సీమకే తలమానికం లంకమల్ల అభయారణ్యం

8 Sep, 2019 13:35 IST|Sakshi

ఆకట్టుకునే జలపాతాలు

అరుదైన జీవరాశులు

ప్రకృతి ప్రేమికులకు వరం

అరుదైన కలివి కోడి సంచారం

వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వ యత్నం

సాక్షి, సిద్దవటం(కడప): సిద్దవటం రేంజిలోని లంకమల్ల అటవీ ప్రాంతం రాయలసీమకే తలమానికంగా నిలుస్తోంది. అత్యంత విలువైన అటవీ సంపద, ఆయుర్వేద వనమూలికలు, ప్రపంచంలోనే అంతరించిన కలివికోడికి, పులికి ఆవాస ప్రాంతంగా లంకమల్ల అభయారణ్యం వెలుగొందుతోంది. ప్రకృతి పరిచిన పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఎతైన కొండలు భారీ వృక్షాల నడుమ ప్రయాణం, జలపాత సోయగాలు వర్ణనా తీతం. పవిత్రమైన క్షేత్రాలు నిత్యపూజస్వామి, లంకమల్లేశ్వర స్వామి, దట్టమైన అడవి కొండలు, జలపాతం, గుహలు మన రాయలసీమ ప్రాంత నేపథ్యంలో లంకమల్ల అడవుల ప్రాముఖ్యతగా చెప్పుకోవ చ్చు.

సినిమాల్లో, కథల్లో, డిస్కవరి చానళ్లలో చూసే వింతలు, అద్భుతాలు నిజంగానే ఇక్కడే చూడవచ్చు. దట్టమైన అంకమల్ల అభయారణ్యంలో ప్రకృతి రమణీయతతో... కొండల పైనుంచి దూకే జలపాతం..కోనేరు, రెండు కొండల మధ్య పారే సన్నని సెలయేరు అప్పుడప్పుడు తొంగి చూసే సూర్యకిరణాలు, చుట్టూ పర్వతాలు మధ్యలో సెలయేర్లు, జలపాతాలు ఎనిమిది దిక్కుల్లో నీటి గుండాలతో ప్రకృతి అందాలు ప్రశాంతతను కల్గిస్తాయి. అడుగు ఎత్తైన రాళ్ల మధ్య ప్రయాణం పెద్ద బండరాళ్ల మధ్యన సాగే నడక మార్గం, చాలా ఆహ్లాదకరంగా ట్రెక్కింగ్‌ను తలపిస్తుంది.


చాతక పక్షి

శ్రీశైలం దేవస్థానానికి దక్షిణ ద్వారంగా పిలువ బడే సిద్దవటం మండలంలో దట్టమైన లంకమల్ల అభయారణ్యం, ఎతైన గుహలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. లంకమల్ల అభయారణ్యంలో దాదాపు మూడు నుంచి నాలుగు పులులు సంచరిస్తునట్లు అటవీ అధికారుల సమాచారం. దేశవ్యాప్తంగా పులుల సంఖ్య నాలుగు సంవత్సరాల్లో 8 శాతం పెరిగినట్లు స్టేట్‌ ఆఫ్‌ టైగర్స్‌ ఇన్‌ ఇండియా 2018లో నివేదికలో పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 48 పులులు ఉండగా కడప–కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో పులుల సంచారంపై ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలో కడప, రాజంపేట, ప్రొద్దుటూరు ఫారెస్టు డివిజన్‌లు ఉండగా వీటి పరిధిలో 15 రేంజిలు, ఐదు లక్షల ఎకరాల అడవులు విస్తరించి ఉన్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం అడవులను టైగర్‌ జోన్లుగా ప్రకటించారు. లంకమల్ల అభయారణ్యంలో 465 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా పులుల సంచారానికి అనుకూల ప్రదేశంగా ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి కలివికోడి ఆవాస ప్రాంతంగా ఉంది.

 
కలివికోడి కోసం అన్వేషణ
కలివి కోడి ఉనికి కోసం తొమ్మిది సార్లు విదేశీ కెమెరాలను ఏర్పాటు చేసినా జాడ గుర్తించలేకపోయారు. కనిపించని పక్షి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే విమర్శల నుంచి బయట పడేందుకు అటవీ శాఖ అధికారులు లంకమల్లను టైగర్‌జోన్‌గా ప్రతిపాధించారనే విమర్శలూ లేకపోలేదు. టైగర్‌ కారిడార్‌ కోసం 7,410 హెక్టార్ల అటవీ భూభాగాన్ని కేటాయించారు. పులులకు అనుకూల ప్రదేశాలకు సిద్దవటం రేంజిలోని సిద్దవటం, అట్లూరు మండలాల పరిధిలో 27 అటవీ సరిహద్దు ప్రాంతాలు అనుకూలమని నివేదించారు. లంకమల్ల అభ్యయారణ్యం నుంచి శేషాచలం అడవుల్లో పులులు సంచరించేందుకు పెన్నానది అడ్డంకిగా మరింది.


ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన కలివికోడి

నాగార్జున సాగర్, శ్రీశైలంలో పులుల సంతతి బాగా పెరగడంతో పులులకు ఆవాస ప్రాంతాలను విస్తరించారు. అందులో భాగంగా లంకమల్లలో కూడా అటవీ శాఖ అధికారులు పులుల ఆవాసాలను ఏర్పాటు చేస్తున్నారు. లంకమల్ల నుంచి శేషాచలానికి పులుల రాకపోకల కోసం ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటునకు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. లంకమల్ల నుంచి అహోబిలానికి , అహోబిలం నుంచి నల్లమల్ల అడువుల్లోని గుండ్ల బ్రహ్మేశ్వరం వరకు పులులు సంచరిస్తున్నట్లు సమాచారాన్ని సేకరించింది.


లంకమల్లలో సంచరిస్తున్న పెద్దపులి

సోమశిల వెనుక జలాలైన జంగాలపల్లె, వెలుగుపల్లె, అట్లూరు మండలంలోని చెండువాయి, ఒంటిమిట్ట మండలంలోని సోమశిల ముంపు గ్రామాలను కూడా పరిశీలించి జాతీయ పులుల సంరక్షణ అథారిటీ పులుల మార్గం ఏర్పాటునకు అయ్యే అంచనా ఖర్చులు, ఖాళీ చేయాల్సిన గ్రామాల వివరాలను ప్రభుత్వానికి వివరించింది. అలాగే లంకమల్లలో రోళ్లబోడు బీటు బేస్‌ క్యాంప్‌కు వెళ్లే 13 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ చూసినా అటవీ సంపద వన్యమృగాల సంచారం చూపరులకు కనువిందు చేస్తాయి. ఎత్తై ప్రాంతాల్లో అటవీ శాఖ దాదాపు 16 లక్షల వ్యయంతో రెండు భవనాలు, తాగునీటి కోసం బోరు బేస్‌ క్యాంప్, సిబ్బందికి మౌలిక వసతులు కల్పించారు.

మరిన్ని వార్తలు