మీ భూమి జాగ్రత్త

16 Nov, 2018 03:49 IST|Sakshi

పట్టాదారు పాసుపుస్తకంలో భూమి ఉంటే ఉన్నట్లు కాదు!

‘మీభూమి’ వెబ్‌సైట్‌లో చిత్ర విచిత్రాలు

వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కని భూమి 33 లక్షల ఎకరాలకుపైనే

రాత్రికి రాత్రే మారిపోతున్న రికార్డులు

అసైన్డ్‌ భూములూ ఇతరుల పేర్లతో మార్పిడి

ఒకరి భూమిని మరొకరి పేరుతో మార్చి అమ్మకాలు

లబోదిబోమంటున్న బాధితులు

రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి

దూరప్రాంతాల్లో ఉండేవారు మరింత జాగ్రత్త వహించాలంటున్న నిపుణులు

రాష్ట్రంలో చిన్న రైతుల భూములకు రక్షణ కరువైంది. ఒకవైపు భూసేకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం లక్షల ఎకరాలు గుంజుకుంటుండగా మరోవైపు అధికార పార్టీ నాయకులు రెవెన్యూ రికార్డులను మార్చేసి ఇతరుల భూములను దర్జాగా కాజేస్తున్నారు. అసైన్డ్‌ భూములు సైతం వారి చేతుల్లోకే చేరిపోతున్నాయి. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం దాతలు ఇచ్చిన ఈనాం భూముల్లోనూ టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోతు న్నారు.

’మీభూమి’ వెబ్‌సైట్‌లో భూ యజమానుల వివరాలు రాత్రికిరాత్రే మారిపోవడం రైతులను కలవరపెడుతోంది. పట్టాదారు పాసుపుస్తకాలు, భూ యాజమాన్య హక్కు పత్రాలు ఉన్నప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో మాత్రం ఇతరుల పేర్లతో ప్రత్యక్షమవు తున్నాయి. స్థానికంగా నివాసం లేని వారి భూములపై కన్నేసిన కబ్జాదారులు కొందరు అధికారుల సాయంతో రికార్డులను తారుమారు చేస్తున్నారు.

ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా.. లక్షల ఎకరాల ప్రైవేట్‌ భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాకపోవడం ’మీభూమి’ డొల్లతనాన్ని రుజువు చేస్తోంది. ఈ వెబ్‌ల్యాండ్‌ను ప్రామాణికంగా తీసుకుని పంట రుణాలు ఇవ్వలేమని ప్రభుత్వ రంగ బ్యాంకులే తేల్చి చెబుతున్నాయి. రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ పుస్తకం (ఎఫ్‌ఎంబీ), భూ అనుభవ రికార్డు (అడంగల్‌) మధ్య 33 లక్షల ఎకరాలకు పైగా భూముల్లో తేడా ఉండటం రెవెన్యూ రికార్డులు తప్పులతడకలుగా ఉన్నాయనేందుకు నిదర్శనం.

భూ వివాదాలు పెరిగి శాంతిభద్రతల సమస్యకు దారి తీయడానికి ఇది కూడా కారణం. రెవెన్యూశాఖ వద్దే భూ రికార్డులు సక్రమంగా లేకుంటే ఇంతకంటే దారుణం ఏముంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రికార్డులు సరిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెబ్‌ల్యాండ్, భూదార్‌ అంటూ సర్కారు మాయమాటలు చెబుతూ సామాన్యుల భూ యాజమాన్య హక్కుల భద్రతను దెబ్బ తీస్తోందని రెవెన్యూ, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూ యజమానులకు స్థిరాస్తిపై రక్షణ లేకుండా పోవడంపై ‘సాక్షి’
అందించనున్న వరుస కథనాల్లో ఇది మొదటిది...


సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతుల భూ యాజమాన్య హక్కుల భద్రత డొల్లగా మారిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. శ్రీకాకుళం నుంచి  అనంతపురం వరకూ అన్ని జిల్లాల్లో రెవెన్యూ శాఖకు చెందిన ’మీభూమి’ వెబ్‌ల్యాండ్‌లో రాత్రికి రాత్రే భూ యాజమాన్య హక్కులు మారిపోతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. తమ భూమి తమ పేరుతోనే ఉందా? లేక ఇతరుల పేరుతో మారిపోయిందా? అని నిత్యం వెబ్‌ల్యాండ్‌లో సరిచూసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని భూ యజమానులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోయిందనడానికి ఈ పరిణామాలే నిదర్శనం. రికార్డులను ట్యాంపరింగ్‌ చేస్తూ విలువైన భూములను ల్యాండ్‌ మాఫియా కొట్టేస్తోంది. ఈ నేపథ్యంలో  భూములను రక్షించుకునేందుకు సామాన్యులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  

గిరిజన రైతును బలితీసుకున్న టీడీపీ నేత భూదాహం
అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల భూ దాహానికి ఓ గిరిజన రైతు బలైపోయాడు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం వేపచెర్ల తాండాకు చెందిన రైతు కేశవ్‌ నాయక్, శాంతమ్మ దంపతులకు  ఇద్దరు కుమార్తెలు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో శాంతమ్మ పేరుతో సర్వే నంబరు 507–2లో  3.21 ఎకరాల భూమిని  డీపట్టా కింద ఇచ్చారు. వారు అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శాంతమ్మ పేరుతో బ్యాంకులో రుణం కూడా తీసుకున్నారు.

అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కృష్ణానాయక్‌ ఆ భూమిని తన పేరుతో ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నాడు. తమ భూమిని టీడీపీ నాయకుడు కృష్ణానాయక్‌ పేరుతో వెబ్‌ల్యాండ్‌లో ఎలా మార్చారని బాధితురాలి భర్త కేశవ్‌ నాయక్‌ రెవెన్యూ అధికారులను సంప్రదించగా తమ చేతిలో ఏమీ లేదని చెప్పారు. బ్యాంకు రుణం చెల్లించాలని నోటీసు జారీ కావడం, రుణం రెన్యువల్‌ చేయించుకోవాలంటే భూమి తన భార్య పేరుతో లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక కేశవ్‌నాయక్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 15న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ అత్త పేరుతో ఉన్న భూమి వెబ్‌ల్యాండ్‌లో రాత్రికి రాత్రే ఇతరుల పేరుతో మారిపోయింది. ప్రభుత్వ విప్‌ కుటుంబానికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల భూములకు ఇక రక్షణ ఎక్కడుందని ఆయన ఇటీవల అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు.

 అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన శాంతమ్మకు ప్రభుత్వం ఇచ్చిన 3.21 ఎకరాల అసైన్డ్‌ భూమి స్థానిక టీడీపీ నేత కృష్ణానాయక్‌ పేరుతో వెబ్‌ల్యాండ్‌లోకి మారిపోయింది. దీన్ని సరిదిద్దాలంటూ శాంతమ్మ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన పెద్ద కర్రెన్నకు ఉన్న రెండెకరాలు సైతం రెవెన్యూశాఖ వెబ్‌ల్యాండ్‌లో ఇతరుల పేరుతో కనిపిస్తోంది.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి
నివాసం ఉంటున్న ప్రాంతంలో కాకుండా  వేరే ప్రాంతాల్లో మీకు భూమి ఉందా? అయితే జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే ఇతరులు తమ పేర్లతో మార్చుకుని దొడ్డిదారిన హక్కుదారులయ్యే ప్రమాదం పొంచిఉంది.
♦   అర్ధబలం, అంగబలం ఉన్నవారి భూముల జోలికి ఎవరూ రారు.
♦  సామాన్యులు తమ భూమిని కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండటం తప్పదు.
♦  కరువు వల్ల వలస వెళ్లి పట్టణాల్లో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న సన్న, చిన్నకారు రైతులు కూడా తమ భూముల విషయంలో ఓ కంట కనిపెడుతూ ఉండాలని జరుగుతున్న పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.
 రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డుల వెబ్‌ల్యాండ్‌ ’మీభూమి’లో అనుభవదారులుగా మీపేర్లే ఉన్నాయా? మారాయా? అనే విషయాన్ని తరచూ పరిశీలిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి ఇతరుల భూములను  తమ పేర్లతో మార్చుకుని విక్రయ రిజిస్ట్రేషన్లు చేసిన సంఘటనలు పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.
అసైన్డ్‌ భూములను సైతం జిరాయితీ పట్టాల ఖాతాలో వేసి యజమానుల పేర్లు మార్చేస్తున్నారు.  
రాష్ట్రంలో భూములున్నా ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లిన వారు మరింత జాగ్రత్త వహించాలి. వంశపారంపర్యంగా భూమి సంక్రమించినా సరైన రికార్డులు లేనివారు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.


భూ మాయలు
మా ఖాతా నంబరుపై  వేరొకరి పేరు....
నాకు కర్నూలు జిల్లా నరసాపురం సర్వే నెంబరు 531సీ2బిలో రెండు ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు ఖాతా నంబరు 292 కింద పట్టాదారు పాసుపుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రం (1బి) కూడా 2015లో ఇచ్చారు. ఈ భూమిని ఇప్పుడు నాపేరుతో కాకుండా ఇదే ఖాతా నంబరుతో ఇతరుల పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. న్యాయం కోసం తహసీల్దారు కార్యాలయం చుట్టూ  తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు.  –పెద్ద కర్రెన్న, ఎం.పెండేకల్, బేతంచెర్ల మండలం, కర్నూలు జిల్లా

భూమి వివరాలు ఆన్‌లైన్‌లో లేవు..
మాకు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సర్పరాజపురం రెవెన్యూ గ్రామం సర్వే నెంబరు 327 ఏ2లో 1.53 ఎకరాల భూమి ఉంది.  దీనికి పట్టాదారు పాసుపుస్తకం (పట్టా నెంబరు 95) కూడా ఇచ్చారు. మా భూమి ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనబడటం లేదు. ఆన్‌లైన్‌లో భూమి వివరాలు లేనందున ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వట్లేదు. రెవెన్యూ అధికారులు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.  ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. – పి.మధుసూదన్, ఎం.పెండేకల్, బేతంచెర్ల మండలం, కర్నూలు జిల్లా

భూమి నావద్ద ఉండగానే అడంగల్‌లో మార్చేశారు..
నాకు శ్రీకాకుళం మండలం వాకలవలసలో భూమి ఉంది. ఈ భూమికి 24 ఖాతా నెంబరుతో  పట్టాదారు పాస్‌ పుస్తకం కూడా ఉంది.  ఈ ఏడాది బ్యాంకు రుణం కోసం  మీసేవ నుంచి  అడంగల్‌ తీసుకోగా నాపేరిట ఉండాల్సిన భూమిని ఇతరులు కొనుగోలు చేసినట్లుగా చూపిస్తోంది. నేను అమ్మకుండానే నాభూమిని ఎవరైనా ఎలా కొంటారు? భూమిని తిరిగి నా పేరిట మార్చాలని తహశీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఏదో ఒక నెపం, కొర్రీలతో దాటవేస్తున్నారు. – కూన నీలయ్య,  రైతు, శ్రీకాకుళం మండలం,

మరిన్ని వార్తలు