భూసేకరణకు ఇద్దరు డెప్యూటీ కలెక్టర్లు

2 Dec, 2014 00:37 IST|Sakshi
భూసేకరణకు ఇద్దరు డెప్యూటీ కలెక్టర్లు

సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలంగాణ నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో రాజీ పడే ప్రసక్తే లేదని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు స్పష్టం చేశారు. అనివార్యకారణాల  వల్ల ప్రస్తుతానికి పనులు మందకొడిగా సాగుతున్నా.. ఇకపై వేగవంతం చేస్తామని.. ప్రత్యేక పాలనకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు మండలాల ప్రజల సమస్యలపై ‘సాక్షి’ సోమవారం సంచికలో ‘మమేకమైనా మారని పాలకులు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై జేసీ స్పందించారు. ఆ కథనంతో క్షేత్రస్థాయి సమస్యలు, అక్కడి వాస్తవ పరిస్థితి, ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాలపై స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు. ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు భూ సేకరణను వేగవంతం చేయడానికి కుకునూరులో ఇందిరాసాగర్ ప్రాజెక్టు కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
 
 రెండు మండలాలకూ ఇద్దరు డెప్యూటీ కలెక్టర్లను నియమించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తామని జేసీ వెల్లడించారు. తద్వారా భూసేకరణ వేగవంతం అవుతుందని, క్షేత్రస్థాయిలో రైతులు వారి భూములకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వెం టనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతి సోమవారం మండల కార్యాల యాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని ఇకపై ఆ రెండు మండలాల్లోనూ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. కేఆర్‌పురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్‌వీ సూర్యనారాయణ ప్రతి సోమవారం ఉదయం కుకునూరులో, సాయంత్రం వేలేరుపాడులో ప్రజావాణి నిర్వహిస్తారని చెప్పారు.
 
 అక్కడి ప్రజలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. పునరావాస పనులను వేగవంతం చేస్తామని, ఇందుకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కేవలం మండల కేంద్రాలకు పరిమితమవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి ఇకపై గ్రామాల్లో పర్యటించాల్సిందిగా సూచనలు చేస్తామన్నారు. సంక్షేమ హాస్టళ్లకు ప్రతినెలా బియ్యం సరఫరా అయ్యే లా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని శాఖల జీతాలు ఇంకా తెలంగాణ సర్కారు నుంచే వస్తు న్న మాట వాస్తవమేనని, ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని జేసీ చెప్పారు.
 
 పోలీస్‌పరంగా ఇబ్బందులు లేవు :  ఎస్పీ రఘురామ్
 విలీన మండలాల్లో పోలీస్‌పరంగా ఎటువంటి ఇబ్బం దులు లేవని జిల్లా ఎస్పీ డాక్టర్ కె.రఘురామ్‌రెడ్డి తెలి పారు. కుకునూరు ఎస్సైగా ఎం.సుబ్రహ్మణ్యం, వేలేరుపాడు ఎస్సైగా సీహెచ్.రామచంద్రరావులను ఇప్పటికే నియమించామని చెప్పారు. అక్కడి పోలీస్ స్టేషన్లలో ఇంకా పనిచేస్తున్న ఎస్సైలను తెలంగాణ సర్కారు బదిలీ చేయకపోవడంతో పాలనాపరంగా ఒకింత ఇబ్బంది ఎదురవుతోందన్నారు. అయినా మన ఎస్సైలు ఆ పోలీస్ స్టేషన్లలోనే విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాల్లో ఇప్పటికే పర్యటించానని, త్వరలోనే ఆ మండలాలకు వెళ్లి పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తానని ఎస్పీ చెప్పారు.
 
 అధికారులంతా వెళ్లాల్సిందే : కలెక్టర్
 కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు బూర్గం పహాడ్ మండలంలోని 6 రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కలెక్టర్ కె.భాస్కర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయా మండలాలకు తహసిల్దార్లను, ఎంపీడీవోలను నియమించామన్నారు. తహసిల్దార్లు బాధ్యతలు స్వీకరించగా, ఎంపీడీవోలు విధుల్లో చేరాల్సి ఉం దన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సూచనలు ఇచ్చామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు