అతివకు ఇక్కట్లు

31 Aug, 2018 13:20 IST|Sakshi
బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టరు

అనారోగ్యం బారిన పడుతున్న మహిళా కండక్టర్లు

ఎక్కువ గంటలు నిలబడి పని చేయడమే కారణం

ప్రత్యామ్నాయ విధులు ఇవ్వాలంటున్న సీనియర్లు

ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్లు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. బస్సుల్లో వారంతా ఎక్కువ గంటలు నిలబడే విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో పాటు పల్లెలకు ఉన్న బస్సుల్లో ఉదయం, సాయంత్రం ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు. జనాల మధ్యన ఆవస్థలు పడి టిక్కెట్లు కొడుతుంటారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. చాలామంది 40 ఏళ్లు వచ్చేసరికి పలు రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని సీనియర్‌ కండక్టర్లు చెబుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించాలని విన్నవిస్తున్నారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా, బద్వేలు:  జిల్లాలో 8 డిపోల పరిధిలో 858 బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 350 మందికి పైగా మహిళలు కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. బద్వేలు డిపోలో 27 మంది, మైదుకూరు డిపొలో 26 మందికిపైగా, కడప 70 మందికిపైగా, ప్రొద్దుటూరు 50 మంది వరకు ఇలా ఎనిమిది డిపోలలో 400 మంది వరకు మహిళలు కండక్టర్లుగా పని చేస్తున్నారు. వీరిలో పది, పదిహేనేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 150 మంది వరకు ఉన్నారని అంచనా.. వీరంతా దీర్ఘకాలిక వ్యాధులతో నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వేళకు తిండిలేకపోవడం, ఎక్కువ పని గంటలు నిలబడే విధులు నిర్వహించడం, విశ్రాంతి లేకపోవడం వంటి కారణాలతో అనార్యోగానికి గురి కావడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సరైన రక్షణ చర్యలతో పాటు ఆరోగ్య నియమాలు వర్తించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నా  పట్టించుకునే దిక్కు లేరని మహిళా కండక్టర్లు వాపోతున్నారు.

అధికంగా వచ్చే సమస్యలివే..
ఆర్టీసీలో మహిళా కండక్టర్లు తమ ఎనిమిది గంటల విధుల్లో అధికశాతం నిలబడే ఉంటారు. రోజూ నిలబడే విధులు నిర్వహింస్తుండడంతో పలు సమస్యలు వస్తున్నాయి. వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పి, కీళ్ల సమస్యలు, మోచేతులు ఆరిగిపోవడం వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేక విధులు నిర్వహించే మహిళా కండక్టర్లు చాలా మంది ఉన్నారు. దీంతో వయస్సు పెరిగే కొద్దీ వారి సమస్యలు తీవ్రమయ్యే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కుటుంబ పోషణ, తమ చిన్నారుల భవ్యిషత్తు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మహిళా కండక్టర్లకు సింగిల్‌ క్రూ డ్యూటీలు ఎక్కువగా వేస్తున్నారు.

పగలంతా విధులే..
రోజూ తెల్లవారుజామున ఆరు, ఏడు గంటలకు డ్యూటీ ఎక్కి రాత్రి ఏడు, ఎనిమిది వరకు విధుల్లో ఉండాల్సి వస్తోంది. దీంతో పాటు కనీసం విశ్రాంతి తీసుకుందామన్నా సరైన సవతి గృహాలు లేవు. జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో ఇదే పరిస్థితి. బద్వేలు, రాయచోటి, మైదుకూరు డిపొల పరిధిలో రెస్ట్‌రూమ్‌ల పరిస్తితి అంతే. 40 ఏళ్లు పైబడిన వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఆర్టీసీ డిస్పెన్సరీల్లో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం లేదు. తీవ్ర అనారోగ్యానికి గురైతే విజయవాడ ఆసుపత్రికి రెఫర్‌ చేస్తున్నారు. దీంతో అంతదూరం వెళ్లలేక ఆర్థికభారమైన స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు.

మోకాళ్ల నొప్పులు ఎక్కువ
బస్సుల్లో ఎనిమిది గంటలు నిలబడి డ్యూటీ చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. దూరప్రాంతాలు, ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉండే రూట్‌లో విధులు నిర్వహించే మహిళా కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకు సరైన విశ్రాంతి గదుల్లేవు. – లక్మిదేవి, బద్వేలు డిపో

మరిన్ని వార్తలు