అబలలపై ఆగని ఆరాచకాలు

1 Feb, 2014 03:51 IST|Sakshi

రాష్ర్టంలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో దారుణాలు జరిగాయి. కర్నూలులో ఓ మహిళా లెక్చరర్ హత్యకు గురి కాగా,  అనంతపురం  జిల్లా ధర్మవరంలో వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. భయంతో నిందితులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వారిలో ఒకరు ప్రాణాలొదిరారు. ఇదే జిల్లాలో శిక్షణ కోసం వచ్చిన ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు. తిరుపతిలో ఓ బీటెక్ విద్యార్థిని, కృష్ణా జిల్లా నూజివీడులో  మరో విద్యార్థి బలవన్మరణం చెందారు.
 
 మహిళా లెక్చరర్ దారుణ హత్య
 కర్నూలు, న్యూస్‌లైన్: ఓ మహిళా లెక్చరర్‌ను దారుణ   హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.   విద్యానగర్‌లో నివాసముంటున్న మధుమతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈమె రెండో కూతురు హిమబిందు ఓ ప్రైవేట్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తుండేది. అదే కళాశాలలో కడపజిల్లాకు చెందిన బలరామ్, వెంకటేష్ కూడా జూనియర్ లెక్చరర్లుగా పనిచేసేవారు. కొంతకాలంగా వారు వేధింపులకు గురిచేస్తున్నారని హిమబిందు తల్లికి చెప్పడంతో డిసెంబర్ 29న ఉద్యోగాన్ని మాన్పించారు. జనవరి 1వ తేదీన బలరాం పేరుతో హిమబిందు సెల్‌కు ఒక మెసేజ్ వెళ్లింది. కళాశాలకు చెందిన సిబ్బంది మొత్తం విందు ఏర్పాటు చేసుకుంటున్నామని ఆమెను ఆహ్వానించారు.
 
  బెలూం గుహలకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన ఆమె.. ఉదయం 7.30 గంటల సమయంలో బయటకు వెళ్లి రాత్రి 9 గంటల వరకు కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నంద్యాల-గిద్దలూరు రహదారిలోని సర్వ నరసింహస్వామి దేవాలయం సమీపంలో గత నెల 7వ తేదీన మహిళ మృతదేహం బయటపడింది. బలరామ్ సెల్‌కు వచ్చిన ఫోన్ నెంబర్ల ఆధారంగా కూపీ లాగిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. హిమబిందును హత్య చేసినట్లు నేరం అంగీకరించడంతో శుక్రవారం బలరామ్‌తో పాటు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి  పరిశీలించారు. ఆమెకు సంబంధించిన బట్టలతో పాటు కొన్ని ఆనవాళ్లను కూడా సేకరించారు.  
 
 వేధింపులతో యువతి ఆత్మహత్య
 ధర్మవరం, న్యూస్‌లైన్: ప్రేమ వేధింపులకు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియగానే వేధించిన యువకుడు, అతనికి సహకరించిన స్నేహితుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. చికిత్స పొందుతూ స్నేహితుడు మృతి చెందగా, నిందితుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండల కేంద్రానికి చెందిన నరసింహులు, కృపావతి దంపతుల రెండో కుమార్తె వాణి ప్రియదర్శిని (21) అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఈడీ చేస్తోంది. కొంతకాలంగా గ్రామానికి చెందిన రవిచంద్ర ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడేవాడు.
 
 మానసిక ఒత్తిడిని భరించలేక బుధవారం సాయంత్రం ఆమె విషపు గుళికలు మిం గింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రవిచంద్ర తిరుపతికి పారిపోయాడు. కాగా, చికిత్స పొందుతూ వాణి గురువారం మృతిచెందింది. ఇది తెలుసుకున్న రవిచంద్ర భయంతో అదేరోజు పురుగుమందు తాగాడు. అతడిని తిరుపతిలోని బంధువులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా.. వాణికి వరుసకు తమ్ముడు, రవిచంద్రకు స్నేహితుడు అయిన హరీష్‌కుమార్‌ను నిలదీయడం తో అతనూ విషగుళికలు మింగాడు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. రవిచంద్రపై తాడిమర్రి పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు