అధికారుల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

16 Feb, 2019 10:24 IST|Sakshi
స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు కార్యాలయంలో వేచి ఉన్న హోంశాఖ ప్రధాన కార్యర్శి అనురాధ, ఎస్పీ రామకృష్ణ

రాజధాని ప్రాంతంలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ఒక్కొక్కరికి 500 చ.గజాల స్థలం

తమను విస్మరించారని మండిపడుతున్న రైతులు, ప్రజలు

తుళ్లూరు రూరల్‌ (తాడికొండ): రాజధాని అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గుంటూరు జిల్లా తుళ్లూరులో శుక్రవారం ప్రారంభమైంది. ఐనవోలు గ్రామ రెవెన్యూ పరిధిలో ఈ స్థలాలను కేటాయించినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ తొలి రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా, చివరి రిజిస్ట్రేషన్‌ హోంశాఖ ప్రధాన కార్యదర్శి అనురాధ చేయించుకున్నారు. ప్రతి ఒక్క అధికారికి 500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించగా, ఇప్పటివరకు దాదాపు 20 మంది అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని తుళ్లూరు కార్యాలయ రిజిస్ట్రార్‌ తెలిపారు. కాగా, అధికారులకు స్థలాలు కేటాయించడం, వాటిని హుటాహుటిన రిజిస్ట్రేషన్‌ చేయడంపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన తమ సమస్యలను పరిష్కరించడంలేదు కానీ అధికారుల స్థలాలకు మాత్రం తొందరొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు.

ఉన్నతాధికారుల అనుమతి కావాలి
రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న అధికారుల వివరాలు తెలియజేయడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతులు లేవు. సీఆర్‌డీఏ విజయవాడ కార్యాలయం నుంచి సేల్‌ డీడ్‌ పట్టాలను అధికారుల పేరు మీద విడుదల చేస్తున్నారు. వాటి ఆధారంగా సీఆర్‌డీఏ అధికారుల పర్యవేక్షణలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నాం.
– సీహెచ్‌ భీమాబాయ్, రిజిస్ట్రార్, తుళ్లూరు

ఇంత శ్రద్ధ పేదలపై ఎందుకులేదు?
పేదలకు రాజధానిలో ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదు. పేదవాడి దగ్గర రెండింతలు కట్టించుకుంటున్నారు. అధికారులకు మాత్రం చదరపు గజం దాదాపు రూ.28 వేలు ఉన్న ప్రాంతంలో కేవలం రూ.4 వేలకే ఇస్తున్నారు. అధికారులపై ఉన్న శ్రద్ధ పేదలపై ఎందుకు లేదు?
– బెజ్జం రాంబాబు, నిరుపేద గృహ లబ్ధిదారుడు

మా భూములను ప్రభుత్వం అధికారులకు పంచుతోంది
మా దగ్గర భూములు తీసుకుని ప్రభుత్వం అధికారులకు పంచుతోంది. మా సమస్యలు చెప్పుకోవడానికి గుంటూరు కలెక్టర్‌ కార్యాలయానికి వెళితే కలెక్టర్‌ శశిధర్‌ పోలీసులతో బయటకు నెట్టించారు. మూడు రోజులుగా రైతులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పట్టించుకున్న నాథుడు లేడు. భూములు పంచుతుంటే మాత్రం అధికారులందరూ వచ్చి తీసుకుంటున్నారు.
– తిప్పనబోయిన ధనలక్ష్మి, రాయపూడి మహిళా రైతు

మరిన్ని వార్తలు