భూకాయింపులేల ‘బోండా’

27 Feb, 2018 09:46 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు

సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూత్రధారిగా, పార్టీ నేత మాగంటి బాబు పాత్రధారిగా యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడ్డారని బాధితులు సాక్ష్యాధారాలతో సహా వెల్లడించారు. విజయవాడలో స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబానికి చెందిన రూ.50 కోట్ల విలువైన భూమిని చిన్నా చితకా పనులు చేసుకునే రామిరెడ్డి కోటేశ్వరరావు, అబ్దుల్‌ మస్తాన్‌ పేరుతో ఎమ్మెల్యే బొండా భార్య సుజాత, మాగంటి బాబు డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కింద సొంతం చేసుకోవటం తెలిసిందే. తీరా వ్యవహారం బయటపడ్డాక అసలు మాగంటి బాబు ఎవరో తనకు తెలియదని బొండా కొత్త పల్లవి అందుకున్నారు.

నేనే బొండా సుజాత పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించా : మాగంటి బాబు
సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ ఎదుట విచారణకు హాజరైన అనంతరం మాగంటి బాబు మీడియాతో మాట్లాడుతూ 5.16 ఎకరాల్లో 1.50 ఎకరాలను తానే ఎమ్మెల్యే బొండా భార్య సుజాత పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు చెప్పడం గమనార్హం. మరికొంత భూమిని మాగంటి బాబు పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు. అంటే స్వాతం త్య్ర సమరయోధుడి 5.16 ఎకరాలను ఎమ్మెల్యే బొండా కుటుంబం, మాగంటి బాబు కలిసే కాజేశారని స్పష్టమవుతోంది.

బొండా అండతోనే భూదందాలు
అజిత్‌సింగ్‌నగర్‌లో 21 మందికి చెందిన మరో రూ.15 కోట్ల విలువైన భూమిని మాగంటి బాబు తన ఆధీనంలో పెట్టుకున్నారు. పెనమలూరులో రూ.4 కోట్ల విలువైన 80 సెంట్ల స్థలం ఆ వర్గం ఆధీనంలోనే ఉంది. రాజరాజేశ్వరిపేటలో రూ.2.50 కోట్ల విలువైన 1,200 గజాల స్థలం ఆ వర్గం ఆక్రమణలోనే ఉంది. బొండా ఉమా అండతోనే మాగంటి బాబు అడ్డగోలుగా భూవ్యవహారాలు సాగిస్తున్నట్లు బోధపడుతోంది.

అధికార యంత్రాంగం రక్షాకవచం
ఎమ్మెల్యే బొండా ఉమా, మాగంటి బాబు జోడీ బరితెగించి భూబాగోతాలు సాగిస్తున్నా అధికార యంత్రాంగం కిమ్మనడం లేదు. రూ.50 కోట్ల విలువైన స్వాతంత్య్ర సమరయోధుడి భూమి కబ్జాపై కూడా అధికారుల తీరు సందేహాస్పదంగా ఉంది. అసలు ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసింది అధి కారులే. ఇప్పుడు విచారణ పేరుతో అధికారులే కథ నడిపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్‌ సుమోటోగా స్వీకరించి జేసీ విజయ్‌కృష్ణన్‌తో పాటు మరో నలుగురు అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీకి అధికారిక గుర్తింపు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

‘బొండా’గిరిపై కొనసాగుతున్న విచారణ

విజయవాడ: ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచురుల భూకబ్జాలపై కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఏర్పాటుచేసిన ఐదుగురు సభ్యుల అధికారుల కమిటీ విచారణ సోమవారం కొనసాగింది. జేసీ కార్యాలయంలో నిర్వహించిన విచారణలో కమిటీ సభ్యులు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటేష్, జిల్లా రిజిస్ట్రార్‌ జి. శ్రీనివాస్‌ పాల్గొన్నారు. జేసీ విజయకృష్ణన్‌ ఇచ్చిన నోటీసుల ప్రకారం బొండా ఉమా భార్య సుజాత తరఫు న్యాయవాది.. కమిటీ సభ్యులకు లిఖితపూర్వకంగా తమ వాదనలు వినిపించారు. తాము స్వాతంత్య్రసమరయెధుడి భూమి అని తెలియక వేరొకరి నుంచి డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేయించుకున్నామని పేర్కొన్నారు. ఆ భూమి వివాదంలో ఉందని తెలుసుకుని అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నామని చెప్పారు. 

ఇప్పటికీ కబ్జాలోనే 5.16 ఎకరాలు 

రూ.50 కోట్ల విలువైన భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్నామని ఎమ్మెల్యే బొండా ఉమా చెబుతున్నారు. అయితే, ఇప్పటికీ ఆ భూమి స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబం ఆధీనంలో లేదు. ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి వెళితే టీడీపీ వర్గీయులు అడ్డుకుంటున్నారు. మరోవైపు మాగంటి బాబు ఆ భూమిని అబ్దుల్‌ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావు నుంచి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. చిన్నాచితకా పనులు చేసుకునే అబ్దుల్‌ మస్తాన్, కోటేశ్వరరావుకు అంత విలువైన భూమిని విక్రయించే స్థాయి ఉందా? అని ప్రశ్నిస్తే ఆ విషయం తనకు అనవసరమంటూ తప్పించుకుంటున్నారు. అప్పటిదాకా ఆ 5.16 ఎకరాలు తమ గుప్పిట్లోనే ఉంటాయని తేల్చి చెబుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. దీన్నిబట్టి మాగంటి బాబు, అధికారుల ద్వారా ఎమ్మెల్యే బొండా ఉమా కథ నడిపిస్తూ భూమి చేజారకుండా జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టమవుతోంది.  

డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌పై భూమి స్వాధీనం 
అబ్డుల్‌ సత్తార్‌ నుంచి నేను 1.57 సెంట్ల భూమిని డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌పై స్వాధీనం చేసుకున్నాను. అబ్దుల్‌ సత్తార్‌ కనుక తనకు తప్పుడు కాగితాలతో భూమిని అగ్రిమెంట్‌ చేసినట్లు విచారణలో తేలితే భూమిని వదిలేస్తా. అబ్దుల్‌ సత్తార్‌పై న్యాయపోరాటం చేస్తా. నేను ఎవరి భూమిని కబ్జా చేయలేదు. స్వాతంత్య్ర సమరయోధుడి మనవడు సురేష్‌బాబే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాడు. ఆధారాలు ఉన్నాయి. బొండా ఉమాతో నాకు వ్యాపార లావాదేవీలు లేవు. కేవలం పార్టీ సంబంధాలు ఉన్నాయి. బొండా సుజాతకు కొంత భూమిని డెవలప్‌మెంట్‌పై కొనుగోలు చేయించాను. వివాదంలో ఉందని తెలుసుకుని ఆమె ఆ డీల్‌ను రద్దు చేసుకున్నారు. 
– మాగంటి బాబు, రియల్టర్,  బొండా ఉమా అనుచరుడు 

నాపై అన్నీ తప్పుడు ఆరోపణలు
నాపై రామిరెడ్డి కోటేశ్వరరావు, ఆయన కుమారుడు సురేంద్ర తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాకు రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు లేవు. కోటేశ్వరరావు కుమారుడు సురేంద్ర, నేను చిన్ననాటి నుంచి చదువుకున్నాం. ఆ పరిచయంతో  నా పార్టీ ఆఫీసులో కొంతకాలం పనిచేశాడు. గత ఏడాది ఇళ్లు తనఖా పెట్టించి కొంత డబ్బు అప్పు ఇవ్వమని అడిగాడు. అందుకు నేను అంగీకరించలేదు. అందుకు నాపై కక్షతో మాట్లాడుతున్నారు. మాగంటి బాబుతో నాకు పార్టీ సంబంధాలు తప్ప వ్యాపార లావాదేవీలు లేవు. నేను ఎవరినీ మోసగించలేదు. 
– దండూరి మహేష్, టీడీపీ కార్పొరేటర్‌ 

మాకు సంబంధం లేదు
స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని కబ్జా చేసిన మాగంటి బాబుతో మాకు సంబంధమే లేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వాన్ని కోరతా..
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా

నాపై అన్నీ తప్పుడు ఆరోపణలు 
నాపై రామిరెడ్డి కోటేశ్వరరావు, ఆయన కుమారుడు సురేంద్ర తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాకు రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు లేవు. కోటేశ్వరరావు కుమారుడు సురేంద్ర, నేను చిన్ననాటి నుంచి చదువుకున్నాం. ఆ పరిచయంతో  నా పార్టీ ఆఫీసులో కొంతకాలం పనిచేశాడు. గత ఏడాది ఇళ్లు తనఖా పెట్టించి కొంత డబ్బు అప్పు ఇవ్వమని అడిగాడు. అందుకు నేను అంగీకరించలేదు. అందుకు నాపై కక్షతో మాట్లాడుతున్నారు. మాగంటి బాబుతో నాకు పార్టీ సంబంధాలు తప్ప వ్యాపార లావాదేవీలు లేవు. నేను ఎవరినీ మోసగించలేదు. 
– దండూరి మహేష్, టీడీపీ కార్పొరేటర్‌ 

న్యాయం గెలుస్తుందనుకుంటున్నా..
రెండు, మూడు నెలల్లో మోసం బయటపడి న్యాయం గెలుస్తుంది. మాగంటి బాబు తదితరులు ఫోర్జరీ సంతకాల గుట్టురట్టవుతుంది. అధికారుల విచారణలో రెండు మూడు నెలల్లో పూర్తి విషయాలు వెల్లడవుతాయి. ఇప్పటికే  వారికి డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ ఇచ్చినట్లు చెబుతున్న రామిరెడ్డి కోటేశ్వరరావు నేను అగ్రిమెంట్‌ చేయలేదని లిఖిత పూర్వకంగా ఇచ్చారు. మాగంటి బాబు, బొండా సుజాత మా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు కోటేశ్వరరావు పూర్తి ఆధారాలతో విచారణాధికారులకు వివరించారు. తప్పు కప్పి పుచ్చుకునేందుకు మాగంటి బాబు, ఎమ్మెల్యే బొండా ఉమా అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
    – కేసిరెడ్డి సురేష్‌బాబు, స్వాతంత్య్ర సమరయోధుడి మనవడు  

మరిన్ని వార్తలు