-

మూగ వే(రో)దన!

18 Dec, 2013 03:14 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు అందించి వ్యవసాయానికి సమాంతరంగా పాడి పరిశ్రమను అభివృద్ధిలోకి తెస్తామని పాలక యంత్రాంగం చెబుతున్న ప్రకటనలు కాగితాలకే పరిమితవుతున్నాయి. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేక మూడేళ్లుగా పాడి రైతుల బతుకులు దయనీయంగా మారుతున్నాయి. ఓ వైపు పశుగ్రాసం కొరత వేధిస్తుండగా.. మరోవైపు అంటువ్యాధులు, అంతుచిక్కని రోగాలతో వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పశువులు మరణిస్తున్నాయి. దీంతో పాల ఉత్పత్తి తగ్గిపోతోంది. జిల్లాలో పాడి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. పాలకుల అలసత్వం, అధికారుల నిరాసక్తత పాడి రైతులకు శాపంగా పరిణమిస్తోంది. ప్రధానంగా ఇటీవలి కాలంలో జిల్లాలో గాలికుంటు వ్యాధి విజృంభించింది.
 
 ఈ వ్యాధి వల్ల సాధారణంగా పశువులు, గేదెల్లో మరణం సంభవించే అవకాశం ఉండదని పశు సంవర్ధక శాఖ అధికారులు కొట్టిపారేస్తున్నా.. మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 30 పశువులు మరణించినట్లు రైతులు చెబుతున్నారు. వందల సంఖ్యలో పశువులు వ్యాధితో చిక్కిశల్యమయ్యాయంటే గాలికుంటు వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్‌లో గాలికుంటు వ్యాధి లక్షణాలు కనిపించినా.. ఆ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవరించకపోవడంతో జిల్లా నలుమూలలా అతివేగంగా విస్తరించింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ వ్యాధి తీవ్రత అధికంగా కనిపించింది. ఏ గ్రామంలో చూసినా పశువులు వ్యాధి బారిన పడ్డాయి.
 
 వైద్యుల పోస్టులు ఖాళీ
 జిల్లాలో 15.52 లక్షల పశువులు ఉన్నాయి. ఇందులో 6.90 లక్షల గేదెలు, 5.20 లక్షల ఆవులు, 3.50 లక్షల ఎద్దులు ఉన్నాయి. హిందూపురంలో వెటర్నరీ పాలిక్లినిక్ ఉండగా.. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 17 పశు వైద్యశాలలు ఉన్నాయి. వీటిలో ఏడీ స్థాయి  వైద్యులు ఉంటారు. రాయదుర్గం ఆస్పత్రిలో ఏడీ పోస్టు ఖాళీగా ఉంది. 111 వెటర్నరీ డిస్పెన్షరీలు ఉండగా.. 31 ఆస్పత్రుల్లో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పక్కనున్న మండలాల్లో పనిచేస్తున్న డాక్టర్లు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు కాంపౌండర్, విలేజ్ లైవ్‌స్టాక్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండే 83 గ్రామీణ పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ కూడా 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 375 గ్రామాల్లో గోపాలమిత్రలు పనిచేస్తున్నారు.  
 
 అరకొర మందులు
 సంవత్సరానికి నాలుగు సార్లు ఆస్పత్రులకు మందులు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా రెండు సార్లు మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం. ఆస్పత్రుల్లో ప్రధానంగా యాంటీ బయాటిక్స్, యాంటీ సెప్టిక్స్, పెయిన్ కిల్లర్స్, సిరంజిలు, దూది, డీవార్మింగ్, బీ-కాంప్లెక్స్, టానిక్స్, డ్రెస్సింగ్ మెటీరియల్స్, గ్లౌసెస్ లాంటివి తప్పనిసరిగా ఉండాల్సి వున్నా కొన్ని ఆస్పత్రుల్లో కనిపించడం లేదు. ఉన్నా కూడా తక్కువ మోతాదులో ఉండటం వల్ల వైద్య సేవలకు విఘాతం కలుగుతోంది.
 
 బుటాలెక్స్, డెరినిల్, ట్రికోవిన్, బీ-కాంప్లెక్స్, టెట్రాసైక్లిన్, ఎండ్రోమైసీన్ లాంటి ఖరీదైన మందులు తగినంత సరఫరా లేకపోవడంతో వ్యాధి నివారణ కష్టంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో గాలికుంటు వ్యాధితో పాటు గొంతు వాపు, సొప్ప వాపు, సర్రా, దొమ్మ రోగం, రక్తమూత్రపు వ్యాధి, థైలేరియాసీస్ లాంటి వ్యాధులు విజృంభిస్తూ రైతులకు నష్టం కలుగజేస్తున్నాయి. చాలా చోట్ల పశు వైద్యులు అందుబాటులో ఉండటం లేదని రైతుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
 పడిపోయిన పాల ఉత్పత్తి
 మూడు నెలలుగా గాలికుంటు వ్యాధి పశువులను కబలించడంతో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. జూలై, ఆగస్టు వరకు ప్రభుత్వ డెయిరీకి రోజుకు 75 వేల లీటర్ల పాలు వస్తుండగా సెప్టెంబర్‌లో క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజా వివరాల ప్రకారం ఇప్పుడు రోజుకు 40 వేల లీటర్లకు మించి రావడం లేదు. పశువులు మరణించడం, వ్యాధి బారిన పడిన పశువులకు వైద్య ఖర్చులు పెరగడంతో పాటు పాల ఉత్పత్తి తగ్గి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
 
 ప్రారంభమైన పశు బీమా
 జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పశు బీమా పథకం జిల్లాలో 15 రోజుల క్రితమే ప్రారంభమైంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన పది నెలల తరువాత మొదలు పెట్టినా.. ఇంకా చురుగ్గా చేయలేకపోతున్నారు. ఈ సంవత్సరంలో కనీసం 5 వేల పశువులకు బీమా చేయిస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నా ప్రచారం చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో బీమా పథకం ఉందా లేదా అనే మీమాంసలో ఉన్న రైతులు ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు.
 
 వ్యాక్సినేషన్‌తో అదుపులోకి
 కర్ణాటకతో పాటు చిత్తూరు జిల్లా నుంచి గాలికుంటు వ్యాధి వైరస్ వ్యాప్తి చెందడంతో వెంటనే అప్రమత్తమయ్యాం. అక్టోబర్ 19 నుంచి గాలికుంటు వ్యాధి నివారణకు జిల్లా వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్ (టీకాల కార్యక్రమం) ప్రారంభించి 15 రోజుల పాటు నిర్విరామంగా చేశాం. 10.02 లక్షల పశువులకు టీకాలు వేయడంతో వ్యాధి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాంపౌండర్ పోస్టులు, పశు వైద్యుల పోస్టులు త్వరలో భర్తీ అయ్యే అవకాశం ఉంది. అస్పత్రులకు మందులు తగినన్ని సరఫరా చేస్తున్నాం. మౌళిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా గోపాలమిత్రలకు షెల్టర్లు నిర్మిస్తున్నాం. పాడి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.            
  - డాక్టర్ వి.శ్యాంమోహన్‌రావు,
 పశుసంవర్ధక శాఖ జేడీ
 

మరిన్ని వార్తలు