భూసేకరణ జీవో చెల్లదు

1 Sep, 2018 03:59 IST|Sakshi

     రాష్ట్రంలో సరైన పద్ధతిలో జరగని ల్యాండ్‌ పూలింగ్‌

     నిబంధనలేవీ పాటించని ప్రభుత్వం

     ప్రభుత్వాలు ఉండేది ప్రజల్ని బిచ్చగాళ్లను చేసేందుకు కాదు

     రైతులంతా ఏకమై పోరాడితే న్యాయసహాయం చేస్తా

     సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ గోపాలగౌడ

తాటిచెట్లపాలెం (విశాఖపట్నం): రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాలు భూసేకరణ చేస్తోందని, ఇది సరైన పద్ధతిలో జరగట్లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చిలో విడుదల చేసిన జీవో నంబర్‌ 118, పార్లమెంట్‌ చట్టం 113కు పూర్తి వ్యతిరేకమన్నారు. విశాఖపట్నంలోని పౌరగ్రంథాలయంలో శుక్రవారం ‘భూసేకరణ– పరిష్కారం’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో జస్టిస్‌ గోపాలగౌడ మాట్లాడారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన విమర్శలుగుప్పించారు. ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి వస్తే ముందుగా గ్రామసభ ఆమోదం పొందాలని, ప్రజల అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుందని, ఆ తర్వాత వారికి తగు నష్టపరిహారం, ప్రతిగా స్థలం ఇవ్వాలని, అలాగే బాధితులకు జీవనాధారం చూపించాల్సి ఉందని వివరించారు.

భూసేకరణ అనేది హౌసింగ్‌ స్కీం కోసమైతే అక్కడి పరిస్థితులు నివాసయోగ్యతకు అనుకూలంగా ఉండాలని, పర్యావరణ అనుమతులు ఉండాలని పార్లమెంట్‌లో చేసిన చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో ఆమెదం పొందాలంటే గవర్నర్‌ అనుమతి ఉండాలని, కానీ ఇష్టానుసారంగా చేసిన ఆ జీవో చెల్లదని, అలాంటి జీవో బంగాళాఖాతంలో కలిపేయడమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే అది రాష్ట్రపతి ఆమోదం పొందాలని కాని ఇక్కడ అలాంటి నిబంధనలేవీ పాటించలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇవేమీ పాటించకుండా పారిశ్రామిక కారిడార్‌ల, విశ్వవిద్యాలయాలు, రహదారుల పేరిట పేద, మధ్య తరగతుల రైతుల నుంచి బలవంతంగా లక్షల, వేల ఎకరాలు భూసేకరణ చేస్తోందని జస్టిస్‌ గోపాలగౌడ దుయ్యబట్టారు. 

రైతుల్ని వేధిస్తూ భూసేకరణ
రాష్ట్రంలో పెట్రో యూనివర్సిటీకి 250 ఎకరాలు అవసరమైతే దీని పేరిట 750 ఎకరాలు సేకరించేందుకు కుట్రపన్నుతున్నారని జస్టిస్‌ గోపాలగౌడ పేర్కొన్నారు. అయితే దీని కోసం ఇంతవరకు పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదని వివరించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని కాపాడాలని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బలవంతంగా ప్రజల్ని, రైతుల్ని వేధిస్తూ భూసేకరణ చేస్తోందన్నారు. అభివృద్ధికి ఎవరూ ఆటంకం కాదని, కానీ అభివృద్ధి పేరిట సంవృద్ధిగా పంటలు పండే వేల, లక్షల ఎకరాలు సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. రైతులంతా ఏకమై పోరాడితే అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

కొందరు రైతులకు పట్టాలు లేనందున వారికి తక్కువ నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే వారు దశాబ్దాలుగా ఆ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి సందర్భంలో ఆ భూములకు వారే హక్కుదారులని చట్టం చెబుతోందన్నారు. ప్రభుత్వాలు ప్రజలను కాపాడడానికి ఉండాలిగాని వారిని బిచ్చగాళ్లను చేయడానికి కాదని తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం పనిచేసేది కేవలం పట్టణ ప్రజల కోసమేనా? గ్రామీణులు, రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. సమావేశంలో íసీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌.నరసింగరావు, సీపీఐ నేతలు గంగారాం, కె.లోకనాథం, బాధిత రైతులు పాల్గొన్నారు.

ఓటుతో బుద్ధి చెప్పాలి!
పారిశ్రామిక ప్రాంతం కోసం భూసేకరణ చేయదలిస్తే ఆ ప్రాంతంలో ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది.. లాభనష్టాలు, ప్రాజెక్టు రిపోర్టులు తదితర అంశాలతో, వివిధ శాఖల అనుమతులతో మాత్రమే చేయాల్సి ఉంటుందని జస్టిస్‌ గోపాలగౌడ తెలిపారు. మన దేశ జనాభాలో 70 శాతం మంది గ్రామీణులేనని, వీరి జీవనాధారం పాడి పంటలు, ఫలసాయమేనని వివరించారు. మరి అలాంటి సాగు భూముల్ని బలవంతంగా ప్రభుత్వాలు తీసేసుకుంటే ప్రజలు ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజలంతా ఏకమై అలాంటి నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు. 

మరిన్ని వార్తలు