బో‘ధనం’ దోపిడీ

26 Oct, 2013 04:20 IST|Sakshi

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం నేర్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం బెస్ట్ అవలేబుల్ స్కీంను ప్రవేశపెట్టింది. బ్రైట్ బాయ్స్ పథకాన్ని రద్దు చేసి 2011-12లో కొత్త పథకాన్ని ప్రారంభించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న విద్యార్థుల వార్షిక ఆదాయం ప్రామాణికంగా అంటే గ్రామీణ విద్యార్థుల ఆదాయం రూ.62 వేలు, పట్టణ విద్యార్థుల ఆదాయం రూ.70 వేలు ఉంటే ఐదో తరగతి నుంచి ప్రవేశం కల్పిస్తారు. పదో తరగతి వరకు చదువుకోవచ్చు. గతంలో విద్యార్థులకు పరీక్ష నిర్వహించి అర్హులైన ఎంపిక చేయగా, ప్రస్తుతం లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక చేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఎస్సీ విద్యార్థుల పర్యవేక్షణ సాంఘిక సంక్షేమశాఖ, ఎస్టీ విద్యార్థుల పర్యవేక్షణ ఐటీడీఏ అధికారులు చూసుకుంటారు. సాంఘిక  సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ విద్యార్థులుకు 433 సీట్లు, ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎస్టీ విద్యార్థులకు 816 సీట్లు మంజురయ్యాయి.
 
 ఏడు పాఠశాలలు.. 1,078 మందే..
 ఆదిలాబాద్ పట్టణంలోని సి.రాంరెడ్డి మెమోరియల్ పాఠశాలలో 359 మంది విద్యార్థులు, ఆదిలాబాద్ మండలం మావలలోని కృష్ణవేణి స్కూల్‌లో 274, మంచిర్యాల పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో 11, మంచిర్యాల మండలం రాంపూర్‌లోని ఆవాస విద్యాల యంలో 35, దహెగాం మండలం సా లేగాంలోని మేరిమాతలో 73, ఉ ట్నూర్ సెయింట్‌పాల్స్‌లో 121, నిర్మల్ పట్టణంలోని రవి స్కూల్‌లో 205 మంది విద్యార్థులు హాస్టల్ వసతితోపాటు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాకు 1,249 సీట్లు మంజూ రు కాగా, 1,078 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇంకా 171 సీట్లు అడ్మిషన్‌కు నోచుకోలేదు. కాగా, బిల్డింగ్ సదుపాయం, వసతులు, నిపుణులైన టీచర్లు, పాఠశాల ఫలితాలు తదితర వివరాలను ప్రామాణికంగా తీసుకొని పాఠశాలలను ఎంపిక చేయాలి. అయితే విద్యా బోధనలో ఉన్నత ప్రమాణాలు కలిగిన పాఠశాలలు ఈ పథకం నిర్వహణకు ముందుకు రాకపోవడంతో సదుపాయాలు లేని పాఠశాలను ఎంపిక చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
 
 రూ.లక్షలు స్వాహా
 బెస్ట్ అవలేబుల్ పాఠశాలల యాజమాన్యాలు, అధికారులు కుమ్మక్కై రూ.లక్షలు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల విద్యార్థులను ఎంపిక చేయడం, వారు పాఠశాల వదిలి మధ్యలోనే వెళ్లిపోవడం, మళ్లీ రాకపోవడం వంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. వారి తల్లిదండ్రులు కూడా అంతగా పట్టించుకోకపోవడంతో యాజమాన్యాలకు వరంగా మారింది. విద్యార్థులు పాఠశాలకు రాకున్నా ఉన్నట్లుగా చూపిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఒకసారి విద్యార్థి ఎంపికైతే పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేస్తూ రూ.లక్షలు స్వాహా చేస్తున్నారు. సంక్షేమ, ఐటీడీఏ అధికారులు కూడా ‘మామూలు’గా చూడటంతో వ్యవహారం సాఫీగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినపుడు స్కూళ్లు, హాస్టళ్లలో ఇతర విద్యార్థులను చూపిస్తుండటంతో వ్యవహారం గోప్యంగా సాగుతోంది. అధికారులు దృష్టిసారిస్తే వ్యవహారం బయటపడే అవకాశం ఉంది.
 
 బడ్జెట్ నిలిపివేస్తాం..
 -  అంకం శంకర్, ఉప సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ
 బెస్ట్ అవలేబుల్ స్కూళ్లలో చదువుతున్న పేద విద్యార్థుల్లో పది శాతం మంది విద్యార్థులు సెలవులు తీసుకుని రావడం లేదనేది మాదృష్టికి వచ్చింది. ఒకవేళ విద్యార్థులు తిరిగిరాని పక్షంలో వారికి టీసీలు ఇచ్చి పంపిం చడం జరుగుతుంది. హాజరు పట్టికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సహాయ సంక్షేమ శాఖాధికారులను ఆదేశించాం. స్కూల్‌కు విద్యార్థులు రాని పక్షంలో వారికి కేటాయించే బడ్జెట్‌ను నిలిపివేస్తాం.
 

మరిన్ని వార్తలు