పశు మాఫియా ! ఘోరాతి గోరం!

13 Aug, 2015 00:17 IST|Sakshi

విజయనగరం కంటోన్మెంట్: వారపు సంతలంటే ఒకప్పుడు పాడి ఆవులతోనూ, దుక్కిటెడ్లతోనూ కళకళలాడేవి. రైతులే  స్వయంగా క్రయవిక్రయాలు జరిపేవారు. అందమైన బలిష్టమైన పాడి, దుక్కిపశువులుండే ఆ సంతలు ఇప్పుడు మాఫియా నీడలో నడుస్తున్నాయి. అప్పట్లో నెలకు రూ.పది వేల వ్యాపారం జరిగితే అదే పెద్ద రికార్డు కింద లెక్క.  కానీ ఇప్పుడు వారానికే దాదాపు రూ. 12 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. బక్కచిక్కిన శరీరంతో దీనంగా ఆహారం కోసం, గుక్కెడు నీటికోసం ఎదురు చూస్తున్న పశువులే సంతల్లో దర్శనమిస్తున్నాయి.  ఒడిశాలో పశువు రవాణా నిషేధం. దీంతో అక్కడి  మారుమూల ప్రాంతాల నుంచి దళారులు దాదాపు వారంరోజులపాటు గ్రాసం, నీరు ఇవ్వకుండా  నడిపిస్తూ తీసుకువచ్చి జిల్లాలోని మానాపురం, అచ్యుతాపురం,అలమండ తదితరసంతల్లో లారీల్లో కుక్కి కేరళ,చెన్నై రాష్ట్రాలకు పశువులను తరలిస్తున్నారు.
 
 జిల్లాలో పెదమానాపురం పశురవాణాకు ప్రధాన కేంద్రంగా మారింది. పశువుల రవాణాలో కనీస నిబంధనలు పాటించడంలేదు. ఒక వేగన్‌లో 30 నుంచి 45 వరకూ పశువులను కుక్కి తరలిస్తున్నారు. మాంసం కోసమే కదాని పశువుల కాళ్లు విరగొట్టి మరీ ఒక దానిపై మరో పశువును ఎక్కించి తరలిస్తున్నారు. పశువుల తరలింపులో కనీస నిబంధనలుకూడా పాటించడంలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు.  అడ్డుకోవాల్సిన పోలీసు,రెవెన్యూయంత్రాంగం పశుమాఫియాకు సహకరిస్తుండడంతో వారి వ్యాపారం కోట్లకు పడగలెత్తింది.
 
 వారానికి 25వేలు ....
 సంతల వారీగా ఒక వారంలో తరలించే పశువుల సంఖ్య ఇది..! జిల్లాలోని పార్వతీపురం,బొబ్బిలి,కూనేరు, అడ్డాపుశీల, సాలూరు, అచ్యుతాపురం,బొద్దాం,కంది వలస,మోపాడలతో పాటు పెదమానాపురం సంతల నుంచి ప్రతీ వారం 25వేలకు పైబడి పశువులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఒక్కొక్క పశువును రూ.4వేల నుంచి రూ. 15వేల  వరకూ కొనుగోలు చేస్తున్నారు.  ఒక్కొక్క పశువు ఖరీదు సగటున  రూ.5వేలకు లెక్కిస్తే  25వేల పశువుల ధర రూ.12.50 కోట్లవుతుంది.  
 
 44 పోలీసు స్టేషన్లు.. 20  చెక్‌పోస్టులు ...కేసులు ఎక్కడ?
 ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రా దాటే వరకూ ఎన్నో చెక్‌పోస్టులు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఎక్కడా పశురవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఒడిశా పశువులతో పాటు, జిల్లాకు చెందిన వాటిని కూడా రవాణా చేస్తున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రాకు వచ్చేందుకు రెండు దారులున్నాయి.  ఆ మార్గాల గుండా పశువులు ఆంధ్రాలోకి ప్రవేశిస్తున్నాయి. జిల్లాలో 44 పోలీస్ స్టేషన్లు, రెండు పోలీస్ చెక్‌పోస్టులున్నాయి. అలాగే ఇతర శాఖలకు చెందిన మరో 18 చెక్‌పోస్టులున్నా పశువుల తరలింపుపై   ఎవరూ ప్రశ్నించడం లేదు.    పాచిపెంట మీదుగా వచ్చినపుడు పి కోనవలస చెక్ పోస్ట్, అక్కడే  పోలీస్‌స్టేషన్, సాలూరులో సర్కిల్ కార్యాలయం,రామభద్రపురంలో పోలీస్‌స్టేషన్, ఎస్ బూర్జి వలస, పెదమానాపురంలలో పోలీస్ స్టేషన్లు,గజపతినగరంలో సర్కిల్ కార్యాలయం ఆ తరువాత బొండపల్లి, విజయనగరం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. విజయనగరం తరువాత కూడా వరుసగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఎక్కడా ఈ పశు రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. మరో పక్క రాయగడ నుంచి వచ్చినపుడు కూనేరు చెక్‌పోస్టు దగ్గర  నుంచి వరుసగా పోలీస్ స్టేషన్లున్నాయి. కానీ పశు రవాణా అడ్డుకోవడం లేదు.
 
 స్థానిక నేతల సహకారంతోనే....
   జిల్లాలో అన్ని రంగాల వారితో పరిచయముంటున్న కొందరు చోటామోటా స్థానిక నాయకులతో ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ పశురవాణా వ్యాపారులు సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. పశురవాణాలో  ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ నేతలు రంగంలోకి దిగుతారు.  వెంటనే   సెటిల్‌మెంట్‌కు  తెర తీస్తారు.   వారితో బేరంపెట్టుకుని మరెప్పుడూ ఈ పశు రవాణా జోలికి రాకుండా సెటిల్ చేస్తారు. అది ఒక్కసారే కావచ్చు! లేదా ప్రతీ వారం పెన్షన్ పద్ధతిలోనూ కావచ్చు. మొత్తానికి ఏదో ఒక సెటిల్‌మెంట్ ఖాయం. ఈ సెటిల్ మెంట్ అనేది చిన్న చిన్న వాళ్లయితే ఒకేసారి ఎంతో కొంత మొత్తాన్ని జేబులో పెట్టి పంపేస్తారు. నిత్యం వీడితో గొడవ పడాల్సి ఉంటుందని భావిస్తే ప్రతీ నెలా కొంత మొత్తం ఇస్తామని పరస్పర అంగీకారం జరుగుతుంది.ప్రస్తుతానికి ఈ రెండు విధానాలూ అమలవుతున్నాయి.
 
 రెవెన్యూ,పోలీస్‌యంత్రాంగాలకు మామ్మూళ్లు?
 జిల్లాలో పశు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ,పోలీస్ అధికారులు ప్రతినెలా పెద్ద ఎత్తున ఠంచన్‌గా  మామ్మూళ్లు అందుతుండడం వల్లే   పశుఅక్రమ రవాణా అడ్డూ ఆపూ లేకుండా జరిగిపోతోందనే విమర్శలు   వినిపిస్తున్నాయి.  
 
 వేలాది కిలోమీటర్ల నడక !
 జిల్లాలో ఉన్న సంతలతో పాటు ఒడిశాలోని చిత్ర తదితర సంతల నుంచి కొనుగోలు చేసి  మానాపురం వరకూ తరలిస్తారు.
 కాలినడకన మానాపురం వరకూ తరలించేందుకు స్థానికులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒక్కో వ్యక్తి 20 నుంచి 50 పశువులను అప్పగిస్తారు. వారు పశువులను తరలించినందుకుగాను ఒక్కొక్క పశువుకు రూ.150 నుంచి 200 వరకూ చెల్లిస్తారు.   రాత్రీ పగలు అనే తేడా లేకుండా పశువులకు విశ్రాంతి ఇవ్వకుండా వారం రోజుల పాటు నడిపించి మానాపురం సంతకు తీసుకువస్తారు. అలా తీసుకువచ్చిన పశువులకు గడ్డి,నీరు  ఇవ్వకుండా మానాపురం వద్ద  సామర్థ్యానికి మించి లారీల్లో కుక్కి తాళ్లతో బంధించి రవాణా చేస్తున్నారు. చెన్నై,కేరళ,తెలంగాణ  తదితరరాష్ట్రాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు.  
 
 జిల్లా కేంద్రం గుండా జరిగే పశువుల తరలింపుపై ఇటీవల ఏపీ గోసంరక్షణ సమాఖ్య తదితర సంస్థలు, ఇతరుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులు రూటు మార్చారు.  వేరే దారి గుండా పట్టణం వెలుపల జాతీయ రహదారి కి చేరుకుని విశాఖ మీదుగా తరలిస్తున్నారు.  
 
  ఆవేదన భరితంగా  అంబారావాలు
 రవాణా సమయంలో పశువులు దయనీయంగా అరుస్తున్నా పట్టించుకోవడం లేదు. వాటికి  గడ్డీ,నీరు ఇవ్వకుండా   తాళ్లతో బంధించి వందల కిలోమీటర్లు రవాణా చేస్తుండడంతో ఆకలికి అవి దీనంగా అరుస్తుంటే పెద్ద కర్రలతో కొట్టి వాటి నోరు మూయించి చెప్పనలవి కాని విధంగా   హింసిస్తున్నారు.  వారు పెట్టే హింస భరించలేక కబేళాకు వెళ్లకముందే పశువులు వాహనాల్లోనే మరణిస్తున్నాయి.   
 
 పశువుల అక్రమ రవాణా నిషేధం
 రాష్ట్రంలో పశువుల అక్రమ రవాణా పై నిషేధం ఉంది. జిల్లాలో జరుగుతున్నట్టు నా దృష్టికి రాలేదు. దాడులు చేయాలని పశుసంవర్ధక శాఖ జేడీకి   ఆదేశిస్తాం. కలెక్టర్ సూచనలతో అన్నిచర్యలూ తీసుకుని పశు మాఫియాపై గట్టి నిఘాపెడతాం.
                                                      బి రామారావు, జాయింట్‌కలెక్టర్,విజయనగరం
 
 తిరిగి మాపై  కేసులు పెడుతున్నారు.
 జిల్లాలో పశు అక్రమ రవాణా చేస్తున్నప్పుడు తాము అడ్డుకుంటే తిరిగి మాపై కేసులు పెట్టిస్తున్నారు. అధికారుల అండతోనే ఈ పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. చీపురుపల్లిలో ఎస్సై మా కార్యకర్తను కొట్టిన  విషయమై దేవాదాయ శాఖ మంత్రి ఆదేశించినా ఇప్పటికీ చర్యలు లేవు. ఇంతటి పశు మాఫియాను రాష్ట్రంలో ఎక్కడా చూడలేదు.
                                             - లోగిశ రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ,  ఏపీ గోసంరక్షణ సమాఖ్య
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా