లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌.. రేపే విడుదల

30 Apr, 2019 05:13 IST|Sakshi

పలమనేరులో పూజలు నిర్వహించి విడుదల చేయనున్న రామ్‌గోపాల్‌ వర్మ  

తిరుపతి తుడా /సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చనిపోయేముందు, చివరి జీవితంతో చోటు చేసుకున్న ఒడిదుడుకుల సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ సినిమా రాష్ట్రంలో మే 1న బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి పూజలు నిర్వహించి పలమనేరులోని మంజునాథ థియేటర్‌లో బుధవారం ఉదయం 9.47 గంటలకు చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్ర దర్శకులు రామ్‌గోపాల్‌ వర్మ, నటీ నటులు హాజరుకానున్నారని నిర్మాత రాకేష్‌రెడ్డి సాక్షికి తెలిపారు.

లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ సినిమా విడుదల అయితే ఎన్నికల్లో తమకు తీవ్ర నష్టం కలుగుతుందని భావించిన టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించగా ఎన్నికల వరకు చిత్రాన్ని ఏపీలో విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశాలు జరీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలింగ్‌ ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా మే 1న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి నిర్ణయించారు. లక్ష్మీపార్వతి ఎన్‌టీఆర్‌కు దగ్గరకావడానికి గల కారణాలు, రాజకీయంగా నమ్మిన వారే ఆయనను మోసం చేయడం, పార్టీని లాక్కుని వెన్నుపోటు పొడవడంతో మానసిక బాధతో ఆయన అనారోగ్యం పాలవ్వడం, మృతి చెందే సమయంలో ఆయన పడ్డ క్షోభను రామ్‌గోపాల్‌ వర్మ ఈ చిత్రంలో చక్కగా తెరకెక్కించారు.  

భావవ్యక్తీకరణకు అడ్డుపడిన ఆపద్ధర్మ సీఎం : విజయచందర్‌  
విజయవాడలో రామ్‌గోపాల్‌వర్మ విలేకరుల సమావేశం పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నారు, ఆయన చేసిన తప్పేమిటి? అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రచార విభాగం ఏపీ సమన్వయకర్త టీఎస్‌ విజయచందర్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆపద్ధర్మ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకూడదా... మరి సెన్సార్‌ బోర్డు ఉన్నదెందుకు? అని నిలదీశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కాల రాస్తున్నారని, భావవ్యక్తీకరణకు కూడా అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు. రాంగోపాల్‌వర్మను అడ్డుకున్న విధంగానే భవిష్యత్‌లో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను ఏపీలోకి రాకుండా అడ్డుకోవచ్చా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ సినీ డైరెక్టర్‌ విజయవాడలో ప్రెస్‌ మీట్‌ కూడా పెట్టలేని పరిస్థితులలో మన ప్రజాస్వామ్యం ఉందని ఆవేదన చెందారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రానికి సెన్సారు బోర్డు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని, ఎన్నికల సంఘంతో పాటు కోర్టులు కూడా అనుమతి ఇచ్చాయని గుర్తు చేశారు. మరి అలాంటి చిత్రానికి చంద్రబాబు అడ్డుపడటం దేనికి? అని నిలదీశారు. చంద్రబాబు వ్యవహారాలు చూస్తుంటే ఆయన మనో నిబ్బరం కోల్పోయినట్లు కనిపిస్తోందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ పాలన కావాలని ప్రజలంతా భావిస్తున్నారని, మే 23న వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో గెలవబోతోందని తెలిపారు.   

రాంగోపాల్‌ వర్మను అడ్డుకోవడం తగదు: సీపీఎం మధు  
లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్ర దర్శకుడు రాంగోపాల్‌ వర్మ విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించకుండా పోలీసులు అడ్డుకోవడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. సినిమాపై సెన్సార్‌ బోర్డు, న్యాయస్థానాలు ఆంక్షలను విధించలేదని అయినా శాంతి భద్రతలు, ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి పోలీసులు ఆయన్ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.

చంద్రబాబు గారూ...! రాంగోపాల్‌వర్మ చేసిన తప్పేంటి...?  

ట్విట్టర్‌లో ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌: విజయవాడలో విలేకరుల సమావేశం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉందని, పోలీసులను బంట్రోతుల కన్నా అధ్వానంగా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. ‘ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన తప్పేంటి..?’ అని జగన్‌ సూటిగా ప్రశ్నించారు. 

నిజాన్ని దాచలేరన్న విషయం చంద్రబాబు గ్రహించడం లేదు జగన్‌ గారూ: రామ్‌గోపాల్‌ వర్మ   
నిజాన్ని ఎప్పటికీ దాచలేమన్న విషయాన్ని ఈ వయసులోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రహించలేక పోతున్నారని ప్రఖ్యాత దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు గారూ... రామ్‌గోపాల్‌ వర్మ చేసిన తప్పేంటి?’ అంటూ వైఎస్‌ జగన్‌ చేసిన ట్వీట్‌కు వర్మ ప్రతి స్పందించారు. ‘జగన్‌ గారూ... నిజాన్ని దాచలేరన్న విషయాన్ని చంద్రబాబు ఈ వయసులో కూడా గ్రహించలేక పోతున్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు.  

>
మరిన్ని వార్తలు