లగడపాటి ‘చిలకజోస్యానికి’ వ్యక్తి బలి

25 May, 2019 08:33 IST|Sakshi

టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్‌ కాసిన కౌలు రైతు ఆత్మహత్య

సాక్షి, నిడదవోలు: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ టీడీపీ గెలవబోతోందంటూ చెప్పిన చిలకజోస్యం (సర్వే) ఓ వ్యక్తి ప్రాణం తీసింది. లగడపాటి సర్వేను నమ్మి ఓ కౌలు రైతు అప్పు తెచ్చిమరీ బెట్టింగ్‌ కాయగా.. టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో దిక్కుతోచక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు కంఠమని వీర్రాజు (45) ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమంటూ సుమారు రూ. 12 లక్షలు పందెం కాశాడు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో వీర్రాజు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వీర్రాజు టీడీపీ వీరాభిమాని. ఓ పక్క కౌలు చేస్తూనే ధాన్యం వ్యాపారం చేస్తాడు. ఎన్నికల ఫలితాలకు మూడు రోజులకు ముందు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల నుంచి కొంత నగదు అప్పు తీసుకున్నాడు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని సుమారు రూ.12 లక్షల పందెం కాశాడు. టీడీపీ 110 నుండి 130 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని లగడపాటి రాజ్‌గోపాల్‌ సహా పలు సర్వేలు చెప్పడంతో ఈసారి కూడా టీడీపీ విజయం సాధిస్తుందని భావించిన వీర్రాజు రూ.12 లక్షలు బెట్టింగ్‌ కాసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, వైఎస్సార్‌ సీపీ ఏకంగా 151 స్థానాలు గెలుపొందడంతో వీర్రాజు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఓ వైపు పార్టీ ఓటమిపాలవ్వడం, ఓ వైపు రూ.12 లక్షలు పందెంలో పోగొట్టుకోవడంతో మనస్తాపం చెందాడు. మిల్లర్ల నుంచి అధిక మొత్తంలో నగదు అప్పుగా తీసుకోవడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వేలివెన్ను గ్రామంలో తన ఇంటి నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు ఎప్పటి మాదిరిగానే పొలం వెళుతున్నట్లు బయలుదేరాడు. అక్కడి నుంచి నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామ శివారున ఉన్న ముక్కులమ్మ వారి గుడి వెనుక ఉన్న ఓ గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీర్రాజుకు భార్య కంఠమని సునీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామంలో ఎంతో సామ్యుడిగా పేరున్న వీర్రాజు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బోరున విలపిస్తున్నారు. నిడదవోలు రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు వీర్రాజు భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఏస్సై ఎన్‌.హనుమంతరావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు