ఆపద వస్తే అంతే సంగతి

18 Jun, 2019 10:36 IST|Sakshi
అచ్చినాయుడులోవ ప్రాంతంలో నిర్మిస్తున్న పీఎంఆర్‌వై ఇళ్లు

కార్మికులకు అందని వైద్యం

ఇబ్బంది పడుతున్న 500 మంది కార్మికులు

సాక్షి, మల్కాపురం (విశాఖపట్నం): రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. పొట్టకూటి వచ్చిన వారికి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే సుమారు ఐదు కిలీమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి వచ్చిన వారు అనేక బాధలు పడుతున్నారు. 48వ వార్డు అచ్చినాయుడులోవ కొండ ప్రాంతంలోని సుమారు 20 ఎకరాల్లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద దాదాపు 4,600 ఇళ్ల నిర్మాణ పనులను ఏపీ క్విట్‌కో ప్రాజెక్ట్‌ విభాగం పర్యవేక్షణలో ఏడు నెలల నుంచి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సుమారు ఐదు వందల మంది కార్మికులు సివిల్‌ పనులు, రాడ్‌బెండింగ్‌ పనులు చేపడుతున్నారు.

ఈ పనుల కోసం కాంట్రాక్టర్‌ (టాటా)బీహార్, జార్ఖండ్‌ ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకువచ్చారు. అయితే నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కార్మికులకు కనీస వసతులు లేవు. వీరికి మరుగుదొడ్లు, సేద తీరేందుకు షెల్టర్‌గానీ లేవు. ముఖ్యంగా వైద్య సదుపాయం పెద్ద సమస్యగా మారింది. సివిల్‌ పనులు చేస్తున్న కార్మికులకు ఏదైన ప్రమాదం జరిగిన, మండుటెండలో సొమ్మసిల్లి పడిపోయినా ప్రాథమిక వైద్యం అందించేందుకు కూడా సదుపాయం లేదు. గత నెల తివారీ అనే వ్యక్తి రాడ్‌బెండిగ్‌ పనులు చేస్తుండగా ఒక్కసారి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన తొటి కార్మికులు సైట్‌ ఇన్‌చార్జ్‌కు సమాచారం అందించారు.

ఆ సమయంలో అక్కడ ఎటువంటి వాహనం లేకపోవడంతో తోటి కార్మికులే చేతుల మీద ఐదు కిలో మీటర్ల  కొండ దిగువకు తీసుకువచ్చి వైద్యం చెయ్యించారు. కొండ ప్రాంతంలో పనిచేస్తుండడంతో విషసర్పాలు కాటు వేసినా లేక మరేం ప్రమాదం జరిగినా తక్షణ వైద్యం సాయం ఇక్కడ అందుబాటులో లేదు. ఒక్కోసారి క్షణం ఆలస్యం జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. బతుకు దెరువు కోసం ఇక్కడకు వస్తే కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి వైద్య సదుపాయాలు, మరుగుదొడ్లు, షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే ఈ సమస్యపై ఏపీ క్విట్‌కో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఎం.ఆర్‌.కే.రాజును వివరణ కోరేందుకు ఫోన్‌ చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు.

అత్యవసర పరిస్థితి వస్తే అంతే..
తమ కార్మికులకు ప్రాణాపాయం వస్తే పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు. కనీసం ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా ఎవరూ లేరు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఐదు కిలీమీటర్లు రావాలి. సమీపంలో వైద్యం అందించే ఏర్పాటు చేయాలి.
– రామ్‌జీ, బీహార్‌

కనీస వసతులు కల్పించాలి
బతుకు తెరువు కోసం ఇక్కడకు వచ్చాం. ఇక్కడ పరిస్థితి చూస్తే భయం కలుగుతోంది. కొండ ప్రాంతంలో తమపై ఏదైనా జంతువులు గానీ, విషసర్పాలు గానీ దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటీ. వైద్య సదుపాయాలు ఇక్కడ కల్పించాలి.
- ముఖేష్‌ తమర్, జార్ఖండ్‌

మరిన్ని వార్తలు