హత్యా? ఆత్మహత్యా?

6 Aug, 2017 04:08 IST|Sakshi
హత్యా? ఆత్మహత్యా?

మిస్టరీగా మారిన  డాక్టర్‌ సూర్యకుమారి మృతి
మళ్లీ పోలీసుల అదుపులో   మజీ ఎమ్మెల్యే తనయుడు


గుణదల (రామవరప్పాడు) : ఐదు రోజుల క్రితం అదృశ్యమైన డాక్టర్‌ సూర్యకుమారి మృతదేహం శనివారం రాత్రి నిడమానూరు వద్ద రైవస్‌కాలువలో లభించింది. ఆమె హత్యకు గురైందా.. లేదా ఆత్మహత్యకు పాల్పడిందా.. అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

వివరాలు.. క్రీస్తురాజపురం ఫిల్మ్‌నగర్‌ కాలనీలో కొర్లపాటి మరియమ్మ, విజయకుమార్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. విజయకుమార్‌ నగరపాలక సంస్థలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తెల్లో ఒకరు హెబ్సిబా కర్నాటకలో రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారిగా పనిచేస్తుండగా, ఇద్దరు కుమార్తెలు ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో సూర్యకుమారి (27) విసన్నపేట మండలం తెల్లదేవరపల్లిలోని పీహెచ్‌సీలో వైద్యురాలిగా పని చేస్తోంది.

పోలీసులకు దొరికిన ఆధారాలు బట్టి రైవస్‌ కాలువలో దూకిందన్న అనుమానంతో ఎన్‌డీఆర్‌ఎప్‌ బలగాలు రంగంలోకి దింపి విజయవాడ నుంచి రైవస్‌ కాలువలో సుమారు 15 కిలోమీటర్ల దూరం గాలించి చివరకు నిడమానూరు వద్ద శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు రోజుల క్రితం నీళ్లలో పడటంతో ఆమె మృతదేహం గుర్తించటానికి వీలులేకుండా ఉంది. అయితే వంటిపై ఉన్న జీన్స్‌ ఫ్యాంట్, టాప్‌ మెడలో  బంగారు గొలుసు ఆధారంగా ఆమె సూర్యకుమారిగా కుటుంబ సభ్యులు గుర్తించారు.

ఆ రోజు రాత్రి ఏౖమైంది?
కుటుంబ సభ్యులతో గొడవ పడి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ద్విచక్ర వాహనంపై స్నేహితుడు, మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్‌ ఇంటికి వెళ్లింది. దీంతో అక్కడ కొద్ది సేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి సూర్యకుమారి ఆవేశంగా బయటికి వచ్చినట్లు సమాచారం. గంట తర్వాత మీ అమ్మాయి ఫోన్‌ మరిచి పోయిందంటూ క్రీస్తురాజపురం ఫిల్మ్‌నగర్‌ కాలనీకు వచ్చి ఆమె తల్లికి ఫోన్‌ ఇచ్చి విద్యాసాగర్‌ వెళ్లిపోయాడు. వీరి సంసారానికి అడ్డు వస్తుందనే కారణంతో విద్యాసాగర్‌ ఎమైనా చేశాడా లేక విద్యాసాగర్‌ నాకు దక్కడం లేదని ఆత్మహత్యకు పాల్పడిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

వివాహేతర సంబంధమే కారణమా ?
సూర్యకుమారి తన ఫ్యామీలి ఫ్రెండ్‌ అయిన వివాహితుడు నగరానికి చెందిన బొబ్బిలి విద్యాసాగర్‌ (మాజీ ఎమ్మెల్యే జయరాజు కుమారుడు)ను ప్రేమిస్తోంది. వీరిద్దరూ తరుచూ రహస్యంగా కలుసుకునే వారని పోలీసుల దర్యాప్తులో తేలింది.  ఈ విషయం సూర్యకుమారి ఇంట్లో  తెలిసి ఆమెను  హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులతో తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గత నెల 31 రాత్రి ఒంటి గంట సమయంలో ఎవ్వరికి చెప్పకుండా తన ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లింది. అలికిడి రావడంతో కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లిందో తెలియక నగరంలో పలు ప్రాంతాల్లో వెతికారు.  

కాలువ ఒడ్డున దొరికిన బైక్, చెప్పులు
సూర్యకుమారి ఇంటి నుంచి వెళ్లి మరుసటి రోజు కూడా రాకపోయే సరికి వైద్యరాలి కుటుంబ సభ్యులు విద్యాసాగర్‌పై అనుమానం ఉందని మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి విద్యాసాగర్‌ను పోలీసులు పలు కోణాల్లో విచారించిన వాస్తవాలు మాత్రం తెలియలేదు. పోలీసుల విచారణలో భాగంగా సూర్యకుమారి బైక్, చెప్పులను  నగరంలోని కాలువ ఒడ్డున ఉన్న సాంబమూర్తి రోడ్డు సమీపంలో గుర్తించారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి రైవస్‌ కాలువలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందంతో శనివారం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో రూరల్‌ మండలం నిడమానూరు సమీపంలోని రైవస్‌ కాలువలో ఆమె శవం లభ్యమైంది.