మహిళల పేరుతోనే పట్టాలు..

30 Dec, 2013 06:55 IST|Sakshi

భద్రాచలంటౌన్, న్యూస్‌లైన్: మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, అందుకే వారి పేరుతోనే పట్టాలు పంపిణీ చేస్తోందని కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్ అన్నారు. ఆదివారం భద్రాచలంలోని టుబాకో బోర్డు ప్రాంగణంలో 7వ విడత భూపంపిణీ కార్యక్రమం జరిగింది. వెంకటాపురం, చర్ల, వాజేడు, దుమ్ముగూడెం, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం మండలాలకు చెందిన గిరిజనులకు కేంద్ర మంత్రి పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ భూములను సద్వినియోగం చేసుకుని గిరిజనులు అభివృద్ధి చెందాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.
 
 ఉపాధ్యాయులపై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి
 ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని కేంద్ర మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల్లో ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా అధికారులు, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా..? లేదా..? అనే విషయాన్ని ప్రజలే తెలుసుకోవాలని  సూచించారు. ఎమ్మెల్యే కుంజా సత్యవతి మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అనంతరం ఐటీడీఏ పీవో జి వీరపాండియన్ మాట్లాడుతూ నిరుపేదలకు భూమి, జీవనోపాధికి హక్కు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీడీఏ ద్వారా గిరిజనులకు పట్టాలు అందించిన భూవివరాలను తెలియచేశారు. గిరిజనులకు మరిన్ని భూ పట్టాలు అందించే క్రమంలో ఫారెస్టు అధికారుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిపై అటవీశాఖ అధికారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం 461 మంది లబ్ధిదారులకు 883.15 ఎకరాల భూమికి సంబంధించి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  భద్రాచలం ఎంపీడీఓ రమాదేవి, వివిధ మండలాల తహశీల్దార్లు, డివిజన్ స్థాయి భూ అసైన్‌మెంట్ కమిటీ సభ్యు లు, సర్పంచ్‌లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
 
 వైఎస్ దయే అన్న లబ్ధిదారులు...
 దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దయ వల్లే తమకు పోడు భూములకు పట్టాలు అందుతున్యాని ఓ మహిళ వెల్లడించింది. పట్టాలు పంపిణీ చేస్తున్న సందర్భంగా కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే కుంజా సత్యవతిలు లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ పట్టాలు మీకు ఎవరిస్తున్నారు.. అని ప్రశ్నించగా వైఎస్ రాజశేఖరరెడ్డి దయ వల్లే వస్తున్నాయని దుమ్ముగూడెం మండలం గౌరారం గ్రామానికి చెందిన పద్మ అనే మహిళ  సమాధానం ఇచ్చింది. దీంతో అధికార వారిద్దరు ఖంగుతిన్నారు. అలాగే నేనెవరో తెలుసా..? అని కేంద్ర మంత్రి లబ్ధిదారులను ప్రశ్నించగా ఎక్కువ మంది గిరిజనులు తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో కేంద్రమంత్రి ఇవేవీ ప్రశ్నించకుండా మౌనంగా పట్టాలు పంపిణీ చేసి తిరుగుముఖం పట్టారు.

మరిన్ని వార్తలు