చిత్తూరులో సోనియాగాంధీ శవయాత్ర

1 Aug, 2013 17:53 IST|Sakshi
చిత్తూరులో సోనియాగాంధీ శవయాత్ర

రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి వ్యతిరేకంగా రాయలసీమలో ఆందోళనలు మిన్నంటాయి. చిత్తూరులో వరుసగా రెండో రోజూ బంద్ తీవ్రంగా కొనసాగింది. తిరుమల-తిరుపతి మినహా ఎక్కడా బస్సులు తిరగలేదు. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు బంద్ చేసి ఆందోళనలకు దిగారు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా మూసేశారు. పలు ప్రాంతాల్లో నిరసనలు తీవ్రస్థాయిలో జరిగాయి. కుప్పంలో ద్రవిడ వర్సిటీ విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకో చేపట్టారు.

ఎస్వీయూ విద్యార్థులు చేపట్టిన బైక్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. చిత్తూరులో ఎమ్మెల్యే సీకే బాబు నిరవధిక దీక్షకు దిగారు. పాఠశాల విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి, గులాబీ పువ్వులతో సీకే బాబు దీక్షకు మద్దతు తెలిపారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు నెహ్రూ, ఇందిర విగ్రహాలను ధ్వంసం చేశారు. సోనియాగాంధీ శవయాత్ర నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు చెవుల్లో పూవ్వులు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు.

కర్నూలులో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. అక్కడక్కడ హింసాత్మక ఘటనలు జరిగాయి. డోన్‌లో సమైక్య జేఏసీ విద్యార్థులు మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి గెస్ట్‌హౌస్‌ ఎదుట ధర్నా చేపట్టారు. మంత్రి పదవికి ఏరాసు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక బస్డాండ్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తగులబెట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సమైక్యవాదులతో కలిసి ఆందోళన చేపట్టారు.

వైఎస్‌ఆర్‌జిల్లాలో ఆగ్రహజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బద్వేలు, రాజంపేట సహా వివిధ పట్టణాల్లో కూడా ఆందోళనలు ఉద్ధృతంగా సాగాయి. జమ్మలమడుగులో మానవహారం నిర్మించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి శనిలా దాపురించిందని మండిపడ్డారు. పులివెందులలో సమైక్యవాదులు భారీ ర్యాలీ చేపట్టి సోనియాగాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాజీపేటలో కర్నూలు-చిత్తూరు జాతీయరహదారిపై రాకపోకలను అడ్డుకున్న సమైక్యవాదులు.. సీమాంధ్ర నేతలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్సీపీ చేపట్టిన బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది. పలు చోట్ల ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై తమ ప్రతాపం చూపించారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు గేట్లకు తాళాలు వేశారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుత్తిలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే హిందూపురంలో అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఎస్కేయూ విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. ఆందోళనల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు.

మరిన్ని వార్తలు