దర్జాగా కబ్జా

16 Jun, 2017 09:34 IST|Sakshi
దర్జాగా కబ్జా

► అధికార పార్టీ నేత అనుచరుడి భూ ఆక్రమణ
► అక్రమంగా ఆన్‌లైన్‌లో పేర్లు మార్చిన వైనం
► తహసీల్దార్‌ను ఆశ్రయించిన బాధిత రైతులు


రుద్రవరం (కర్నూలు సీక్యాంప్‌ ): దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇద్దరు నిరు పేదలు సాగు చేసుకుంటున్న భూములు తమవి అంటూ రాత్రికి రాత్రే కబ్జా చేశాడు ఓ అధికారి పార్టీ నేత అనుచరుడు. అధికారుల అండతో ఆన్‌లైన్‌లో పేరు మార్చి దర్జాగా కబ్జాకు పాల్పడ్డాడు. కర్నూలు మండల పరిధిలోని రుద్రవరం సర్వే నంబర్‌లో 474–1లో 2 ఎకరాలు,  473–2ఎలో 2.50 ఎకరాలను రుద్రవరం గ్రామానికి చెందిన మాదిగ పక్కీరన్న, మాదిగ నరసింహులు పెద్దల ఆస్తిగా సాగు చేసుకుంటున్నారు. ఈ పొలాలకు వారి పేరు మీద పాస్‌ పుస్తకాలు కూడా ఉన్నాయి.

ఇటీవల అధికార పార్టీ నేత అనుచరుడు శ్రీనివాసరెడ్డి రైతు నరసింహులు పొలంలో ఎకరా 18 సెంట్లు, పక్కీరన్న పొలంలో 25 సెంట్లు తన పేరు మీద ఆన్‌లైన్‌లో పేరు మార్పించాడు. పేదల భూములు శ్రీనివాసరెడ్డికి ఆన్‌లైన్‌ కావడంలో వీఆర్వో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దాదాపు రూ.2 లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. కేసీ కెనాల్‌ నష్టపరిహారం వస్తుందని పథకం ప్రకారం రెండు నెలలు క్రితం పక్కీరయ్య పొలం పాస్‌పుస్తకాలను వీఆర్‌ఓ తన దగ్గర ఉంచుకున్నాడు. ఈ సమయంలో ఆన్‌లైన్‌లో శ్రీనివాస్‌రెడ్డి పేరును వీఆర్వో దగ్గరుండి నమోదు చేయించాడని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల శ్రీనివాసరెడ్డి పీఏ రైతుల దగ్గరకు వచ్చి ఆ స్థలం తమ యజమానిదని, ఖాళీ చేయాలని హుకుం జారీ చేశాడు. ఉలిక్కిపడిన రైతులు మీసేవా కేంద్రానికి వెళ్లి ఆన్‌లైన్‌ పరిశీలించగా వారి సర్వేనెంబర్లు 474–1 , 473–2ఎ కొంత భూమి శ్రీనివాసులు రెడ్డి పేరు మీద నమోదు కావడంతో ఆందోళన చెందారు. ప్రస్తుతం ఈ స్థలంలో శ్రీనివాసరెడ్డి ట్రిప్పర్లు, లారీలను ఉంచాడు. ఈ మేరకు బాధిత రైతులు తహసీల్దార్‌ టీవీ.రమేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితుల వాదన విన్న తహసీల్దార్‌ ఆర్‌ఐతో విచారణ జరిపించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.    

నగర శివారుపై అధికార నేత చూపు:
అధికార పార్టీ నేత చూపు నగర శివారు ప్రాంతాలైన బి.తాండ్రపాడు, మునగాలపాడు, పసుపల, రుద్రవరం, నందనపల్లె వంటి ప్రాంతాలపై పడింది. లిటిగేషన్‌ భూములు కనిపిస్తే చాలు తన అనుచరులను అక్కడ దింపి భూములను కబ్జాకు గురిచేస్తున్నారు. ఎవరైన అడ్డవస్తే ఏదో కొంత ముట్ట జెప్పడం, తమ మాట వినని వాళ్లను అధికారంతో బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల అండతో ఈ వ్యవహారం మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇక శివారు భూములను దర్జాగా కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు.

న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుంటాం:
ఈ పొలం మా తాతలు, తండ్రుల కాలం నుంచి మాకు సంక్రమించింది. మేము అమ్మకుండానే వేరే వాళ్లకు ఆన్‌లైన్లో పొలం ఎలా వెళుతుంది. మా పొలం మేము ఎవ్వరికి అమ్మలేదు. మా పొలం మాకు దక్కకపోతే కలెక్టర్‌ ఎదుట మా కుటుంబం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం.  -మాదిగ పక్కీరయ్య, నరసింహులు

మరిన్ని వార్తలు