భయం...భయం

23 Aug, 2018 07:14 IST|Sakshi
డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన వరద ముంపు ప్రాంతం

నేటికి వారం రోజులుగా జల దిగ్బంధంలోనే...

ఎగువన తగ్గుతూ.. దిగువన పెరుగుతున్న గోదావరి

ముంపులో లంక గ్రామాల ప్రజలు

సహాయ పునరావాస కేంద్రాల్లో అరకొర ఏర్పాట్లు

అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లతో మరింత ముప్పు

తూర్పుగోదావరి, అమలాపురం: గోదావరి వరద పెరుగుతున్న కొద్దీ లంకవాసుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. విలీన మండలమైన వీఆర్‌ పురం నుంచి గోదావరి సముద్ర సంగమ ప్రాంతమైన పుదుచ్చేరి యానాం, సఖినేటిపల్లి, ఓడలరేవు వరకు లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. సాధారణ స్థాయిలో వరద వస్తే ఒకటి రెండు రోజుల ప్రభావం ఉంటుంది. అటువంటిది ఈసారి గురువారంతో కలిపి ఇంచుమించు వారం రోజులపాటు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన భద్రాచలం, దుమ్ముగూడెం వద్ద వరద ఉధృతి తగ్గినా జిల్లాలోని లంకల్లో ముంపువీడేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశముంది. ఇన్ని రోజులపాటు నివాస గృహాలు జల దిగ్బంధంలో ఉండడంతో లంకవాసులు పడరానిపాట్లు పడుతున్నారు.

ఇదే సమయంలో వందల ఎకరాల్లో వాణిజ్య, కూరగాయ పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు పాలవుతున్నారు. గోదావరిలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో 15 లక్షల 24 వేల 268 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదిలారు. ఎగువన తగ్గుతున్నా బ్యారేజ్‌ వద్ద స్వల్పంగా వరద పెరిగి తరువాత తగ్గే అవకాశముంది. క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో వర్షం లేకపోవడంతో వరద తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే బుధవారం పెరి గిన వరదల వల్ల లంకల్లోముంపు తీవ్రతఅధికమవుతోంది.

కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి వరదపోటు తగలగా 17వ తేదీ నుంచి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇదే సమయంలో శబరి సైతం పోటెత్తిన విషయం తెలిసిందే. మధ్యలో ఒకసారి తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభించింది. ఇంచుమించు జిల్లాలో విలీన మండలాలతో కలిపి కోనసీమలోని పలు లంకలు 17వ తేదీ నుంచి ముంపు ముప్పులోనే ఉన్నాయి. ఏజెన్సీలో చింతూరు, వి.ఆర్‌.పురం పరిస్థితి మరీదారుణం. గడిచిన 15 రోజులుగా వరదలు, భారీ వర్షాలు వల్ల రాకపోకలు నిలిచిపోవడంతో అటు గిరిజన గ్రామాలవాసులు పడరానిపాట్లు çపడుతున్నారు. నిత్యావసర వస్తువులు అందక పడరానిపాట్లు పడుతున్నారు. బుధవారం చింతూరు సంతకు వెళ్లేందుకు వీలు లేక శబరి నది ఒడ్డున 500 మందికి వరకు పడిగాపులు పడ్డారు. ఇళ్లలోనే కాకుండా.. దుకాణాల వద్ద సైతం నిత్యావసర వస్తువులు నిండుకోవడంతో గిరిజనులు పస్తులుండే పరిస్థితి ఏర్పడింది.

విలీన మండలాల్లో తీరని ఇక్కట్లు...
విలీన మండలాలైన చింతూరు, వి.ఆర్‌.పురంలో ముంపుతీవ్రత కొనసాగుతోంది. శబరిలో వరద తగ్గడంతో విజయవాడ– జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై వరద నీరు తొలగడంతో రాకపోకలు ఆరంభమయ్యాయి. శబరి తగ్గుతున్నా.. వాగుల్లో నీరు రహదారులపైనే ఉండడంతో చింతూరు – వీఆర్‌ పురం మండలాల మధ్య, చింతూరు మండలంలో 20 రాకపోకలు ఆరంభం కాలేదు. వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో సుమారు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండమూల దారుల నుంచి ప్రజలు నడిచి రాకపోకలు సాగిస్తున్నారు. కొంతమంది తాత్కాలికంగా పడవలు ఏర్పాటు చేసుకుని వారపు సంతలకు వెళుతున్నారు. బుధవారం నుంచి కొన్ని గ్రామాల్లో మాత్రమే 20 కేజీల చొప్పున రేషన్‌ బియ్యం అందిస్తున్నారు.రాజమహేంద్రవరం నగరాన్ని ఆనుకుని ఉన్న బ్రిడ్జిలంకవాసుల పరిస్థితి దారుణం. ఇక్కడ వారు తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇవన్నీ వరదకు కొట్టుపోగా, ఈ లంకకు చెందిన సుమారు 300 మంది కట్టుబట్టలతో నగరంలో పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు.

కోనసీమలో కష్టాలు...
కోనసీమలో లంకవాసుల బాధలు వర్ణనాతీతం. వరద ఉధృతి పెరగడంతో ముంపుతీవ్రత మరింత పెరిగింది. దీనితోపాటు లంకవాసులు కష్టాలు సైతం రెట్టింపయ్యాయి. పాడి రైతులు పాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు పడుతున్న పాట్లు అన్నీఇన్నీకావు. ముఖ్యంగా ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెంతోపాటు మరో పది గ్రామాలు, పి.గన్నవరంలో బడుగువానిలంకతోపాటు మరో మూడు గ్రామాలు గోదావరి మధ్యలోనే ఉన్నాయి. పశువుల్లంక వద్ద జరిగిన పడవ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు పడవల మీద ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. అత్యవసర సమయంలో మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఇక్కడ కూడా నిత్యావసర వస్తువుల ఇక్కట్లు ఆరంభమయ్యాయి. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం, మామిడికుదురు మండలం అప్పనపల్లి, పి.గన్నవరం మండలం కనకాయలంక కాజ్‌వేలపై ముంపుతీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పడవలను అందుబాటులో ఉంచారు.

ఈ మూడు కాజ్‌వేలు ముంపులో ఉండడంతో జిల్లాలోని ఏడు గ్రామాలు, పశ్చిమ పరిధిలో మూడు గ్రామాలకు వాహనాల రాకపోలు నిలిచిపోయాయి. కాజ్‌వేల వరకు రావడం, తరువాత పడవల మీద దాటి ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. ముమ్మిడివరం మండలం లంకాఫ్‌ ఠానేల్లంక, గురజాపులంక, కమిని గ్రామాల్లో ముంపు మరింత పెరిగింది. ప్రధాన రహదారుల మీదకు వరద నీరు వచ్చి చేరింది. వరదల వల్ల లంక రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. కూరగాయ, అరటి, పసుపు, కంద, పూల తోటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. వరద తగ్గడానికి రెండు మూడురోజులు పట్టినా.. పూర్తిగా ముంపుదిగేందుకు వారం రోజులుపైగా పడుతుందని రెతులు వాపోతున్నారు.  అల్లవరం మండలం బోడసకుర్రులో ముంపుతీవ్రత మరింత పెరిగింది. స్థానికంగా పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినా వెళ్లేందుకు స్థానిక మత్స్యకారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులతోపాటు విలీన మండలాల నుంచి కోనసీమ దిగువ వరకు ఉన్న గోదావరిపై జీవిస్తున్న సుమారు 300 మందికిపైగా మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోయింది.

నిలువెత్తు నిర్లక్ష్యం...
గోదావరి వరదలు ఎదుర్కొనే విషయంలో ఇరిగేషన్‌ అధికారులు అవలంబిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. ఫ్లెడ్‌ స్టోరేజ్‌ల నిర్వహణతోపాటు, అవుట్‌ఫ్లాల్‌ స్లూయిజల పటిష్టతపై శీతకన్ను వేశారు. తూర్పు డెల్టాలో డ్రైన్‌లతోపాటు కోనసీమలో ప్రధాన డ్రైన్లు అన్నీ గోదావరి పాయల్లోనే కలుస్తాయి. కోనసీమలో గోరింకల, బండారులంక, శంకరగుప్తం డ్రైన్లు నదుల్లో కలిసే అవుట్‌ఫాల్‌ స్లూ యిజ్‌లు అధ్వానంగా ఉన్నాయి. దీనితో ముంపు నీరు దిగక గట్లు మీద నుంచి ముంపునీరు పొంగిపొర్లుతున్నాయి. యానాం వద్ద స్లూయిజ్‌లు దెబ్బతినడంతో ఆ ప్రాంతంలో ముంపు తీవ్రత పెరిగింది. ముంజువరం వద్ద గోరింకల డ్రైన్‌ నుంచి సైతం ముంపు నీరు పెద్దగా దిగడం లేదు. దీనివల్ల అమలాపురం మండలంలో బండారులంక, ఇందుపల్లిలో పలు లోతట్టు ప్రాంతాలు ముంపులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు