‘మా అమ్మకు ఏమైంది..’

31 Jul, 2013 07:02 IST|Sakshi

 ‘ మా అమ్మకు ఏమైంది.. ఈ రోజు పొద్దున మమ్మల్ని రెఢీ చేసి స్కూల్‌కు పంపింది. ఇప్పుడు లేవకుండా బెడ్ మీదే పడిపోయింది.. అమ్మకు ఏం జరిగింది’ అంటూ ఆ చిన్నారుల ప్రశ్నలు పలువురిని కలచివేశాయి. తల్లి మృతిచెందిందనే విషయాన్ని అర్థం చేసుకోలేని ఆ పసిపిల్లల బిత్తర చూపులు స్థానికులను కంటతడి పెట్టించింది. తాండూరు పట్టణంలో ఓ గృహిణి మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. భర్తే హత్య చేశాడని స్థానికులు, మృతుడి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని వాల్మీకినగర్‌కు చెందిన శెట్టి శరణ్ ఎనిమిదేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్టణానికి చెందిన మాదేవి (35)ని వివాహం చేసుకున్నాడు. ఈయన టాక్స్ కన్సల్టెంట్‌గా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. దంపతులకు కుమారుడు సుజల్ (9). కూతురు హాసిని(6)లు ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో మాదేవి అనుమానాస్పద స్థితిలో బెడ్‌రూంలో మృతదేహంగా పడి ఉంది. ఆమె ఎడమచేయి మణికట్టుపై రక్తగాయాలు, మెడ చుట్టు గాట్లు ఉన్నాయి. శరణ్ సమాచారంతో సీఐ ప్రసాద్, ఎస్సై ప్రణయ్‌లు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మాదేవి మృతి విషయం తెలుసుకున్న ఆమె పుట్టింటి వారు, బంధువులు తాండూరుకు చేరుకున్నారు.
 
 మాదేవిని ఆమె భర్తే హత్య చేశాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న స్థానిక మహిళా సంఘాల సభ్యులు విజయల క్ష్మీపండిట్, జ్యోతి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. మాదేవిని భర్తే హత్య చేశాడని, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శరణ్ గుల్బర్గాకు చెందిన జ్యోతిని రెండో వివాహం చేసుకొని తన ఇంటి పైపోర్షన్‌లోనే కాపురం పెట్టాడన్నారు. మాదేవిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే హత్యచేశాడని ఆరోపించారు. ఒకానొక సమయంలో శరణ్‌పై మహిళలు దాడికి యత్నించారు. కాగా మాదేవికి కొన్నాళ్లుగా మానసికస్థితి సరిగా లే దని, పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయిందని శరణ్ చెప్పుకొచ్చాడు. మాదేవిని భర్త శరణ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు కొట్టి చంపారని మృతురాలి సోదరుడు శాంతకుమార్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
 
 అయ్యోపాపం..
 తల్లి మృతి విషయం అవగతం చేసుకోలేని సుజల్, హాసినిల బిత్తర చూపులు అందరిని కలచివేశాయి. ‘ మా అమ్మ పొద్దున బాగానే ఉంది, మాకు టిఫిన్ తినిపించి స్కూల్‌కు పంపింది. ఇప్పుడు ఏం జరిగింద’ని ఆ చిన్నారుల ప్రశ్నలకు సమాధానం ఎవరూ చెప్పలేక అయ్యోపాపం అనుకున్నారు.
 

మరిన్ని వార్తలు