వెంటిలేటర్‌పై రుయా!

4 Nov, 2014 09:31 IST|Sakshi

రుయా ఆస్పత్రిలో యంత్రాలకు జబ్బు చేసింది. అత్యవసర సేవలు అందడం లేదు. అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నా, ఉపయోగించుకోలేని దీనస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే ఆస్పత్రిలో కోట్ల విలువైన పరికరాలు మూలన పడుతున్నాయి. వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి. ఇక్కడి వాతావరణం చూస్తే అసలు అత్యవసర విభాగం ఉన్నా లేనట్టుగా తయారైంది.
 
 తిరుపతి కార్పొరేషన్: ‘వైద్యోనారాయణ’గా పేరుగాంచిన రుయాలో విలువైన వైద్య పరికరాలు చూస్తే ఆసుపత్రికి జబ్బు చేసిందా అన్న సందేహం వస్తోంది. అత్యవసర విభాగంలో అడ్మిట్ అవుతున్న వారు, రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారు, ఇతర అత్యవసర వైద్య సేవల కోసం వస్తున్న వారే అధిక భాగం ఉన్నారు. వీరికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు వెంటిలేటర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఏఎంసీ విభాగంలో ఆర్‌ఐసీ(రెస్పిరేటరి ఇంటెన్సివ్ కేర్)లో రోగులకు వైద్య సేవలు అంది స్తారు.
 
 ప్రస్తుతం ఈ విభాగంలో దాదాపు 18 వెంటిలేటర్లు మూలన పడ్డాయి. కేవలం రెండు మాత్రమే సేవలందిస్తున్నాయి. అవికూడా తరచూ మొరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నమ్ముకుని డాక్టర్లు మెరుగైన సేవలు అందించలేక పోతున్నారు. రోగుల సహాయకులు బతిమిలాడితే వేలూరు సీఎంసీకి వెల్లండి అని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇక అత్యవసర విభాగంలోని ఎక్స్‌రే మిషన్ ఆరు నెలలుగా పనిచేయడం లేదు. యాక్సిడెంట్ కేసుల్లో వచ్చే వారికి ముందుగా ఎక్స్‌రే తీయడం వలన ప్రమాద స్థాయిని గుర్తించి తక్షణ వైద్య సహాయం అందించవచ్చు. ఎక్స్‌రే మిషన్ పనిచే యక పోవడంతో ఆసుపత్రి ప్రధాన భవనంలోని ఎక్స్‌రే భవనానికి తీసుకెళ్లాల్సి వస్తోంది. కాళ్లు, చేతులు విరిగిన వారు అంతదూరం వెళ్లాలంటే ప్రాణం మీదకొస్తోంది.
 
 గాలిలో దీపంలా ప్రాణాలు
 రూ.5 నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు చేసి వెంటిలేటర్లు ఏర్పాటు చేసుకుంటున్న రుయా ఆసుపత్రికి వాటి నిర్వహణ భారంగా మారింది. మరమ్మతులకు గురైన వాటిని సరిచే సేందుకు సాంకేతిక నిపుణులు లేరు. రోజుల తరబడి పరికరాలు మూలనపడ్డంతో అత్యవసర సేవలకు వచ్చే వారి ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ప్రాణాప్రాయ స్థితిలో రోజూ పదుల సంఖ్యలో ఇక్కడికి వస్తుండ గా వెంటిలేటర్లు లేని కారణంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క అక్టోబర్ నెలలోనే 29 మంది అత్యవసర సేవల కోసం వస్తే వెంటి లేటర్ లేని కారణంగా 9 మంది మృత్యువాత పడ్డట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని ఆసుపత్రి వర్గాలు చర్చించుకుంటున్నాయి.
 
 రుయాలో వెంటిలేటర్లు లేక పోవడంతో రోగులను ఇక్కడి డాక్టర్లే దగ్గరుండి ప్రయివేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీంతో రోగి అవసరాన్ని బట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో గంటకు రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. అక్కడికి వెళ్లలేని పేదవారు వైద్యుల కాళ్లపై పడి ఎలాగైనా బతి కించమని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో వెంటలేటర్లు పనిచేయడం లేదని, సరే పంప్ ఏర్పాటు చేస్తాం, వాటిని మీరే చేతులతో పంపింగ్ చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ పద్ధతిలో చేయి ఒక్క క్షణం ఆగినా రోగి ప్రాణాలకే ప్రమాదం. ఇక ఆరోగ్యశ్రీ పేషేంట్ల పరిస్థితి మరీ దారుణం. వీరికి వైద్య సేవలు అందిస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో వెంటిలేటర్లు పని చేయకున్నా, ముఖానికి పైపులు పెట్టి ఫొటోలు తీసుకుం టూ ‘షో’ చే స్తున్నారన్న విమర్శలు వినపిస్తున్నాయి.
 
 పనిచేయక పోవడం వాస్తవమే...
 అత్యవసర వార్డుల్లో వెంటిలేటర్లు పనిచేయక పోవడం వాస్తవమే. ఉన్నతాధికారులకు లెటరు రాశాం. ప్రభుత్వం ఐదు వెంటిలేటర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. వాటిని త్వరగా ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రారంభిస్తాం.             
 -డాక్టర్ వీరాస్వామి,
 సూపరింటెండెంట్, రుయా ఆసుపత్రి, తిరుపతి

మరిన్ని వార్తలు