భూంఫట్‌!

27 Nov, 2018 13:04 IST|Sakshi

నకిలీ పత్రాలతో విలువైన స్థలాలు కైవశం

బాధితుల బంధువులే పావులు

ఫోర్జరీ సంతకాలతో నకిలీ వీలునామాలు

ముడుపులతో భూముల మ్యుటేషన్లు

కబ్జాదారుల చెరలో చెరువులు, వాగులు

బాధితులకు బెదిరింపులు

అధికారం అండతో చెలరేగుతున్న వైనం

తెరవెనుక మంత్రులు, అధికార పార్టీ నేతలు

సాక్షి, అమరావతి: అధికారం అండతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భూమాఫియా చెలరేగిపోతోంది. నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో విలువైన భూములను కాజేస్తున్నారు. వాగులు, చెరువులను సైతం ఆక్రమించి రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ భూ రికార్డులను తారుమారు చేస్తున్నారు. భూములను కొట్టేసేందుకు కొన్నిచోట్ల బాధితుల బంధువులనే పావులుగా వాడుకోవడం గమనార్హం.

బాధితుల బంధువులకు వాటాల ఎర...
భూదందాల కోసం చిన్న చిన్న వివాదాలున్న విలువైన ఆస్తుల సమాచారాన్ని సేకరించి రంగంలోకి దిగుతున్నారు. వివాదాలు లేనిచోట కూడా ఏదో ఒక మెలికపెట్టి నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హక్కుదారుల బంధువులకు వాటాలిస్తామంటూ ఎరవేసి అప్పు ఇచ్చినట్లు తనఖా పత్రాలు సృష్టిస్తున్నారు. తనఖా పత్రం కూడా తమ పేర్లతో కాకుండా బినామీ పేర్లతోనే రాయించుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. తనఖా పత్రం రాయించుకున్న వారి పేర్లతో ఆస్తి బదలాయించేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. వీటి ఆధారంగా ఆస్తులు మ్యుటేషన్‌ చేయించి బినామీ పేర్లతో భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల పేర్లు బయటకు రాకుండా వ్యవహరిస్తున్నారు. బాధితులు పోలీస్‌ స్టేషన్లకు వెళ్లినా ఇదంతా సివిల్‌ వివాదమంటూ కేసు నమోదు చేయకుండా తిరస్కరించేలా కబ్జాదారులు ముందే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

విజయవాడలో మాఫియా రాజ్యం
విజయవాడ సింగ్‌నగర్‌లోని సుమారు రూ.50 కోట్ల విలువైన 5.16 ఎకరాలను ఎమ్మెల్యే బోండా ఉమా తన భార్య, సన్నిహితుల పేరుతో రికార్డులు సృష్టించి కాజేసేందుకు ప్రయత్నించడం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణ పేరుతో ఉన్న భూమిని నకిలీ పత్రాలతో చేతులు మార్పించి ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాత, తనకు సన్నిహితుడైన మాగంటి బాబులకు డెవలప్‌మెంట్‌ కోసం ఇచ్చినట్లు అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దీనిపై వాస్తవ హక్కుదారులు ఆందోళన చేయడంతో పోలీసులతో కూడా కొట్టించారు. ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడంతో చివరకు ఈ భూమిని వదులుకుంటున్నట్లు బోండా ఉమ ప్రకటించడం గమనార్హం.

పెద్దలతో ఎందుకు?.. రాజీ చేసుకోండి!
కృష్ణా జిల్లాకు చెందిన ఓ కీలక నేత అనుచరులు కూడా విజయవాడలో ల్యాండ్‌ మాఫియా నిర్వహిస్తున్నారు. గొల్లపూడి ప్రాంతంలో మంత్రి అనుచరులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఓ మహిళ 1978లో కొనుగోలు చేసిన 2.5 ఎకరాల భూమికి మంత్రి అనుచరులు నకిలీ పత్రాలు సృష్టించి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో బాధితురాలు పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ‘పెద్దవారితో మీకు ఎందుకు? ఏదో ఒకటి మాట్లాడుకుని రాజీ చేసుకోండి’ అని ఓ రెవెన్యూ అధికారి బాధితురాలికి సూచించినట్లు తెలిసింది. విశాఖలో కూడా ఓ స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన రూ. వంద కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో కొనుగోలు చేసేందుకు ఓ మంత్రి బంధువులు అంతా సిద్ధం చేసుకున్నారు.

వాగులూ వంకల ఆక్రమణ..
చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో వందలాది చెరువులు ఆక్రమణదారుల చెరలో చిక్కుకుని సాగు భూములుగా మారిపోయాయి. భారీ వర్షాలు పడితే నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంట పొలాలు కొట్టుకుపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో చెరువులు, నీటి ప్రవాహ మార్గాలను ఆక్రమించుకోవడం వల్ల తిత్లీ తుపాను సమయంలో భారీ నష్టం జరిగింది.

పంట కాలువ ఆక్రమించి వంతెన..
వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె రెవెన్యూ గ్రామంలో పెద్దఓరంపాడు చెరువు నుంచి రామక్కపల్లెకు వెళ్లే  పంటకాలువపై అధికార పార్టీ నాయకులు అక్రమంగా వంతెన నిర్మించి అలుగు పోరంబోకులో బోర్లు వేసి ఏకంగా చెరువు భూమిని చదును చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు స్పందించి పనులను నిలిపివేశారు. కాలువ గుండా వర్షాకాలంలో నీరు ప్రవహిస్తే చెరువు నిండి 500 ఎకరాలకు నీరు అందుతుంది. కాలువకు అడ్డంగా వంతెన నిర్మిస్తే చెరువులోకి నీరు రాదు. అలుగు కింద భూమిని మొత్తం సాగు చేసుకోవాలని ఓ టీడీపీ నాయకుడి అనుచరుడు 8 ఎకరాలు ఆక్రమించుకున్నారు. వెంటనే వంతెనను తొలగించి చెరువు అలుగు వద్ద ఆక్రమణలను తొలగించాలని రామక్కపల్లె, అప్పారాజంపేట, అనంతంపల్లె గ్రామాల రైతులు కోరుతున్నారు.

ఆవిలాల చెరువులో భారీ భవంతులు..
తిరుపతిలోని ఆవిలాల చెరువు చాలావరకూ ఆక్రమణలతో చిక్కిపోయింది. మట్టి తోలి ఎత్తు చేసి చెరువు భూమినే ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. అక్కడ ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటం గమనార్హం. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నాయకులు ఉండటంతో అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.

ఇదేం దారుణం!
గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు పంచాయితీకి చెందిన సింగం శాంతాదేవి (టెకులమ్మ) నుంచి ముగ్గురు వ్యక్తులు 1998లో వీలునామా ద్వారా రాయించుకున్న,  2005లో రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ ద్వారా కొనుగోలు చేసి పంటలు సాగు చేసుకుంటున్న 10.78 ఎకరాల విలువైన భూములను 2013లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ వీలునామా రాయించుకున్న సింగం ప్రసాదరెడ్డి అనే వ్యక్తికి తహసీల్దారు ఏకపక్షంగా బదలాయించి  పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయటం గమనార్హం. ఓ టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఈ వ్యవహారం అంతా సాగినట్లు ఆరోపణలున్నాయి. 2005లో రిజిస్ట్రేషన్‌ సమయంలో శాంతాదేవి ఆంగ్లంలో సంతకం చేయగా ప్రసాద్‌రెడ్డి సమర్పించిన అన్‌ రిజిస్టర్డ్‌ వీలునామాలో ఆమె వేలిముద్ర ఉండటం ఫోర్జరీ వ్యవహారాలకు నిదర్శనం. దీనిపై బాధితులు ముఖ్యమంత్రితోపాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. తహసీల్దారు ఆదేశాలను తక్షణమే నిలిపివేయాలంటూ గుంటూరు ఆర్డీవో కోర్టులో అప్పీల్‌ కూడా చేసుకున్నారు.

సెంటు రూ. 20 – 25 లక్షలకు అమ్మకం
వైఎస్సార్‌ జిల్లా రాజంపేటలో మన్నూరు, ఊటుకూరు, పోలి, క్రిష్టం చెరువులు ఆక్రమణలపాలయ్యాయి. చిత్తూరు జిల్లా పుల్లంపేట మండలంలో పుల్లంగేరు, రాజంపేట ప్రాంతంలో చక్రాలమడుగు అని వ్యవహరించే వాగు ఆక్రమణలతో చిక్కి శల్యమైంది. భారీ వర్షం కురిస్తే రాజంపేటలో ఇళ్లలోకి నీరు చేరు ప్రమాదం పొంచి ఉంది. కడప – చెన్నై రహదారిని ఆనుకుని చక్రాలమడుగు వాగు ప్రాంతాన్ని ఆక్రమించుకున్న భూమిని స్థానిక టీడీపీ నాయకులు సెంటు రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల చొప్పున అమ్ముకుంటున్నారు. చక్రాలమడుగు వాస్తవంగా జలవనరుల శాఖది. ఈ భూమి క్రయ విక్రయాలకు అవకాశం లేదు. అయితే భూమి వర్గీవకరణనే నకిలీ రికార్డులతో మార్చేసి కోట్లు దండుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు