‘లూలూ’కు దాసోహం

10 May, 2018 03:31 IST|Sakshi
లూలూ సంస్థకు కేటాయించిన ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లోని స్థలం

విచ్చలవిడిగా భూముల కేటాయింపు

సాక్షి, విశాఖపట్నం: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కి చెందిన లూలూ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సాగిలాపడుతోంది. ఆ సంస్థ అడిగిందే తడవుగా విశాఖపట్నంలో రూ.వేల కోట్ల విలువైన భూములను దారాదత్తం చేస్తోంది. ఇప్పటికే 13.83 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టిన ప్రభుత్వం తాజాగా మరో 2.22 ఎకరాలను అప్పగించేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం బుధవారం భూసేకరణ నోటీసు జారీ చేసింది. విశాఖపట్నం సాగర తీరంలో ఏపీఐఐసీ గ్రౌండ్‌గా పేరొందిన 9.12 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి ప్రభుత్వం గత ఏడాది అంతర్జాతీయ బిడ్‌లను ఆహ్వానించింది. నిబంధనలకు పాతరేస్తూ.. యూఏఈకి చెందిన లూలూ గ్రూప్‌నకు ప్రభుత్వం ఈ టెండర్‌ను ఖరారు చేసింది. ఏపీఐఐసీ గ్రౌండ్‌కు, బీచ్‌ రోడ్డుకు మధ్యలో 3.40 ఎకరాల విస్తీర్ణంలో సీఎంఆర్‌ గ్రూప్‌నకు చెందిన విశ్వప్రియ ఫంక్షన్‌ హాల్‌ ఉంది.

తాము ఇక్కడ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలంటే సీఎంఆర్‌ గ్రూప్‌నకు చెందిన భూములు కూడా కావాలని లూలూ గ్రూప్‌ షరతు పెట్టింది. దీంతో సీఎంఆర్‌ గ్రూప్‌తో ప్రభుత్వం బేరసారాలు సాగించింది. సీఎంఆర్‌ గ్రూప్‌నకు 1:1.5 నిష్పత్తిలో ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని సర్కారు ప్రతిపాదించింది. ఆ మేరకు నగర పరిధిలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 4.85 ఎకరాలను సీఎంఆర్‌ గ్రూప్‌నకు కట్టబెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ విధంగా సీఎంఆర్‌ గ్రూప్‌ నుంచి సేకరించిన 3.40 ఎకరాలను లూలూ సంస్థ పరం చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎకరా విలువ రూ.72.35 కోట్ల చొప్పున మొత్తం 12.52 ఎకరాల భూమి విలువ రూ.905.82 కోట్లుగా నిర్ధారించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. మార్కెట్‌ రేట్‌ ప్రకారం ఇక్కడ గజం రూ.లక్షకు పైగా పలుకుతోంది. లూలూ సంస్థకు కేటాయించిన భూముల విలువ అక్షరాలా రూ.3,000 కోట్ల పైమాటే. కానీ, ప్రభుత్వం మాత్రం ఏడాదికి కేవలం రూ.6.27 కోట్ల లీజుతో 12.52 ఎకరాలను లూలూ కు 33 ఏళ్లకు కట్టబెట్టడం గమనార్హం. అదనంగా కేటాయించిన భూమి(1.31ఎకరాలు) కూడా ఇదే ధరకు కేటాయించారు. 

2.22 ఎకరాలు రూ.200 కోట్ల పైమాటే 
ఇప్పటికే కేటాయించిన 13.83 ఎకరాలు కూడా సరిపోవని, మరికొన్ని భూములు కావాలని లూలూ సంస్థ ప్రతిపాదించింది. ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఏపీఐఐసీ, సీఎంఆర్‌ గ్రూప్‌నకు చెందిన భూములకు ఆనుకొని ఉన్న మరో 2.22 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఆ మేరకు బుధవారం భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సర్వే నంబర్‌ 1011/1ఎ, 1ఎ3, ఎ1లలోని 73 సెంట్లు, 46 సెంట్లు, సర్వే నంబర్‌ 1011/1ఎ/1ఎ, 3ఎ1లోని 27 సెంట్లు, 53 సెంట్లు, 23 సెంట్లు కలిపి మొత్తం 2.22 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

భూసేకరణ చట్టం–2013 కింద ఈ భూములు సేకరించేందుకు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ 2.22 ఎకరాల భూమి విలువ రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. లూలూ సంస్థకు విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టడం వెనుక రూ.వందల కోట్లు చేతులు మారాయని అప్పట్లో విపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేశాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు రూ.500 కోట్లు ముట్టాయని ఆరోపించాయి. ఈ నేపథ్యంలోహైకోర్టులో కేసు వేయడానికి వీల్లేకుండా లూలూ సంస్థ తరపున ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఇన్‌క్యాప్‌) వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారా కేవియెట్‌ కూడా పొందారు.

మరిన్ని వార్తలు