మాయగాళ్లు!

9 Jan, 2014 02:37 IST|Sakshi
మాయగాళ్లు!

కల్వల మల్లికార్జున్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నర్సాపూర్, తూప్రాన్ దారిలో దట్టమైన అటవీ ప్రాంతం. ఉన్నట్టుండి ఏడాది క్రితం చెట్టూ పుట్టా మాయమై మైదానంగా మారింది. కోట్లాది రూపాయల విలువ చేసే 45.33 ఎకరాల భూమి ‘ఇనాం’ పేరిట పట్టా భూమిగా మారిపోయింది. దీని కోసం అక్రమార్కులు ‘బైబిల్ ఫర్ రెవెన్యూ రికార్డు’గా పేర్కొనే ఖాస్రా పహణీని సైతం చెదలు పట్టించారు. నమ్మశక్యం కాని రీతిలో రికార్డుల్లో ఎక్కడా లేని ఓ సర్వే నంబరును కొత్తగా సృష్టించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్నత స్థానంలో ఉన్న ఓ రెవెన్యూ అధికారి సాయంతో ఈ తతంగం జరిగినట్లు సమాచారం.
 
రెవెన్యూ పరిభాషలో సేత్వార్, ఖాస్రా పహణీ, గ్రామ నక్షా అత్యంత విలువైన పత్రాలు. ఈ రికార్డుల ప్రకారం నర్సాపూర్ మండలం హన్మంతాపూర్‌లో మొత్తం 154 సర్వే నంబర్లలో 851.27 గుంటల భూమి ఉంది.  సేత్వార్, నక్షా, ఖాస్రా పహణీ ప్రకారం నర్సాపూర్ మండలం హన్మంతాపూర్‌లో చిట్ట చివరి సర్వే నంబరు 154. ఆ తర్వాతి కాలంలో సర్వే నంబరు 155 పేరిట 45.33 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు పహణీల్లో నమోదు చేయించారు. 2006లో సదరు భూమిని ‘ఇనాం భూమి’గా గుర్తిస్తూ రెవెన్యూ అధికారులు ఓఆర్‌సీ (ఆక్యుపెంట్స్ రైట్స్ సర్టిఫికేట్) జారీ చేశారు. 1955 నాటి ఇనాం భూముల రద్దు చట్టం ప్రకారం ఓఆర్‌సీ ఇవ్వకూడదు. అయితే 1975లో జారీ చేసిన జీఓ 870 ప్రకారం ఖాస్రా పహణీలో మొదటి నుంచి ఇనాం భూమిగా నమోదై ఉంటే ఓఆర్‌సీ జారీ చేయొచ్చు. హన్మంతాపూర్ 155 సర్వే నంబరులోని 45.33 ఎకరాల భూమి విషయంలో మాత్రం అధికారులు ఈ నిబంధనలేవీ పాటించకుండానే ఓఆర్‌సీ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి గతంలో మెదక్ ఆర్డీఓగా పనిచేసిన కాలంలో ఓఆర్‌సీ జారీ అయినట్లు సమాచారం. 2006లో ఓఆర్‌సీ పట్టా పొందిన కొందరు 2009లో ఇతరులకు విక్రయించగా ఇప్పటికే పలువురి చేతులు మారింది.
 
 సర్వే లేకుండానే కొత్త నంబరు
 నిజానికి ఖాస్రా పహణీలో కొత్తగా సర్వే నంబరును నమోదు చేయాలంటే గ్రామంలోని భూమినంతటినీ సర్వే సెటిల్‌మెంట్ విభాగం సర్వే చేసి కొత్త సర్వే నంబరు కేటాయిస్తుంది. సాధారణంగా రీ సర్వే సమయంలో గ్రామంలో భూ విస్తీర్ణం తగ్గడమో, పెరగడమో జరిగిన సందర్భంలో మాత్రమే సర్వే నంబర్లలో మార్పు చేస్తారు. గతంలో సర్వే చేసేందుకు వీలుకాని భూములను ‘బిలా దాఖలా’ (ఏ గ్రామ రికార్డుల్లోనూ లేని భూములు)గా గుర్తించారు. బిలా దాఖలా భూములున్న పక్షంలో వాటిని సర్వే సెటిల్‌మెంట్ విభాగం ద్వారా గుర్తించి కొత్త సర్వే నంబరు కేటాయిస్తారు. ఇటీవల జిన్నారం మండలంలో 110 ఎకరాల బిలా దాఖలా భూములను ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ కొత్త సర్వే నంబరు కేటాయించారు. అయితే హన్మంతాపూర్ 155 సర్వే నంబరు విషయం లో మాత్రం ఏ రకమైన సర్వే, రీ సర్వే లేకుం డానే రికార్డుల్లో కొత్త నంబరు చేర్చడంపై రెవె న్యూ వర్గాలే అశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఖాస్రా పహణీ, ప్రస్తుతమున్న గ్రామ నక్షాను పరిశీలిస్తే ఇప్పటికీ హన్మంతాపూర్‌లో కేవలం 154 సర్వే నంబర్లు మాత్రమే ఉన్నాయి.
 
 త్వరలో ప్రాథమిక నివేదిక
 గ్రామ నక్షాలో కొత్త నంబరు చేర్చడంపై అనుమానం వచ్చిన ఓ రెవెన్యూ అధికారి తీగలాగడంతో 155 సర్వే నంబరు గుట్టు బయట పడింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హన్మంతాపూర్‌లో కొత్త సర్వే నంబరు గుట్టుగా పుట్టుకొచ్చిన వైనంపై విచారణ జరుపుతున్నారు. త్వరలో పూర్తి వివరాలతో జిల్లా ఉన్నతాధికారికి నివేదిక సమర్పించేందుకు నర్సాపూర్ రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
 

మరిన్ని వార్తలు