భూ మాయగాళ్లు

5 Mar, 2018 07:43 IST|Sakshi
వేదాంతపురంలో ఆక్రమణకు గురైన శ్మశానవాటిక స్థలం

కాలువ, కుంట, చెరువులను మింగిన ఘనులు

అవిలాల, వేదాంతపురంలో బరితెగించిన టీడీపీ నేతలు

ఇళ్ల స్థలాల పేరుతో అమ్మకాలు.. రాత్రికి రాత్రే నిర్మాణాలు

అప్పటికప్పుడే విద్యుత్‌ స్తంభాలు, నివాసాలకు మీటర్లు

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మరికొందరు నాయకుల ప్రమేయం

 కోట్ల విలువజేసే 259 ఎకరాల భూములు హాంఫట్‌

తిరుపతి చుట్టూ అక్రమార్కులు బరితెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నేతలు అధికారుల సహకారంతో అనాధీనం.. కాలువ, కుంట, చెరువు, స్వర్ణముఖి నదీ పోరంబోకు భూములను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటున్నారు. ఈ మూడేళ్లలో కోట్ల రూపాయల విలువజేసే సుమారు 259 ఎకరాలకుపైగా స్వాధీనం చేసుకున్నారు. ఆ భూములను ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వ భూములని తెలియక కొనుగోలు చేసిన అనేకమంది బాధితులు పట్టాల కోసం నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణ     చేస్తున్నారు. తిరుపతి రూరల్‌ పరిధిలో భూమాయగాళ్లపై ‘సాక్షి’ టాస్క్‌ఫోర్స్‌ స్పెషల్‌ ఫోకస్‌..

సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్‌: విభజన తర్వాత తిరుపతికి అత్యంత ప్రాధాన్యత పెరిగింది. ఏడుకొండల వాడి చెంత ఇంత చోటుంటే చాలనుకునేవారు నానాటికీ పెరుగుతున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన అనేక మంది వ్యాపారులు తిరుపతిలో నివాసాల ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. వీరి అవసరాలు.. భూములకు పెరుగుతున్న డిమాండ్‌ను అధికార పార్టీ నేతలు క్యాష్‌ చేసుకుంటున్నారు. మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక టీడీపీ నేతలు వారి అనుచరుల ద్వారా ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని స్వాధీనం చేసుకుంటున్నారు.

అక్రమాల అడ్డా అవిలాల
తిరుపతి సమీపంలోని అవిలాల రెవెన్యూ పరిధిలోని వేదాంతపురం పంచాయతీ సర్వే నం.360లో 178 ఎకరాలు వంక, కాలువ పోరంబోకు భూములతో పాటు ప్రభుత్వ భూమి ఉంది. కాలువ, స్వర్ణముఖి నదికి మధ్యలో ఉన్న ఈ భూమిని అధికార పార్టీకి చెందిన నాయకులు ఇద్దరు ప్లాట్లు వేసి విక్రయించారు. అందుకోసం ముగ్గురు బ్రోకర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్లాటు కొనుగోలు చేసిన వారికి దగ్గరుండి తాత్కాలిక షెడ్లు వేయిస్తుంటారు. ప్లాటు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వందకుపైగా నివాసాలున్నాయి. మరికొన్ని నిర్మాణాలు సాగుతున్నాయి.
 
మాజీ ఎమ్మెల్యే నిర్వాకం..
శ్రీకాళహస్తికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సుమారు రూ.15 కోట్లు విలువచేసే చెరువును ఆక్రమించుకున్నారు. అవిలాల రెవెన్యూలోని సర్వే నం.377లో 12 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన ఓటేరు చెరువును ఆ ఎమ్మెల్యే దర్జాగా కబ్జా చేశారు. చెరువు ఆక్రమణ విషయం అధికారులకు తెలిసినా ఎవ్వరూ నోరెత్తలేదు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో చెరువును పూడ్చేందుకు ప్రయత్నించారు. టిప్పర్లతో మట్టి తెచ్చి జేసీబీలతో పూడ్చివేస్తున్నా అడ్డుకునేందుకు ఎవ్వరూ సాహసించలేకపోయారు. చివరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల సహకారంతో స్థానికులు కోర్టును ఆశ్రయించారు.

బండ పోరంబోకుపై భూరాబందులు
సర్వే నం.250లో 6.3 ఎకరాల బండ పోరంబోకు స్థలం ఉంది. ఇందులో 26 మంది గంగిరెద్దుల కుటుంబాల వారికి పట్టాలిచ్చారు. ఈ పట్టాలను సాకుగా చూపించి మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు ఒకరు పెద్ద ఎత్తున విక్రయాలకు తెరదీశారు. పక్కనే శ్మశానం ఉన్నా దాన్ని కూడా ఆక్రమించి రెండు సెంట్ల స్థలాన్ని రూ.5 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

రామ..రామా!
రామచంద్రయ్య కాలనీలో సర్వే నం.222, 223/2, 224, 225లో సుమారు 5 ఎకరాల కాలువ పోరంబోకు భూమి ఉంది. ఇందులో 62 మందికి పట్టాలు మంజూరు చేశారు. వారి పేర్లు చెప్పుకుని మాజీ మంత్రి అనుచరుడు 2 సెంట్ల స్థలాన్ని రూ.5 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు.

భూమంత్రకాళి..
రామదాసు కాలనీలో సర్వే నం.230/1, 230/2, 231/3లలో మరో 4.5 ఎకరం బండ పోరంబోకు భూమి ఉంది. ఇందులో కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు ఇచ్చి మిగిలిన భూమిని అమ్ముకున్నారు. మరికొంత భూమిలో హౌసింగ్‌ స్కీంలో పక్కాగహాలు నిర్మించి అమ్ముకున్నారు. తిరుమలలోని పాపవినాశనంలో దుకాణాల తొలగింపుతో నష్టపోయిన వారికి వేదాంతపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.233/2, 232లో 1.5 ఎకరాల్లో 43 మందికి పట్టాలు ఇచ్చారు. మిగిలిన స్థలాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నారు.

తిరుచానూరు సమీపంలో సర్వే నం.479లో 36 ఎకరాల స్వర్ణముఖి నది పోరంబోకు భూమి ఆక్రమణకు గురైంది. రెండేళ్ల క్రితం లోతట్టు ప్రాంతంలో జేసీబీలు పెట్టి చదును చేయించుకున్నారు. ఆక్రమించుకున్న ప్రాంతంలో ప్రహరీ గోడ కూడా నిర్మించుకోవడం గమనార్హం. ఆక్రమణల గురించి తమకు ఎటువంటి ఫిర్యాదులూ అందలేదని రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు.

బరితెగిస్తున్న మాజీ మంత్రి అనుచరులు..
తిరుపతి రూరల్‌ మండల పరిధిలో మాజీ మంత్రి అనుచరులు ఇద్దరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వేదాంతపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.203/2, 204/1లో సుమారు 5 ఎకరాల కాలువ పోరంబోకు ఉంది. రూ.5 కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని ప్లాట్లు వేసి విక్రయించుకున్నారు. మరికొన్ని ప్లాట్లలో వారే నివాసాలు నిర్మించి అమ్ముకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 162 నివాసాలున్నాయి. దీనికి విజయనగర కాలనీగా నామకరణం చేశారు.

ఇవి మొత్తం అక్రమమేనని అధికారులు స్పష్టం చేశారు. ఇదే కాలనీలో సర్వే నం.208లో ఉన్న మరో 2.5 ఎకరాల కాలువ పోరంబోకును కూడా ఆక్రమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సర్వే నం.246, 247లో మరో 5 ఎకరాల కాలువ పోరంబోకు భూమిని ఆక్రమించేందుకు రంగం సిద్ధమైంది.
 

మరిన్ని వార్తలు