పూలింగ్‌ పితలాటకం

23 Jun, 2018 10:55 IST|Sakshi
ట్రై జంక్షన్‌లో ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సమీకరించనున్న భూములు 

సాక్షి, విశాఖపట్నం : పెరుగుతున్న జనాభాకనుగుణంగా భవిష్యత్‌లో విశాఖ పరిసరాల్లో కనీసం 30 వేల ఇళ్లు అవసరమవుతాయని అంచనా. దీనికి తోడు ప్రతిపాదనల్లో ఉన్న పలు ప్రాజెక్టులకు అవసరమైన ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. ఈ కారణంతో అమరావతి తరహాలోనే ఇక్కడా ల్యాండ్‌ పూలింగ్‌ అమలు చేయాలని నిర్ణయించారు. భూముల కొరత కారణంగా భారీ టౌన్‌షిప్‌లు నిర్మించాలని తలపోశారు. ’సరసమైన గృహ నిర్మా ణం’ పేరిట అమలు చేస్తున్న ఈ పథకానికి విశాఖ జిల్లానే ప్రయోగా త్మకంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం గత ఏడాదిగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న కసరత్తులు కొలిక్కి వచ్చాయి. ఈ భారీ ప్రాజెక్టుకు అవసర మైన అనుమతులను సత్వరమే మంజూరు చేస్తారు. తాగునీరు, విద్యుత్, రోడ్డు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన రాయితీలన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంది. సరసమైన గృహ నిర్మాణ పథకం కింద ఆర్థికంగా వెనుకబడినవర్గాల లబ్దిదారుల ఎంపిక, రాయితీ చెల్లింపు రుణ కల్పన, ఈఎంఐ ఖరారు తదితర ప్రక్రియలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. 


ఇక్కడే ప్రైవేట్‌ జోక్యం
ఈ టౌన్‌షిప్‌ల్లో 70 శాతం స్థలంలో వాణిజ్య అవసరాలకు, 30 శాతం స్థలంలో బహుళ అంతస్తుల ఇల్లు నిర్మించి ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇక్కడే ప్రైవేట్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు చోటు కల్పించాలన్నది ప్రభుత్వ పన్నాగం. ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణాల బాధ్యతను తమకు అనుకూలమైన ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా వారికి ప్రయోజనం చేకూర్చాలన్న ది పెద్దల పన్నాగంగా కనిపిస్తోంది. కాగా ఇప్పుడున్న జీవో ప్రకారం అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో అర్హులైన డీ పట్టాదారులకు 1200 చదరపు గజా లు, ఆక్రమణదారులకు 500 గజాలు చొప్పున స్థలాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంత పెద్ద స్థలాలు కాకుండా డీ పట్టాదారులకు 900 గజాలు, ఆక్రమణదారులకు 250 గజాలు చొప్పున మాత్రమే ఇచ్చేలా కొత్త జీవో జారీ కానుంది.


ట్రై జంక్షన్‌లో పూలింగ్‌
గాజువాక–సబ్బవరం–పరవాడల మధ్య ట్రై జంక్షన్‌లో ఉన్న 1600 ఎకరాలను మెగా టౌన్‌షిప్‌ల కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పరదేశీపాలెం, మధురవాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఓక్కో చోట 60 నుంచి 80ఎకరాల చొప్పున సుమారు 400 ఎకరాలు గు ర్తించారు. ట్రై జంక్షన్‌లోని 1600 ఎకరాల్లో 700 ఎకరాల వరకు కొండ ప్రాంతాలున్నాయి. 900 ఎకరాల్లో డి పట్టాదారులు, ఆక్రమణదారులున్నా రు. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సమీకరిస్తున్నామన్న విషయాన్ని తెలియనీయకుండా ఆయా గ్రామాల్లో ఇప్పటికే గ్రామసభలు నిర్వహించి అనుభవదారులు, ఆక్రమణదారులు 300 మందికి పైగా ఉన్నారని ఇప్పటికే గుర్తించారు. కాగా ల్యాండ్‌ పూలింగ్‌ గైడ్‌లైన్స్‌ రూపొందించిన రెవెన్యూ, ఫైనాన్స్, లా సెక్రటరీలతో కూడిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక డిప్యూటీ సీఎం వద్ద ఉంది. ఎవరెవరికి ఎంత భూమి ఇవ్వాలనేది కేబినెట్‌లో చర్చించిన నిర్ణయం తీసుకుంటారు. నెలాఖరులోగా జీవో వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ వెంటనే భూ సమీకరణ ప్రారంభమవుతుంది.


ట్రై జంక్షన్‌లో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌
ట్రై జంక్షన్‌లో ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సమీకరించే భూముల్లో 150 ఎకరాలు అంతర్జాతీయ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు కేటాయించనున్నారు. తొలుత స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 250 ఎకరాల్లో దీన్ని నిర్మించాలని భావించారు. కానీ భూములిచ్చేందుకు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఇచ్చినా అందుకు రెట్టింపు విస్తీర్ణంలో భూములు తమకు ఇవ్వాలని మెలిక పెట్టింది. దీంతో ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించే భూముల్లోనే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  


గ్రామీణ ప్రాంతాల్లో కూడా టౌన్‌షిప్‌లు
గ్రామీణ ప్రాంతాల్లో కూడా టౌన్‌షిప్‌ల నిర్మాణానికి వీలుగా ఆనందపురం మండలం వేములవలస వద్ద వందెకరాలు, పాలవలసలో 83 ఎకరాలు, మునగపాక మండలం పంచదార్లలో 90 ఎకరాలు, అచ్యుతాపురం మండలం రాజుకోడూ రు, వేల్చేరు, కృష్ణపాలెం గ్రామాల్లోని 70 ఎకరాలు, అచ్యుతాపురంలో 150 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించారు. వీటిలో ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ, ఎంఐజీ తదితర కేటగిరీల్లో టౌన్‌షిప్‌లు ని ర్మిస్తారు. ల్యాండ్‌ పూలింగ్‌ద్వారా సమీకరించనున్న భూములతో పాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో మెగా టౌన్‌ షిప్‌ల నిర్మాణ బాధ్యతలను ఏపీ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టిడ్కో) సంస్థకు అప్పగించనుంది. గ్లోబల్‌ టెండర్ల ద్వారా టెండర్లు ఖరారు చేయనున్నారు.

మరిన్ని వార్తలు