వీవీఆర్‌కే యాచేంద్ర..వెంకటగిరి చివరిరాజు

29 Jun, 2019 13:11 IST|Sakshi

సాక్షి, వెంకటగిరి(నెల్లూరు) : వెంకటగిరి రాజుల కీర్తి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తం అనడం అతిశయోక్తి కాదు. వెంకటగిరి రాజాలు అనగానే నేటితరం వారికి పెద్దరాజాగా కీర్తి గడించిన వెలుగోటి వెంకటశేష వరదరాజ గోపాలకృష్ణ యాచేంద్ర (వీవీఆర్‌కే యాచేంద్ర) వెంటనే గుర్తుకు వస్తారు.  వెంకటగిరి సంస్థానం 31వ తరానికి చెందిన ఆయన క్రీడలు, వ్యాపార, రాజకీయ రంగాల్లో విశిష్టతను చాటారు. వేటాడడం అంటే ఆయనకు మహా సరదా. ఆయన హయాంలో పెద్దపులులు (బెంగాల్‌ టైగర్స్‌)ను వేటాడారు.

వీవీఆర్‌కే యాచేంద్ర 2010 జూన్‌ 29వ తేదీన ఆయన హైదరాబాద్‌ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈయన వెంకటగిరి సంస్థానం చివరి పట్టాభిషిక్తుడిగా కీర్తి గడించారు. శనివారం ఆయన 9వ వర్ధంతి సందర్భంగా కైవల్యానది వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహం వద్ద వీవీఆర్‌కే యాచేంద్ర వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వెంకటగిరి ప్రాంతంలోని వెలుగొండలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి మొదలగు ప్రాంతాల్లో అడవుల్లో ఆయన వేట సాగించేవారని ఆనాటి తరం వారు చెబుతున్నారు. ఓ చేత్తో జీప్‌ నడుపుతూ గన్‌తో వేటాడడంలో ఆయన దిట్ట. ఇక 1954 –1960 మధ్య ప్రాంతంలో ఆంధ్రా రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. రాజకీయ రంగంలో 1967 –1973 మధ్య ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

1994లో వెంకటగిరి శాసనసభ్యుడిగా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి విజయం సాధించి గుర్తింపు సాధించారు. ఇక వెంకటగిరి పాలకేంద్రం సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేసే సమయంలో ఐదు ఎకరాలు, గోషాస్పత్రి ఏర్పాటు కోసస్పైదు ఎకరాలు, సత్యసాయి వరదరాజపురంగా పిలచే మందరిల్లు ప్రాంతంలో పేదలకు నివాసాల కోసం, ఉపాధ్యాయనగర్‌ సమీపంలో చేనేత కార్మికుల నివాసాల కోసం వీవర్స్‌కాలనీ, ఉపాధ్యాయనగర్‌ను నామమాత్రం ధరకు ఉపాధ్యాయుల నివాసాల కోసం అందించి వెంకటగిరి ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన కుమారులు రాంప్రసాద్‌ యాచేంద్ర, డాక్టర్‌ వీబీ సాయికృష్ణ యాచేంద్రతోపాలు మనవడు సర్వజ్ఞకుమార యాచేంద్ర ప్రస్తుతం వెంకటగిరి వైఎస్సార్‌సీపీలో కీలక నేతలుగా ఉంటూ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి సన్నిహితులుగా మెలుగుతున్నారు.   

మరిన్ని వార్తలు