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు