భూముల ధరలకు రెక్కలు 

1 Aug, 2018 07:35 IST|Sakshi
జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయం

కర్నూలు (టౌన్‌): పట్టణ ప్రాంతాల్లో భూములు కోనుగోలు చేయాలంటే ఇక మరింత భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. 5 శాతం మార్కెట్‌ ధరలను పెంచడంతో జిల్లాలోని పట్టణ ప్రజలపై రూ. 60 కోట్లు  ప్రజలపై భారం పడనుంది. నివాస ప్రాంతా ల్లో 5 శాతం, వాణిజ్య ప్రాంతాల్లో 10 శాతం వరకు మార్కెట్‌ ధరలు పెరగనున్నాయి. జిల్లాలోని కర్నూలు నగరంతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, గుడూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఈ ధరలు అమలులోకి రానున్నాయి. జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో ప్రతి రెండేళ్లుకోసారి భూముల ధరలను పెంచడం ఆనవాయితీ.

ఈ ఏడాది కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కట్టడాల విలువలు కూడ పెరగనున్నాయి. కార్పొరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో కట్టడాలపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. చదరపు అడుగుకు రూ. 90, పూరిళ్లకు సంబంధించి చదరపు అడుగుకు రూ.160, మట్టి మిద్దెలకు రూ.340, మొదటి, రెండు అంతస్తులకు రూ.1030, మూడవ ఆంతస్తుకు రూ.1110 చొప్పున ప్రభుత్వం విలువలను నిర్ణయించింది. ఈ లెక్కన రూ. 60 కోట్లు ఆదనంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుండగా.. ఆ మేరకు ప్రజలకు భారం పడనుంది. జిల్లాలోని 24 సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖకు రూ.340 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. 

  • ఎంత మేర నిర్ణయించారంటే...
  • జొహరాపురంలో  చదరపు గజం రూ. 3,500 ఉంటే పెరిగిన ధరలతో రూ. 3, 800, అలాగే మామిదాలపాడులో రూ. 4 వేలు ఉంటే అదికాస్తా రూ.4, 300 ప్రకారం భూముల ధరలు పెరగనున్నాయి.   
  • పాతబస్తీ, పప్పుల బజార్, జమ్మిచెట్టు ప్రాంతాల్లో చదరపు గజం రూ. 7 వేలు ఉంటే రూ. 7, 400 ప్రకారం పెరగనుంది. 
  • గుత్తి పెట్రోలు బంకు వద్ద నివాస ప్రాంతాల్లో రూ. 15 వేలుగా నిర్ణయించారు.  
  • భూముల ధరలు సవరించడానికి జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా, నగరపాలక కమిషనర్, జెడ్పీ సీఈఓ, స్థానిక సబ్‌ రిజిష్టర్లతో కూడిన కమిటీ ధరలపై నిర్ణయం తీసుకుంటుంది.
మరిన్ని వార్తలు