ఆంధ్ర కాశ్మీర్‌కు అదనపు హంగులు

5 Oct, 2018 07:52 IST|Sakshi
తాజంగిలో బోటు షికారు(ఫైల్‌)

తాజంగిలో బోటు షికారుకు ఐటీడీఏ చర్యలు

రూ.20 లక్షల కేటాయింపు

పర్యాటకశాఖ మరో రూ.6 కోట్ల కేటాయింపు

విశాఖపట్నం, చింతపల్లి: ఆంధ్రా కశ్మీర్‌ లంబసింగి అదనపు శోభను సంతరించుకోనుంది. రూ.8 కోట్లతో పర్యాటకాభివృద్ధిని చేపడుతున్న ఆ శాఖ మరో రూ.ఆరు కోట్లు మంజూరు చేసింది. లంబసింగికి సమీపంలోని తాజంగి జలాశయంలో బోటు షికారు ఏర్పాటు చేసేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు వసతి కల్పించడానికి గుడారాలు ఏర్పాటు చేయనుంది. పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి కల్పించాలన్నది ఐటీడీఏ అధికారుల లక్ష్యం. గత ఏడాది ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇక్కడ బోటు షికారు ఏర్పాటు చేసి పర్యాటకుల వద్ద పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

పర్యాటకానికి ఊపు
లంబసింగి ప్రాంతం సముద్రమట్టానికి దాదాపు 3600 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీంతో శీతాకాలంలో అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉంటుంది. డౌనూరు నుంచి పది కిలోమీటర్ల మేర ములుపులతో కూడిన ఘట్‌రోడ్డులో తెల్లవారినా లైట్లు వేసుకుని ప్రయాణించడాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తారు. ప్రతి ఏటా పర్యాటకుల తాకిడి పెరుగుతున్నప్పటికీ తగిన సౌకర్యాలు లేక ఇబ్బంది పడేవారు.  పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు నాలుగేళ్ల కిందటే రూ.8 కోట్లు మంజూరు చేశారు.

పట్టాలెక్కిన అభివృద్ధి పనులు
లంబసింగిలో 18 ఎకరాల భూమిలో 40 రిసార్ట్స్, రెండు రెస్టారెంట్లు, కాన్ఫరెన్స్‌ హాల్, ఓపెన్‌ థియేటర్, స్విమ్మింగ్‌పూల్, ఆయుర్వేద హెల్త్‌స్పా వంటివి నిర్మించాలని అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ప్రస్తుతం అన్ని సౌకర్యాలతో కూడిని ఎస్‌జీ టెన్‌సైల్‌ కాటేజీల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో ఆరు కోట్లు పర్యాటక శాఖ కేటాయించడంతో మరిన్ని సౌకర్యాలు కలగనున్నాయి. మన్యంలో అరుకు తరువాత లంబసింగి పర్యాటక ప్రాంతంగా కీర్తిగాంచనుంది.

మరిన్ని వార్తలు