ఎల్‌ అండ్‌ టీ..ఏమిటిది?

13 Jun, 2018 12:51 IST|Sakshi
అజిత్‌సింగ్‌నగర్‌లో స్ట్రామ్‌వాటర్‌ పనుల నిమిత్తం వీఎంసీ కేటాయించిన స్థలం

కార్పొరేషన్‌కు రూ. 5.50 కోట్ల బకాయి పడ్డ ఎల్‌అండ్‌టీ

స్ట్రామ్‌వాటర్‌ పనుల కోసం 4.50 ఎకరాల స్థలాన్ని కేటాయించిన వీఎంసీ

నెలకు రూ. 22 లక్షల అద్దె చెల్లింపు జరిగేలా ఒప్పం

రెండేళ్లవుతున్నా అద్దెచెల్లించని సంస్థ ప్రతినిధులు

కార్పొరేషన్‌ అప్పుల్లో ఉంది ఆదుకోవాలంటూ ప్రతినిత్యం ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షణలు చేసే ప్రజాప్రతినిధులు సంస్థకు పేరుకుపోయిన బకాయిలపై మాత్రం దృష్టి సారించడం లేదు. నగరాభివృద్ధికి           ప్రతి ఒక్కరూ సహకరించాలని ఊకదంపుడు ప్రసంగాలిచ్చే నాయకులు కోట్లు బకాయిలు పడ్డ సంస్థలపై ఉదారంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 పటమట(విజయవాడ ఈస్ట్‌) : నగరపాలక సంస్థ పరిధిలో నివాస గృహాలు సరైన సమయానికి పన్నులు చెల్లించకపోతే కుళాయి, యూజీడీ కనెక్షన్లను తొలించి నానాయాగి చేసే అధికార యంత్రాంగం కార్పొరేట్‌ సంస్థ కోట్లలో బాకీ ఉన్నా వసూలు చేయలేకపోతున్నారు. రోడ్డు పక్కన బడ్డీకొట్టు పెట్టుకుంటేనే పన్నులు వసూలు చేసే అధికారులు రెండేళ్లుగా తీసుకున్న లీజుకు అద్దె చెల్లింపులు చేయకపోవడంపై నోరు మెదపడం లేదు. నగరపాలక సంస్థ పరిధిలో వరదనీటి ముంపు నివారణ కోసం స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీల పనులను ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేపట్టింది. పనుల నిర్వహణ కోసం మిక్సింగ్‌ ప్లాంట్, మెటీరియల్‌ నిల్వ కోసం స్థలం అవసరమవుతుందని అప్పట్లో ప్రతిపాదన పెట్టడంతో వీఎంసీ పెద్దలు  ఎలాంటి రాతకోతలు లేకుండా భూమిని కేటాయించారు.

అజిత్‌సింగ్‌నగర్‌ శ్రీరాం ఎనర్జీప్లాంట్‌ ప్రాంగణంలో 4.5 ఎకరాల స్థలాన్ని మూడేళ్లపాటు లీజుకు ఇచ్చారు. నెలకు రూ. 22 లక్షల చొప్పున ఎల్‌ అండ్‌ టీ సంస్థ చెల్లించేలా కార్పొరేషన్‌ పెద్దలు ఒప్పదం చేసుకున్నారు. పనులు ప్రారంభమై రెండేళ్లవుతున్నా ఇంత వరకు ఒక్కనెల అద్దెను కూడా చెల్లించిన దాఖలాలు లేవు. రెండేళ్ల నుంచి వీఎంసీకీ ఎల్‌అండ్‌టీ సంస్థ రూ. 5.50 కోట్ల బకాయి పడింది. దీనిపై ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో సంస్థ ప్రతినిధులను కార్పొరేటర్లు ప్రశ్నిస్తూ తమకు సంస్థ నుంచి బడ్జెట్‌ కేటాయించలేదని పేర్కోన్నారు. పనులకోసం ముందస్తుగా రూ. 90 కోట్ల అడ్వాన్‌ పొందిన సంస్థ స్ట్రామ్‌వాటర్‌ డ్రైనేజీ పనుల నిమిత్తం మొదటి విడత బిల్లులు రాగానే చెల్లిస్తామని లిఖితపూర్వకంగా కార్పొరేషన్‌కు అందించింది. కార్పోరేషన్‌ కూడా ఇప్పటి వరకు రూ. 100 కోట్లు బిల్లులు చెల్లించినప్పటికీ ఇంత వరకు లీజుకు తీసుకున్న భూమి వ్యవహారంలో స్పందించడం లేదని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. ఇటు కార్పొరేషన్‌ కూడా ఎల్‌అండ్‌టీ చెల్లించాల్సిన బకాయిలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.  

ప్రభుత్వం దృష్టిలో ఉంది
లీజు తగ్గించాలని ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతిపాదన తీసుకువచ్చింది. దీనిపై ప్రభుత్వానికి  ప్రతిపాదన పంపించాం. ఇప్పటివరకు ఎలాంటి ఉత్వర్వులు రాలేదు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే కార్పొరేషన్‌ బకాయిలపై ఎల్‌అండ్‌టీ సంస్థపై ఒత్తిడి తీసుకుస్తాం.   – కృష్ణమూర్తి, ఎస్టేట్‌ అధికారి

మరిన్ని వార్తలు