రూ.కోట్ల భూములు హాంఫట్

2 Mar, 2014 23:38 IST|Sakshi

యాచారం, న్యూస్‌లైన్:  హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉండడంతో మండలంలోని పలు గ్రామాల్లోని భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇదే అదనుగా గ్రామ కంఠం, గైరాన్ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా భూములకు సర్వే చేయకపోవడం, హద్దులు గుర్తించకపోవడం కబ్జాదారులకు వరంగా మారింది. అధికారులతో  రాజకీయ నాయకులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు విలువచేసే భూములను అందినకాడికి అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అడిగే అధికారులే లేకుండాపోయారు.

 మండలంలోని చాలా గ్రామాల్లో గ్రామ కంఠం, గైరాన్ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. వీటికి సర్వేలు చేసి హద్దులు గుర్తించాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు అధికారులతో మొర పెట్టుకున్నా స్పందించని దుస్థితి నెలకొంది. దీంతో కబ్జాదారులు వాటిని తోచిన కాడికి అమ్ముకుంటున్నారు. భూములను పరిరక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 రుజువులివిగో..
 నెలరోజుల క్రితం తాడిపర్తిలో రూ.లక్షల విలువచేసే భూమి కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ నారాయణరెడ్డి సమక్షంలో ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్ గ్రామస్తుల్ని సమావేశపర్చారు. పంచాయతీకి రూ.60 వేల ఆదాయం వచ్చేలా చేశారు. మల్కీజ్‌గూడలో సర్వే నంబరు 167లో కబ్జాకు గురైన గైరాన్ భూమిని గ్రామ సర్పంచ్ మల్లేష్ పరిరక్షించారు. ప్రస్తుతం ఈ భూమిలో  కృష్ణాజలాల సంపును నిర్మిస్తున్నారు. పైన పేర్కొన్న రెండు గ్రామాల్లోనే కాకుండా మిగతా 18 గ్రామాల్లోనూ రూ.కోట్ల విలువైన గ్రామకంఠం, గైరాన్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి విలువైన భూములను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

 అన్యాక్రాంత మైన భూముల వివరాలివీ..  
 మాల్ గ్రామంలోని సర్వే నంబరు 640లో దాదాపు రూ. 15 కోట్లు విలువ చేసే 20 ఎకరాల భూములున్నాయి. చుట్టూ హద్దులు లేకపోవడంతో ఈ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.  

 నక్కర్తమేడిపల్లి- తక్కళ్లపల్లి దారిలో అర ఎకరం  గ్రామకంఠం భూమి ఉంది. కానీ సర్వే చేసి హద్దులు గుర్తించలేదు.

 కుర్మిద్దలో ఎకరానికిపైగా గ్రామకంఠం భూమి ఉంది. సర్వే చేసి గుర్తించకపోవడంతో గ్రామస్తు ల మధ్య తరచూ ఘర్ణణలు జరుగుతున్నాయి. కేసులు నమోదైనా అధికారుల్లో చలనం లేదు. భూముల పరిరక్షణకు కృషి చేయడం లేదు.

 చింతుల్లలో ఎకరానికిపైగా గ్రామకంఠం భూమితో పాటు సర్వే నంబర్ 1, 2లలో రెండు ఎకరాల గైరాన్ భూములున్నాయి. గ్రామ పడమటి దిక్కున పేదల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిని పంపిణీ చేయకపోవడంతో అన్యాక్రాంతమవుతోంది.  

 మల్కీజ్‌గూడలో సర్వే నంబర్ 167లో సర్వే చేస్తే మరింత గైరాన్ భూమి బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అధికారులు సర్వే చేయకపోవడంతో వెలుగులోకి రావడం లేదు.

 నల్లవెల్లిలో రెండెకరాలకుపైగా గ్రామకంఠం భూమి ఉంది. వీటికి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని గ్రామస్తులు పలుమార్లు అధికారులను కోరినా  ఫలితం లేకుండాపోయింది.

 నందివనపర్తి, చింతపట్ల, గునుగల్, గడ్డమల్లయ్యగూడ తదితర గ్రామాల్లోనూ విలువైన గ్రామ కంఠం, గైరాన్ భూములున్నాయి. వాటిని గుర్తించి, హద్దులు ఏర్పాటు చేసి రక్షించే చర్యలు చేపట్టకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు