జనసేన రాష్ట్ర కార్యాలయం లీజుపై వివాదం

15 Dec, 2017 01:46 IST|Sakshi

పవన్‌కల్యాణ్‌పై కేసు వేస్తాం : ముస్లిం ఐక్యవేదిక

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/సాక్షి, అమరావతి :గుంటూరు జిల్లా చినకాకానిలో రాష్ట్ర కార్యాలయం కోసం జనసేన పార్టీ లీజుకు తీసుకున్న స్థలం వివాదంలో చిక్కుకుంది. ఆ భూమి తమదంటూ కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం గురువారం మీడియా ముందుకు వచ్చింది. కోర్టు వివాదంలో ఉన్న భూమిని పవన్‌కల్యాణ్‌ ఎలా తీసుకున్నారో  తమకు తెలియదని, తమ భూమి తమకు ఇవ్వాలంటూ భూ యజమానులు షేక్‌ షఫీ, ముస్తాక్, మెహబూబా, షంషాద్‌ కోరారు.

ముస్లిం ఐక్య వేదిక కార్యాలయంలో వేదిక రాష్ట్ర అ«ధ్యక్షుడు షేక్‌ జలీల్, లీగల్‌ సెల్‌ చైర్మన్‌ గౌతంరెడ్డితో కలిసి గురువారం వారు మీడియాతో మాట్లాడారు. ఈ స్థల వివాదమై 1997లో గుంటూరు కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని.. అనంతరం యార్లగడ్డ సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించారన్నారు. ప్రస్తుతం కేసు అక్కడ పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డ సుబ్బారావు వారసులు యార్లగడ్డ సాంబశివరావు తదితరులు సదరు స్థలాన్ని జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి లీజుకు ఇచ్చిన విషయం తమకు ఆలస్యంగా తెలిసిందన్నారు.

లీజులో దురుద్దేశాల్లేవు : పవన్‌
కాగా, స్థల వివాదంపై పవన్‌ స్పందిస్తూ.. త్వరలోనే న్యాయ నిపుణులతో కలిసి జనసేన ప్రతినిధులు చినకాకాని వస్తారని, భూ యజమానులు తమ డాక్యుమెంట్లు వారికి ఇవ్వాలని ఓ ప్రకటనలో సూచించారు. స్థలం ముస్లింలదేనని నిర్థారణ అయిన మరుక్షణం జనసేన ఆ స్థలానికి దూరంగా ఉంటుందని హామీ ఇస్తున్నట్టు పవన్‌ స్పష్టం చేశారు. ఈ స్థలాన్ని కేవలం మూడున్నర సంవత్సరాలకు మాత్రమే జనసేన లీజుకు తీసుకుందని, అందువల్ల ఈ స్థలం విషయంలో దురుద్దేశాలు లేవని ఆయన పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు