లక్షమందికి గ్యాస్ బంద్

11 Jul, 2014 02:19 IST|Sakshi
లక్షమందికి గ్యాస్ బంద్

విజయవాడ : వినియోగదారులపై కొత్త ‘బండ’ పడింది. గ్యాస్ సరఫరాలో కొత్త నిబంధనలు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఆయిల్ కంపెనీలు జారీచేసిన నూతన మార్గదర్శకాలవల్ల జిల్లాలో లక్ష మంది వినియోగదారులకు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఒకే డోర్ నంబర్‌లో ఎక్కువ సంఖ్యలో నివాసం ఉంటున్న వేర్వేరు కుటుంబాల వారికి గ్యాస్ ఇచ్చేదిలేదని ఏజెన్సీలు వినియోగదారులకు నోటీసులు జారీచేస్తుండటంతో నగరంలోని వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

వివరాలోకి వెళ్తే...చమురు కంపెనీలు తాజాగా జారీచేసిన ఉత్తర్వులను గ్యాస్ ఎజెన్సీలు అమలు చేస్తున్నాయి. ఒకే అడ్రస్-వేర్వేరు పేర్లు... ఒకే పేరు-సేమ్ అడ్రస్‌తో  ఉన్న గ్యాస్ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా బంద్ చేశారు. అంటే ఒకే ఇంట్లో నాలుగైదు పోర్షన్లలో వుండే వారు ఒకే  డోర్ నంబర్‌తో గ్యాస్ కనెక్షన్లు పొందారు. ఆ విధంగా ఒకే అడ్రస్‌లో నాలుగైదు కనెక్షన్లు నాలుగైదు పేర్లతో ఉన్న వినియోగదారులకు గ్యాస్ సరఫరా నిలిపివేశారు.

అదే విధంగా ఒకే పేరుతో, ఒకే అడ్రస్‌తో వివిధ కంపెనీల కనక్షన్లు వినియోగించే వారికి కూడా సరఫరా నిలిపివేశారు. జిల్లాలో ఐఓసి, బీపీసీ, హిందుస్తాన్  పెట్రోలియంకు చెందిన 77గ్యాస్ ఏజె న్సీలు ఉండగా, విజయవాడ నగరంలో 21 వరకూ ఉన్నాయి. ఒక్కో గ్యాస్ ఏజెన్సీ నుంచి సుమారు 1500 చొప్పున, జిల్లా వ్యాప్తంగా అన్ని ఏజెన్సీలలో లక్ష కనెక్షన్లు ఉన్నాయి. దాంతో జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా అన్ని గ్యాస్ ఏజెన్సీలు లక్షమంది వినియోగదారులను గుర్తించి నోటీసులు జారీ చేశారు.
 
ప్రస్తుతం హిందుస్తాన్ పెట్రోలియంకు చెందిన ఏజెన్సీలు మాత్రమే నోటీసులు జారీచేసి సరఫరాను నిలిపివేశాయి. మిగిలిన రెండు కంపెనీలు కూడా త్వరలోనే నోటీసులు జారీచేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఓకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ పోర్షన్లు ఉన్న వారు, అపార్టుమెంటు వాసులు ప్రధానంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా నోటీసులు జారీ చేస్తుండడంతో వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు.
 
ఇదిలా ఉంటే... ఒకే డోర్ నంబర్‌లో వేర్వేరు పోర్షన్లు ఉంటే వాటిని ఎ, బి, సి, డి అని, అపార్టుమెంటు వారు అయితే ఎఫ్-1, ఎఫ్-2 అని డోర్ నంబర్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద కేవైసీ ఫారం పూర్తిచేసి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇచ్చిన వారికి గ్యాస్ సరఫరా పునరుద్ధరిస్తున్నారు. ఒకే పేరుతో వివిధ కంపెనీల కనక్షన్లు వున్న వాటిని గుర్తించి సరఫరా నిలిపివేస్తున్నారు.  
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు