భారీగా రొయ్యలు, చేపలు లభ్యం

26 Sep, 2014 01:35 IST|Sakshi
భారీగా రొయ్యలు, చేపలు లభ్యం
  • భారీగా రొయ్యలు, చేపలు లభ్యం
  • ఇతర ప్రాంతాలకు జోరుగా రవాణా
  • నాతవరం: తాండవ రిజర్వాయరులో చేపలు, రొయ్యల లభ్యత ఆశాజనకంగా ఉంది.  ఇక్కడి చేపలు, రొయ్యలకు గిరాకీ ఉండడంతో మత్స్యకారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది అనుకూల వాతావరణంతో తాండవలో రెండు నెలలుగా చేపలు వేట జోరుగా సాగుతోంది. గత ఏడాది తుపాన్ల సమయంలో రిజర్వాయరులోకి అధికంగా నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం బాగుంది.

    ఇది చేపలు ఏపుగా పెరగటానికి దోహదపడింది. ప్రస్తుతం అడపాదడపా వర్షలు కురవడంతో అయకట్టు భూములకు నీరు విడుదల చేస్తున్నా రిజర్వాయరులో నీటిమట్టం తగ్గలేదు. నెల రోజులుగా జలాశయంలోకి ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఆ ఎర్ర నీటికి  రిజర్వాయరు అడుగు భాగాన ఉన్న చేపలు బయటకు వస్తున్నాయి. ఫలితంగా వేటాడుతున్న మత్స్యకారులకు చేపలు ఆశించినంతంగా దొరుకుతున్నాయి. రోజూ తాండవలో 150 పైగా బోట్ల ద్వారా చేపల వేట జరుగుతోంది.

    ఇక్కడ చేపలకు రంగు రుచి బాగుండడం, ధర కూడా ఇతర మార్కెట్ల కంటే తక్కువగా ఉండడం వల్ల కొనుగోలుదార్లు పోటీపడుతుంటారు. ఇక్కడ దొరికే టైగర్ రొయ్యలు రుచిగా ఉండడంతో గిరాకీ ఉంటుంది. ఇక్కడ నుంచి రోజూ పెద్ద సంఖ్యలో వాహనాల్లో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు రవాణా చేస్తున్నారు.

    కొందరు బడా వ్యాపారులు ఇక్కడ మత్యకారులకు ముందుగా పెట్టుబడి పెట్టి వారి ద్వారా వేటాడించి చేపలు రొయ్యలు కొనుగోలు చేసి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయిస్తారు. ఈ ఏడాది తాండవ రిజర్వాయరులో  పెద్ద చేపలు కూడా బాగా లభిస్తున్నాయి. ఈ రిజర్వాయరులో చేపలు, రొయ్యలు ఊహించని విధంగా లభ్యం కావడం, ధర కూడా బాగుండడంతో మత్స్యకారులు ఆనంద పరవశులవుతున్నారు.
     

మరిన్ని వార్తలు