అనుమతి లేకుండా సర్వే ఎలా చేశారు?

10 Jun, 2016 13:42 IST|Sakshi

  ఓ పట్టాదారు ఆవేదన
  ఏకమైన గ్రామ నాయకులు
  సర్వే నిలిపివేసిన అధికారులు

 
భోగాపురం: తన సమ్మతి లేకుండా తన భూమిని ఏవిధంగా సర్వే చేస్తారని పట్టాదారు కొండపు లక్ష్మమ్మ సర్వే బృందాన్ని అడ్డుకుంది. వివరాలిలా ఉన్నాయి.  విజయ నగరం జిల్లా భోగాపురం మండలంలోని కవులవాడ పంచాయతీ మరడపాలెంలో గురువారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టరు ఆధ్వర్యంలో సర్వే బృందం సర్వే చేపట్టారు. లక్ష్మమ్మా నీ భూమిలో అధికారులు ఎయిర్‌పోర్టు సర్వే చేస్తున్నారు అంటూ పక్క రైతులు ఆమెకు సమాచారం అందించారు. అంతే ఆమె లబోదిబో మంటూ గ్రామంలో పెద్దలైన కొండపు రమణ, కొండపు నర్సింగరావు, కొత్తయ్య రెడ్డి, కొండపు రామలక్ష్మణ రెడ్డిల వద్దకు పరుగుపెట్టింది. దీంతో వారంతా సర్వే జరుగుతున్న చోటుకి వెళ్లి  సమ్మతి ఇవ్వని భూముల్లో సర్వే ఏవిధంగా చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనికి సర్వే బృందం అధికారులు మాట్లాడుతూ సదరు సర్వే నంబరుపై సమ్మతి పత్రం అందినందునే సర్వే చేపట్టినట్లు తెలిపారు.
 
కొండపు లక్ష్మమ్మకు భర్త చనిపోయాడు. అమెకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు చనిపోయాడు. ఆమె పేరు (కొండపు లక్ష్మమ్మ భర్త లేటు అప్పలరాముడు) మీద కవులవాడ రెవెన్యూలో సర్వే నం. 102/13పి ఎ.0.70 సెంట్లు, 103/29పి ఎ. 0.36 సెంట్లు, 103/28పి ఎ. 0.26 సెంట్లు, 104/38 ఎ. 0.28 సెంట్లు వెరసి 1.60ఎకరాల భూమి ఉంది. ఇంకా వాటాలు వేసుకోలేదు అంతా ఉమ్మడి ఆస్తి.    చనిపోయిన కుమారుడి భార్య కొండపు రమణమ్మ తన అత్త, ఆడపడుచులు, మరిదికి కూడా చెప్పకుండా..ఆమె సోదరుడు నీలాపు లక్ష్మణతో కలిసి ఉమ్మడి ఆస్తి అయిన భూమిని  ఎయిర్‌పోర్టుకి  ఇచ్చేందుకు సర్వే బృందానికి సమ్మతి తెలిపింది. అయితే భూమి   ఎవరికీ వాటాలు వేయలేదు కొండపు లక్ష్మమ్మ పేరుమీద ఉండగానే సర్వే ఎలా చేస్తారని గ్రామపెద్దలు అడ్డుకోవడంతో సిబ్బంది సర్వే నిలుపుదల చేశారు. ఎవరైనా సమ్మతి తెలిపినప్పుడు వారి రికార్డులు పూర్తిగా పరిశీలించకుండా సర్వేకి ఏ విధంగా వస్తున్నారని గ్రామస్తులు అధికారులను నిలదీయడంతో వారంతా ఆ స్థలంలో సర్వేను నిలిపివేసి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు