ఉయ్యూరులో లక్ష గళ ఘోష విజయవంతం

1 Sep, 2013 01:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమం 32వ రోజూ ఉధృతంగా సాగింది. శనివారం వినూత్న పద్ధతుల్లో సమైక్యవాదులు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన ప్రతిపాదన వెనక్కి తీసుకునేవరకు ఉద్యమిస్తామని నొక్కివక్కాణించారు. ఉయ్యూరులో నిర్వహించిన లక్ష గళ ఘోష కార్యక్రమం విజయవంతమైంది. వేలాదిగా హాజరైన ప్రజలతో ఉయ్యూరు జన సంద్రమైంది. సంపూర్ణ బంద్ విజయవంతమైంది. తిరువూరులో సమైక్య జనగళఘోష నిర్వహించారు. పెద్ద ఎత్తున సమైక్యవాదులు రోడ్డుపైకి వచ్చి రాష్ట్రం ఐక్యంగా ఉండాలని నినదించారు. కార్యాలయాలు, దుకాణాలు బంద్ చేశారు. కైకలూరులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో గళ ఘోష కార్యక్రమం  జరిగింది.

కైకలూరు తాలూకా సెంటర్‌లో ఎన్జీవోలు చేస్తున్న రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. రేషన్ డీలర్లు దీక్షలు చేపట్టారు. కలిదిండి మండలంలో రోడ్డుపై వీఆర్వోలు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. మండవల్లిలో బంద్ నిర్వహించి రోడ్లపై ఆటలు ఆడారు. రాష్ట్ర విభజన జరిగితే అభివృద్ధి కుంటుపడుతుందంటూ నూజీవీడులో విద్యార్థులు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. జగ్గయ్యపేటలో రేషన్ డీలర్లు దీక్షలో పాల్గొన్నారు. జేఏసీ నాయకులు భిక్షాటన చేశారు. రాష్ట్ర విభజన జరిగితే తాము భిక్షాటనే చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలోని తెలుగు తల్లి సెంటర్‌లో ఆరువేల మందితో ప్రదర్శన నిర్వహించి సమైక్య గర్జన చేశారు. ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడులో గ్రామస్తులు ప్రధాన రహదారిపై వంటావార్పు నిర్వహించారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ మహిళా వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఉండమ్మా బొట్టుపెడతా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌టీఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో 108 మందితో లలితా సహస్రనామ కార్యక్రమం జరిగింది.   
 
జననేత జగన్‌కు మద్దతుగా..


 రాష్ట్ర విభజన చేయకూడదంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిరాహారదీక్షకు మద్దతుగా జిల్లాలో పలువురు నాయకులు, కార్యకర్తలు దీక్షలు కొనసాగిస్తున్నారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అడ్‌హాక్ కమిటీ సభ్యుడు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావుల నాలుగోరోజు దీక్షను శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. వారిని మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. విజయవాడలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో  10 మంది బందరు రోడ్డుపై రిలే నిరాహారదీక్షలు నిర్వహించగా, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ వారిని పరామర్శించారు.

సాయంత్రం రాధాకృష్ణ నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు ఏడో రోజు కొనసాగాయి. నూజివీడులో ఐదోరోజు రిలేదీక్షల్లో నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. గుడివాడలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయంలో జగన్  పేరిట  పూజలు నిర్వహించి, 101 కొబ్బరికాయలు కొట్టారు.
 

మరిన్ని వార్తలు