-

పోటెత్తిన పంచదార్ల

11 Nov, 2014 01:03 IST|Sakshi
పోటెత్తిన పంచదార్ల

రాంబిల్లి: జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మూడో సోమవారం పురస్కరించుకుని ఆలయాల్లో పెద్ద ఎత్తున బారులు తీరారు. పలువురు ఉపవాస దీక్షలు పాటించారు. ప్రముఖ ఫుణ్యక్షేత్రం పంచదార్ల శివనామ స్మరణంతో మార్మోగింది. జిల్లా నలు మూలలు నుంచి సుమారు 30 వేల మంది ఇక్కడి కాశీ విశ్వేశ్వరస్వామి, సహస్ర లింగేశ్వరస్వామి, రాధా మాధవ స్వామిలను దర్శించుకొని తరించారు. తొలుత ఇక్కడి పవిత్రమైన ఆకాశధారతో పాటు మరో నాలుగు పుణ్యధారల వద్ద భక్తులు స్నానాలు ఆచరించారు.

అనంతరం క్షేత్ర పాలకుడు ఉమా ధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశ ధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించడానికి, ఉమా ధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు గంటల తరబడి బారులు తీరారు. వేలాది మంది రాకతో సందడిగా మారింది. పలు ప్రాంతాలు నుంచి వచ్చిన వారు ఇక్కడ పిక్నిక్‌లు ఏర్పాటు చేసుకుని ఆనందంగా గడిపారు.

ఎస్‌ఐ కె. మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చోడవరం మండలం  గోవాడ శివాలయం, రాయపురాజుపేట శివ పంచాయతన ఆలయం, వెంకన్నపాలెం కాశీవిశ్వేశ్వరాలయం, జుత్తాడ ఉమా మల్లికార్జున ఆలయం, భోగాపురం భోగలింగేశ్వరుని ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తెల్లవారు జాము నుంచి పూజలు చేశారు.

మరిన్ని వార్తలు