చిగురించిన ఆశలు

20 Oct, 2017 11:46 IST|Sakshi
విజయవాడలో కొండలపై ఉన్న ఇళ్లు

విజయవాడ కొండప్రాంతాల్లోని ఇళ్ల పట్టాల మార్పునకు అధికారుల కసరత్తు

ప్రత్యేక జీఓ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి విన్నపం

జీఓ వస్తే ఇళ్ల క్రయవిక్రయాలు, తనఖాలకు అవకాశం

విజయవాడలోని రెవెన్యూ, కొండ పోరంబోకు స్థలాలకు పట్టాలు పొంది, వాటిలో నివసిస్తున్న పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకూ స్థలాలకు పట్టాలు ఉన్నా అధికారికంగా క్రయవిక్రయాలకు, తనఖాపై రుణాలు పొందేందుకు వీలు లేదు. ఇప్పుడు విక్రయాలకు, తనఖాలకు అవకాశం కల్పిస్తూ జీఓ తెచ్చేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేపట్టడంతో పేదలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.  

సాక్షి, విజయవాడ: ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నగరంలో ఆకస్మికంగా పర్యటించారు. ఆ సమయంలో కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు తమ సమస్యలను ముఖ్యమంత్రికి ఏకరువుపెట్టారు. కొండప్రాంతాల్లో ఉన్న తమ ఇళ్లకు పట్టాలు ఇచ్చారని, వాటి వల్ల ఉపయోగం లేకుండాపోయిందని వివరించారు. కుటుంబ అవసరాల కోసం ఇళ్లు విక్రయించాలన్నా, కనీసం బ్యాంకులో తనఖాపెట్టి రుణం తీసుకోవాలన్నా వీలులేదని వివరించారు. సీఎం స్పందించి పేదల ఇళ్ల పట్టాల సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ప్రత్యేక జీఓ వస్తేనే సాధ్యం
ప్రస్తుతం ఉన్న జీఓల ప్రకారం ప్రభుత్వ, పోరంబోకు భూములను ఆక్రమించుకుని నివసిస్తున్న ఇళ్లకు సంబంధించి పట్టాలు ఉన్నప్పటికీ విక్రయించుకునే అధికారం లేదు. గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినా కేవలం అనుభవ హక్కు మాత్రమే ఉండేది. ఈ తరహాలో సుమారు 50 వేల ఇళ్ల వరకు రెవెన్యూ భూముల్లో, కొండలపైనా ఉన్నాయి. పట్టాల మార్పుపై పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా, అందుకు ప్రస్తుతం ఉన్న జీఓలు సరిపోవని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర భూపరిపాలన శాఖ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇళ్ల పట్టాలను మార్చి వాటి స్థానంలో, ఇళ్ల స్థలాన్ని విక్రయించేందుకు (సేలబుల్‌ రైట్స్‌), బ్యాంకులో తాకట్టు(లోన్లు) పెట్టి రుణం తీసుకునేందుకు వీలుగా కొత్త పట్టాల జారీ చేసేందుకు ప్రత్యేక జీఓ జారీ చేయాలని కోరినట్లు తెలిసింది.

చేతులు మారిన స్థలాల విషయంలో...
కొండ ప్రాంతం, పోరంబోకు భూముల్లో పేదలు నివసిస్తున్న స్థలాలకు పట్టాలు ఉన్నా విక్రయించే హక్కు లేదు. అయితే కొంతమంది తమ ఇళ్లను విక్రయించుకున్నారు. కొనుగోలుదారుడికి ఇంటి పట్టా అందజేసి, ఇంటిని స్వాధీనం చేస్తూ హామీ పత్రం రాసిచ్చేవారు. అయితే పట్టా మాత్రం విక్రయదారుడి పేరుతోనే ఉండేది. ఇటువంటి వాటిని కూడా మార్చేందుకు వీలుగా జీఓలో మార్గదర్శకాలు పొందుపరచాలని రెవెన్యూ అధికారులు భూపరిపాలన శాఖను కోరారు. చనిపోయిన వారి పేరుతో పట్టాలు ఉంటే, ప్రస్తుతం అనుభవిస్తున్న వారి పేర్లతో కొత్తగా పట్టాలు ఇచ్చేందుకు వీలుగా నిబంధనలు రూపొం దించాలని కూడా కోరినట్లు తెలిసింది. విద్యుత్‌ బిల్లులు, కార్పొరేషన్‌కు చెల్లించే ఇంటి పన్ను రశీదులను ఆధారంగా చేసుకుని అనుభవదారులను గుర్తించాలని సూచిం చారు. కొత్త పట్టాలు పొందిన వారు కనీసం రెండేళ్ల వరకు విక్రయించకుండా, బ్యాంకుల్లో తాకట్టు పెట్టకుండా మార్గదర్శకాల్లో పొందుపరచాలని కోరారు.

ప్రత్యేక జీవో విడుదలయ్యేనా?
ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలుకు అవసరమైన ప్రత్యేక జీఓ జారీ సాధ్యమేనా అనే చర్చ రెవెన్యూ శాఖలో జరుగుతోంది. కొండపైన ఉన్న ఇళ్లను విక్రయించేందుకు హక్కు కల్పించాలంటే అటవీశాఖ చట్టాలు అంగీకరించవేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ జీఓ వస్తే కొండలపైన మరిన్ని ఆక్రమణలు పెరిగే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు అవకాశం ఇస్తే అక్కడ భూముల ధరలు కొండెక్కి కూర్చుంటాయని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు