లారీలోనే ముక్కిపోతున్న ధాన్యం

28 Sep, 2014 03:15 IST|Sakshi
లారీలోనే ముక్కిపోతున్న ధాన్యం

 - ఒకే లారీని రెండు చోట్ల సీజ్ చేసిన పోలీసులు
 - 15 రోజులుగా స్టేషన్ ఆవరణలోనే
 తడ: సుమారు రూ.3 లక్షల విలువైన ధాన్యం 15 రోజులుగా లారీలోనే ముక్కిపోతున్నాయి. ఇప్పటికే వాసన వస్తోందని, ఇక పారబోయడం మినహా మరోదారి లేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరుకు చెందిన రైతు గుమ్మా వెంకటేశ్వర్లు తన ధాన్యంతో పాటు పక్క రైతుల నుంచి కొంత ధాన్యం కొనుగోలు చేసి మిల్లులో విక్రయించేందుకు లారీలో బయలుదేరాడు. లారీలో 1010 రకానికి చెందిన రూ.3 లక్షల విలువైన 255 బస్తాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన నెల్లూరులోనే పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఆరబెట్టుకునేందుకు సరైన వసతి లేకపోవడంతో కోత కోసిన వెంటనే అమ్ముకునేందుకు మిల్లుకు తరలిస్తున్నానని, లారీని విడిపించాలని జాయింట్ కలెక్టర్, డీఎస్‌ఓలకు మొరపెట్టుకున్నాడు. వారు స్పందించి ధాన్యం విక్రయానికి సంబంధించిన ధృవపత్రాలను తీసుకుని లారీని విడిపించాలని ఎస్పీకి సిఫార్సు చేయడంతో లారీ విడులైంది. అప్పటికే పది రోజులు గడిచిపోవడం, ధాన్యం నాణ్యత దెబ్బతినడంతో మిల్లర్లు కొనుగోలు చేసేందుకు నిరాకరించారు. దీంతో రెడ్‌హిల్స్‌లో విక్రయించాలని భావించి బయలుదేరాడు. అయితే అదే లారీని 23వ తేదీ రాత్రి తడ సమీపంలో ఎస్బీ పోలీసులు సీజ్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అప్పటి నుంచి లారీ స్థానిక స్టేషన్ ఆవరణలోనే ఉండడంతో ధాన్యం ముక్కిపోతోంది.
 మూడు సరుకుల లారీల సీజ్
 బీవీపాళెం(తడ): ఎలాంటి బిల్లులు లేకుండా తమిళనాడు నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన మూడు సరుకుల లారీలను అధికారులను సీజ్ చేశారు.  చెక్‌పోస్టులో తనిఖీ చేయించుకోకుండా వెళ్లిపోతున్న రెండు ఐషర్ లారీలను ఏఓ మల్లికార్జునరావు వెంబడించి పూడి వద్ద పట్టుకున్నారు. ఒక లారీలో రూ.1.67 లక్షల విలువైన ప్రెషర్ కుక్కర్లు, మరోలారీలో రూ.1.63 లక్షల విలువైన ప్రెషర్ కుక్కర్లు ఉన్నాయి. వీటిని హైదరాబాద్‌కు తీసుకెళుతున్నామని డ్రైవర్లు చెబుతున్నప్పటికీ విజయవాడకు వెళుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో చెన్నై నుంచి నెల్లూరుకు వెళుతున్న ఓ లారీని తనిఖీ చేయగా ఎలాంటి బిల్లులు లేని రూ.8.22 లక్షల విలువైన ఊర్వశి సబ్బుల లోడు గుర్తించారు. కుక్కర్లకు 5 శాతం, సబ్బులకు 14.5 శాతం పన్ను విధించడంతో పాటు అంతే మొత్తంలో జరిమానా విధిస్తామని ఏఓ మల్లికార్జునరావు తెలిపారు.  



 

మరిన్ని వార్తలు