పరిశ్రమలకు భూములు

23 May, 2015 03:33 IST|Sakshi

28 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్  నిర్ణయం
6న ఉదయం 8.49 నిమిషాలకు రాజధాని నిర్మాణానికి భూమిపూజ
జిల్లా మంత్రుల సమక్షంలో  ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు

 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 28 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. శుక్ర వారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ముఖ్య నిర్ణయాల్లో పరిశ్రమలకు భూముల కేటాయింపు ఒకటి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని కేటాయించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే కొన్ని ప్రాంతాలను గుర్తించింది. ముఖ్యంగా పల్నాడు, జిల్లాలోని పలు ఆటోనగర్‌ల్లో వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు అనువైన భూములను గుర్తించింది.

వీటిల్లో అనేక భూములను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గతంలో ప్రభుత్వం కేటాయించింది. అనేక మంది వివిధ కారణాలను చూపుతూ అక్కడ పరిశ్రమలు స్థాపించలేక పోయారు. వాటిని స్వాధీనం చేసుకోవాలని, అలాగే పల్నాడులోని ప్రభుత్వ భూములను ఈ పరిశ్రమలకు కేటాయించనున్నారు. వీటితోపాటు రాజధాని నిర్మాణానికి వచ్చేనెల 6వ తేదీన ఉదయం 8.49 నిమిషాలకు భూమిపూజ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే భూమి పూజ ఎక్కడ చేయనున్నారో ప్రకటించలేదు.

వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల బదిలీలు జిల్లా మంత్రుల సమక్షంలో జిల్లా కలెక్టర్లు చేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. టీడీపీకి అనుకూలమైన ఉద్యోగులకు ఈ విధానంలో బదిలీలు జరిగే అవకాశం ఉంటుందని ఒక వర్గం అభిప్రాయపడుతుంటే, అవినీతికి అవకాశం లేకుండా పోతుందని మరో వర్గం పేర్కొంటుంది. జరూసలం వెళ్లే క్రైస్తవులకు ప్రయాణ ఖర్చులు ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం పట్ల ఆ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.

>
మరిన్ని వార్తలు