నవ్విపోదురుగాక నాకేటి...

2 Nov, 2013 01:40 IST|Sakshi

సర్వేల సర్వారాయుడు.. ప్రగల్భాల ఉత్తరకుమారుడు.. రాజీనామాల్రాయుడు.. పబ్లిసిటీ స్టంట్ మాస్టర్.. సమైక్యతా మాస్క్‌ధరుడు.. వ్యక్తిగత ఇమేజ్ తప్ప జనం కష్టనష్టాలు పట్టని విజిటింగ్ వీరుడు.. ఆయనెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిన్నపిల్లోడు సైతం ఠక్కున చెప్పేస్తాడు ఆయన ఎంపీ లగడపాటి రాజగోపాల్ అని. ఇప్పుడు ఆయన మరోకొత్త డ్రామాకు తెరలేపారు.
 
సాక్షి, విజయవాడ : ఎంపీ లగడపాటి నగరానికి వస్తున్నారంటే.. ప్రజా సమస్యలు వినడానికో, పరిష్కరించడానికో కాదు, కేవలం ప్రచారానికి మాత్రమేననేది అందరికీ తెలిసిందే. ఆయన విమానం ఎక్కగానే మీడియాకు మెసేజ్‌లు వస్తాయి. నగరంలోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచి తిరిగి విమానం ఎక్కేవరకూ మీడియాను ఏదో విధంగా తన వెంట తిప్పుకోవడం ఆయన స్టయిల్. తనకు ఓట్లేసి గెలిపించిన జనానికి ఏదో చేయాలనే ఆలోచన కంటే తన ప్రతి మాట, చేతలకు విస్తృత ప్రచారం పొందాలనేది ఆయన యావంతా. అందుకే ఆయనను విజిటింగ్ ఎంపీ అని పిలుచుకోవడానికి జనం అలవాటుపడ్డారు.

ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారానికి వాడుకోవడం ఆయన బాగా తెలిసిన విద్య. జనం, రాష్ట్రం ఏమైపోయినా సరే వ్యక్తిగత ఇమేజే ఆయనకు కావాల్సిందల్లా. సమైక్య ఉద్యమాన్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు. 2009లో ఉద్యమబాట పట్టినప్పుడు జనం సంతోషించారు. అది ఆవిరికావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఆస్పత్రి నుంచి అదృశ్యమై సినీఫక్కీలో హైదరాబాద్‌కు పరుగుతీయడంతో ఉద్యమం పరువు తీశారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఈసారి రాజీనామా డ్రామాతో రక్తికట్టించేందుకు తాపత్రయపడి అభాసుపాలయ్యారు. ఇప్పుడు కొత్తగా శుక్రవారం మరో పబ్లిసిటీ స్టంట్ చేశారు.

ఇందుకు వన్‌టౌన్‌లోని మరుపిళ్ల చిట్టి కేంద్ర కాంగ్రెస్ కార్యాలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి చిట్టి కార్యాలయం వద్ద సభ ఏర్పాటుచేశారు. ఈ సభలో  కీలకమైన నిర్ణయాలు ప్రకటిస్తారని, బ్రహ్మాండం ఊడిపడిపోతుందంటూ ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారం ఎంపీ కార్యాలయ సిబ్బంది సమాచారం ఇచ్చారు. అంతే మొత్తం మీడియా అంతా లైవ్ టెలికాస్ట్‌కు రంగం సిద్ధంచేసింది.

న్యూస్ బులెటిన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో సరిగ్గా అదే సమయానికి తన ఉపన్యాసం ప్రారంభించి అనర్గళంగా అరగంట సేపు మాట్లాడేశారు. అందులో తన రాజీనామా ప్రస్తావనగానీ, కనీసం తాను ఏం చేయబోతున్నదీగానీ ఒక్క మాట కూడా  చెప్పలేదు. ఉద్యోగులు అలిసిపోయి ఉద్యమానికి విరామం ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున గ్రామ గ్రామాన పోరాటం చేపట్టాలని మాత్రమే ఉచిత సలహా పడేశారు.
 
తన సర్వేలతోనే సమైక్యాన్ని సాధించవచ్చంటూ ఓ కొత్త సిద్ధాంతాన్ని వెల్లడించారు. తన చిలకజోస్యాలు ఎప్పుడూ గురితప్పలేదని సోదాహరణలతో ఏకరువు పెట్టారు. త్వరలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలలోని ఫలితాలపై అంచనాలను ఇప్పటికే అధిష్ఠానానికి పంపానని, డిసెంబర్ ఎనిమిదిన అవి నిజం కానున్నాయని చెప్పారు. ఆ తర్వాత ఆంధ్రరాష్ట్రంలో పరిస్థితిపై కూడా అంచనాలు ఇస్తానని, అప్పుడు అధిష్ఠానం తన మాట వింటుందని ఆయన చెప్పుకొచ్చారు. అంటే తన సర్వేలతోనే సమైక్య రాష్ట్రాన్ని నిలబెడతానని పరోక్షంగా ఉద్ఘాటించారు.

గురువారం రాత్రికి నగరానికి చేరుకున్న రాజగోపాల్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వేదికగా చేసుకుని హడావిడి చేసి మధ్యాహ్నానికి వెళ్లిపోయారు. తన నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పత్తి, వరి, మిర్చి పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకునే ఆలోచన, చర్యలను చేపట్టే విషయం పక్కనపెట్టినా.. కనీసం వారిని పరామర్శించే ప్రయత్నం కూడా చేయలేదు. తన రాజీనామా ఆమోదింపజేసుకున్న తర్వాతే నగరంలో అడుగుపెడతానని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో శపథం చేసిన ఆయన ఆ మాటే మర్చి శుక్రవారం రెండోసారి బెజవాడకు వచ్చి వెళ్లిన ఎంపీ తీరును జనం ఏవగించుకున్నారు.
 

మరిన్ని వార్తలు