రూ.18 లక్షలు ఏమైనట్లు? 

3 Oct, 2019 12:08 IST|Sakshi
జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి కేంద్ర కార్యాలయం  

సాక్షి, కర్నూలు : పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి కేంద్రం జిల్లా కార్యాలయాన్ని నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌ నిధులు రూ.94 లక్షలతో నిర్మించారు. ఇందులో రూ.76 లక్షలు భవన నిర్మాణానికి కేటాయించగా.. రూ.18 లక్షలు ఫర్నీచర్‌కు విడుదల చేశారు. రూ.76 లక్షలతో భవనాన్ని నిర్మించారు. దీనిని ఇటీవలనే ప్రారంభించారు. అయితే ఫర్నీచర్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించినా  ఇంతవరకు ఒక్క కుర్చీ కూడా సరఫరా కాలేదు. కలెక్టరేట్‌లో ఉన్న జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి కేంద్రం కార్యాలయాన్ని 15 రోజులుగా పాతబస్టాండు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాలలో నిర్మించిన సొంత భవనంలోనే నిర్వహిస్తుండగా అక్కడ కూర్చునేందుకు కుర్చీలు కరువయ్యాయి.

కార్యాలయానికి ఏసీలతో పాటు అవసరమైన బీరువాలు, కుర్చీలు, టేబుశ్లు, సమావేశ మందిరానికి అవసరమైన కుర్చీలు, టేబుళ్లను ఫర్నీచర్‌ కోసం కేటాయించిన నిధులతో సమకూర్చాల్సి ఉంది. ఇందులో ఒక్కటి కూడా సరఫరా కాకపోవడంతో నాలుగైదు పాతకుర్చీలు, టేబుళ్లతోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రూ.18 లక్షలు దారి మళ్లాయా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి కేంద్రం ఏడీ డాక్టర్‌ చంద్రశేఖర్‌ను సంప్రదించగా... ఫర్నిచర్‌ కోసం ప్రత్యేకంగా రూ.18 లక్షలు కేటాయించామని, అయితే కార్యాలయానికి కనీసం ఒక్క కుర్చీ కూడా రాలేదని తెలిపారు. ఏసీలతో సహా పూర్తి స్థాయిలో ఫర్నిచర్‌ రావాల్సి ఉందని, ఎందుకు రాలేదో తెలియడం లేదని చెప్పారు.  

మరిన్ని వార్తలు